భారత్ తలుచుకుంటే ఒక్క సంతకంతో.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్య
ABN , Publish Date - Apr 30 , 2026 | 07:22 PM
భారత్‌లో ఇంధన ధరలు పెరగకపోవడంపై పాక్ మంత్రి ఒకరు పలు అభినందనపూర్వక వ్యాఖ్యలు చేశారు. పాక్ దుస్థితికి గల కారణాలను కూడా వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అనేక దేశాల్లో ఇంధన ధరలు పెరిగాయి. అయితే, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండటంతో దాయాది దేశం పాక్‌కు కూడా ఇక్కడి వ్యవస్థను ప్రశంసించక తప్పలేదు. ముడి చమురు విషయంలో తమ దేశానికి భారత్‌కూ ఉన్న తేడా ఏమిటో పాక్ పెట్రోలియం శాఖ మంత్రి అలీ మలిక్ తాజాగా వివరించారు.
స్థానిక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి అలీ మలిక్ పలు అభినందన పూర్వక వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ వద్ద ముడి చమురుకు సంబంధించి కేవలం వాణిజ్య నిల్వలే కాదు వ్యూహాత్మక నిల్వలు కూడా ఉన్నాయి. సంక్షోభ సమయంలో అవి అక్కరకు వచ్చాయి. మనలాగా వారు ఐఎమ్‌ఎఫ్ సాయం తీసుకోవట్లేదు. ధరలు పెరిగినప్పుడు పన్నుల్లో కోత పెట్టి ధరాభారం పెరగకుండా జాగ్రత్త పడ్డారు. భారత్‌కు ఆ ఆర్థిక వెసులుబాటు ఉంది’
‘నష్టాలను పూడ్చుకునేందుకు పెట్రోల్, డీజిల్‌పై పన్నులు విధించాలని ఐఎమ్‌ఎఫ్‌తో కలిసి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇంధన ధరలు మూడు నాలుగు రెట్లు పెరిగాయి. దీంతో, ఇంధనాలపై లెవీని పూర్తిగా తగ్గించి భారాన్ని ప్రభుత్వానికి బదిలీ చేద్దామని భావించాము. కానీ ఇలా చేస్తే నష్టాల తగ్గింపు విషయంలో ఐఎమ్ఎఫ్‌కు ఇచ్చిన మాటను తప్పాల్సి వచ్చేది. అలా చేసుంటే ఇంతకంటే తీవ్రమైన ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ ఐఎమ్‌ఎఫ్‌తో చర్చలు జరిపి లీటరుకు రూ.80ల మేర లెవీలో కోత విధించేందుకు ఒప్పుకునేలా చేశాము’ అని అన్నారు. ఇటీవల పాక్ ప్రభుత్వం పన్నులో కోత పెట్టడంతో అక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ.378లకు తగ్గింది.
భారత్ స్థాయిలో తమ వద్ద వ్యూహాత్మక ముడి చమురు నిల్వలు లేవని పాక్ మంత్రి తెలిపారు. ‘మన వద్ద అలాంటివేమీ లేవు. మనకు కేవలం వాణిజ్య నిల్వలు మాత్రమే ఉన్నాయి. అవీ వారం రోజులకే సరిపోతాయి. ఇక రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తులు కేవలం 21 రోజులకే సరిపోతాయి. మన పరిస్థితి భారత్ వలె లేదు. ఇండియా వద్ద గరిష్ఠంగా 70 రోజులకు సరిపడా వ్యూహాత్మక ముడి చమురు నిల్వలు ఉన్నాయి. ఒక్క సంతకంతో వాటిని భారత్ దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేయగలదు’ అని అన్నారు. తమ వద్ద ఒక్క రోజుకు సరిపడా వ్యూహాత్మక నిల్వలు కూడా లేవని విచారం వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!
పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..