Share News

బంగ్లాదేశ్‌కు ఊహించని షాకిచ్చిన పాకిస్థాన్

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:05 PM

పాక్‌తో స్నేహబంధాన్ని పెంచుకునేందుకు తహతహతహ లాడుతున్న బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్ తగిలింది. అణుఇంధనంతో బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన రష్యా విమానాన్ని తమ గగనతలం మీదుగా అనుమతించేందుకు పాక్ నిరాకరించింది.

బంగ్లాదేశ్‌కు ఊహించని షాకిచ్చిన పాకిస్థాన్
Russian flight Denied Permission by Pak

ఇంటర్నెట్ డెస్క్: పాక్‌తో స్నేహబంధాన్ని పెంచుకునేందుకు తహతహతహ లాడుతున్న బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్ తగిలింది. అణుఇంధనంతో బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన రష్యా విమానాన్ని తమ గగనతలం మీదుగా అనుమతించేందుకు పాక్ నిరాకరించింది. చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్ ఇందుకు గల కారణాన్ని కూడా వివరించకపోవడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం నోరెళ్లబెట్టింది.

బంగ్లాదేశ్ ప్రస్తుతం విద్యుత్ కొరతతో సతమతం అవుతోంది. ఇటీవల నిర్మాణం పూర్తైన రూప్పూర్ అణుకేంద్రం రెండవ యూనిట్ నుంచి వీలైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభించాలని ప్రయత్నిస్తోంది. ఈ కేంద్రం నిర్మాణంలో రష్యా ప్రభుత్వ రంగ అణుఇంధన సంస్థ రోసాటమ్ కీలక పాత్ర పోషించింది. రోసాటమ్‌కు చెందిన ఓ విమానం అణుఇంధనంతో బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు సిద్ధం కాగా పాక్ చివరి నిమిషంలో మోకాలడ్డు పెట్టింది. అజర్‌బైజాన్, కజకస్థాన్, పాకిస్థాన్, భారత్ మీదుగా విమానం బంగ్లాదేశ్‌కు చేరాల్సి ఉన్నా పాక్ నిర్ణయంతో బ్రేకులు పడ్డాయి. దీంతో, బంగ్లాదేశ్‌లో అణు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం మరింత ఆలస్యం కానుంది.


రష్యా విమానానికి పాక్ అనుమతులు ఇవ్వకపోవడం నిజమేనని బంగ్లాదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫకీర్ మెహబూబ్ ఆనమ్ తెలిపారు. చివరి నిమిషంలో అనుమతులను నిరాకరించారని చెప్పారు. ఇందుకు గల కారణాలను కూడా పాక్ చెప్పలేదని ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ అణు ఇంధన సంస్థ కూడా మౌనాన్నే ఆశ్రయించింది. అయితే, సాంకేతిక కారణాల వల్లే అనుమతులు రాకపోయి ఉండవచ్చని బంగ్లాదేశ్‌లోని పాక్ హైకమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో మరోమార్గంలో బంగ్లాదేశ్‌కు యూరేనియమ్‌ను తరలించేందుకు రోసాటమ్ నిర్ణయించింది.


ఈ వార్తలనూ చదవండి:

బలోచ్ ఆర్మీ మహిళా దళం.. 9 మంది పాక్ సైనికులు ఖతం.. వైరల్ వీడియో

అది సుంకాల ఎఫెక్ట్.. భారతీయ స్టీల్‌ప్లాంట్‌పై యూఎస్ మంత్రి కామెంట్

Updated Date - Sep 29 , 2026 | 03:16 PM