పాక్ ప్రధాని కుమార్తెకు ముందస్తు బెయిల్..
ABN , Publish Date - Apr 28 , 2026 | 09:20 PM
భారీ అవినీతి, మనీలాండరింగ్ కేసులో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కుమార్తె రబియా ఇమ్రాన్, ఆమె భర్త ఇమ్రాన్ యూసఫ్‌లకు లాహోర్ ప్రత్యేక కోర్టు మంగళవారం నాడు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇస్లామాబాద్: భారీ అవినీతి, మనీలాండరింగ్ కేసులో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కుమార్తె రబియా ఇమ్రాన్, ఆమె భర్త ఇమ్రాన్ యూసఫ్‌లకు లాహోర్ ప్రత్యేక కోర్టు మంగళవారం నాడు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. భార్యాభర్తలిద్దరినీ మే 7వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(FIA)ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి అష్ఫాక్ అహ్మద్ వారికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు 2022లో యూకే వెళ్లిపోయిన ఈ దంపతులు నేడు తమ న్యాయవాదితో కలిసి వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరయ్యారు.
2022లో రబియా ఇమ్రాన్, ఆమె భర్త ఇమ్రాన్ యూసఫ్‌లను అరెస్టు చేయాలంటూ జవాబుదారీ కోర్టు (అకౌంటబులిటీ కోర్టు) శాశ్వత వారెంట్లను జారీ చేసింది. పంజాబ్ సాఫ్ పానీ కంపెనీ కేసుకు సంబంధించిన వందల కోట్ల అవినీతి కేసులో ఈ వారెంట్లు జారీ అయ్యాయి. గత వారం ఈ అరెస్టు వారెంట్లను కోర్టు నిలిపివేసింది. కాగా, ఇమ్రాన్ ఖాన్ గత ప్రభుత్వ హయాంలో జవాబుదారీ కోర్టు వారిని అరెస్టు చేయాలంటూ ఈ వారెంట్లు జారీ చేసింది. రబియా ఇమ్రాన్, ఇమ్రాన్ యూసఫ్‌ను పరారీలో ఉన్న నేరస్థులుగా ప్రకటించింది. ఈ అవినీతి కేసులో ప్రధాని షెహబాజ్ పేరు వచ్చినప్పటికీ సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషిగా విడుదలయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఇంధన సంక్షోభం వేళ యూఏఈ సంచలన నిర్ణయం..
ప్రభుత్వం, ప్రవాసుల మధ్య వారధిగా జయరాం