పీవోకేలో భారీ కాల్పులు.. 30మందికి పైగా మృతి, 200మందికి గాయాలు..?
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:22 PM
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో అల్లర్లు చెలరేగాయి. స్థానికులు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ మద్దతుదారులు 30మందికి పైగా మృతిచెందగా.. సుమారు 200మంది గాయపడినట్లు తెలుస్తోంది.
కరాచీ: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK)లో అల్లర్లు చెలరేగాయి. స్థానికులు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(JAAC) మద్దతుదారులు 30మందికి పైగా మృతిచెందగా.. సుమారు 200మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఆర్థిక, రాజకీయ సమస్యలపై నిరసనలు చేపడుతున్న జేఏఏసీ సంస్థను పాకిస్థాన్ ప్రభుత్వం గత వారం నిషేధించడంతో భారీ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆదివారం రావల్‌కోట్‌లో నిరసనకారులు, భద్రతా దళాలు మధ్య జరిగిన ఘర్షణల్లో పదులకొద్దీ ఆందోళనకారులు మృత్యువాత పడినట్లు సమాచారం.
జేఏఏసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ నిషేధించడంతో శుక్రవారం రాత్రి ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో భద్రతా దళాల కాల్పుల్లో ఓ వ్యాపారి మరణించారంటూ ఆరోపణలు రావడంతో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఆదివారం వ్యాపారి మృతదేహాన్ని ఉంచిన ఆస్పత్రి మార్చురీ బయట జేఏఏసీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గుమిగూడారని రావల్‌కోట్ కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా.. కొందరు నిరసనకారులు ఆటోమేటిక్ రైఫిళ్లు, పెట్రోల్ బాంబులు, ఇతర ఆయుధాలతో దాడి చేశారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగగా.. ఆరుగురు నిరసనకారులు మృతిచెందారని కమిషనర్ పేర్కొన్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
అయితే, అధికారుల కథనాన్ని జేఏఏసీ మద్దతుదారులు ఖండించారు. అధికారుల లెక్కల కంటే మృతుల సంఖ్య అధికంగా ఉంటుందని ఆరోపిస్తున్నారు. జులై 27న జరగనున్న ప్రాంతీయ శాసనసభ ఎన్నికల్లో 45 స్థానాలకు గాను 12 స్థానాలను శరణార్థులకు కేటాయించారు. దీన్ని వ్యతిరేకిస్తూ జేఏఏసీ నిరసనలకు పిలుపునిచ్చిన ఒకరోజు ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ఇంటర్నెట్ నిలిపివేతలు, విద్యుత్ కొరత, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సహజ వనరుల దోపిడీ, రాజకీయంగా పక్కన పెట్టడం వంటి అంశాలపై కొన్ని నెలలుగా జేఏఏసీ ఆందోళనలు చేస్తోంది. పలు ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రజా సంక్షేమం దృష్ట్యా జేఏఏసీని స్థానిక ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి
కాంగోలో అలజడి సృష్టిస్తున్న ఎబోలా.. 101 చేరిన మృతుల సంఖ్య..
రిజైన్ చేసి హ్యాపీగా వెళ్లిపోవచ్చు... రెబల్ ఎంపీలకు టీఎంసీ ఘాటు సందేశం