అలా అయితే భారత్ సాయం తీసుకుంటాం.. పీఓకే హెచ్చరిక..
ABN , Publish Date - Jun 30 , 2026 | 08:36 PM
ఇస్లామాబాద్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనలు మిన్నంటాయి. 22వ రోజు నిరసన కార్యక్రమం సందర్భంగా పీఓకే నేతలు పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఇస్లామాబాద్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనలు మిన్నంటాయి. 22వ రోజు నిరసన కార్యక్రమం సందర్భంగా పీఓకే నేతలు పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. పీఓకే ఇకపై పాకిస్థాన్ కంట్రోల్‌లో ఉండదని తేల్చి చెప్పారు. తమకు పాకిస్థాన్‌తో అవసరం లేదని అన్నారు. మంగళవారం రావల్‌కోట్‌లోని ఈద్గా గ్రౌండ్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో నిరసనకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏఏసీ నేతలు మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్థాన్‌లో భాగం కాదని అన్నారు. ఆహార సరఫరాలపై ఆంక్షలు విధిస్తే భారత్ సాయం తీసుకుంటామని చెప్పారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ నియంతలా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు.
వివాదానికి కారణాలు ఇవే..
వచ్చే ఎన్నికల కోసం పీఓకే అసెంబ్లీలోని మొత్తం స్థానాల్లో 12 సీట్లను కాశ్మీరీ శరణార్థుల కోసం పాకిస్థాన్ ప్రభుత్వం కేటాయించింది. ఈ శరణార్థులు పీఓకేలో కాకుండా పాకిస్థాన్‌లోని లాహోర్, కరాచీ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దీన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 12 స్థానాల రిజర్వేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు అధిక కరెంట్ బిల్లులు, కోతలు పీఓకే ప్రజల్ని వేధిస్తున్నాయి. పాకిస్థాన్‌కు అవసరమైన అత్యధిక హైడ్రో పవర్ పీఓకేలోని మంగ్లా డ్యామ్ ద్వారానే ఉత్పత్తి అవుతోంది. కానీ, స్థానిక ప్రజలకు మాత్రం పాక్ ప్రభుత్వం అధిక విద్యుత్ బిల్లులు వసూలు చేస్తోంది.
గంటల తరబడి పవర్ కట్ విధిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. పాకిస్థాన్‌లో ఉన్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వల్ల అక్కడ గోధుమ పిండి, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను ఎత్తివేయడంతో సామాన్యులు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. బియ్యం, విద్యుత్, గోధుమ పిండి వంటి నిత్యావసరాల ధరలు తగ్గించాలని, ప్రాథమిక హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది శాంతియుతంగా గత 22 రోజుల నుంచి నిరసనలు తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్: తుమ్మల
హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!