పాకిస్థాన్‌లో రైలు ప్రమాదం.. ఆరుగురి మృతి
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:29 PM
పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల రైలు పట్టాలు తప్పడంతో ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న రైలు పట్టాలు తప్పడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. కరాచీ నుంచి పెషావర్‌కు వెళ్తున్న రెహమాన్ బాబా ఎక్స్‌ప్రెస్ రైలు పంజాబ్ ప్రావిన్స్‌లోని షేర్ షా ప్రాంతం వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ముల్తాన్‌లోని నిష్తర్ ఆసుపత్రికి తరలించారు.
రైలు పట్టాలు తప్పడానికి గల కచ్చితమైన కారణాలు, ప్రమాద సమయంలో రైలులో ఉన్న మొత్తం ప్రయాణికుల సంఖ్య, గాయపడిన వారి పరిస్థితిపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ.. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ.. గాయపడిన వారికి సాధ్యమైనంత మెరుగైన వైద్య చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గతంలోనూ పాకిస్థాన్‌లో జరిగిన పలు రైలు ప్రమాదాలు భారీ ప్రాణనష్టానికి దారితీశాయి. 2023లో దక్షిణ పాకిస్థాన్‌లో ప్రయాణికుల రైలుకు చెందిన పది బోగీలు పట్టాలు తప్పిన ఘటనలో 30 మంది మరణించగా.. 90 మందికి పైగా గాయపడ్డారు. తాజాగా.. రెహమాన్ బాబా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం మరోసారి అక్కడి రైల్వే భద్రతపై చర్చకు దారితీసింది.
ఇవీ చదవండి
ఇంచ్ గ్యాప్‌లో బయటపడ్డాడుగా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
సీసీటీవీ కెమరా నుంచి తప్పించుకోలేవు బ్రో.. జాగ్రత్త! వైరల్ వీడియో