Share News

డ్రోన్ దాడుల భయం.. పాక్ సైనిక పోస్టులకు ‘చేపల వలలు’!

ABN , Publish Date - Oct 06 , 2026 | 01:23 PM

డ్రోన్ దాడుల ముప్పు పెరగడంతో పాకిస్థాన్ సైన్యం వినూత్న రక్షణ మార్గాన్ని ఎంచుకుంది. సున్నిత ప్రాంతాల్లో ఆర్మీ, పోలీస్ చెక్‌పోస్టులపై చేపల వలలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

డ్రోన్ దాడుల భయం.. పాక్ సైనిక పోస్టులకు ‘చేపల వలలు’!
డ్రోన్ దాడుల నుంచి రక్షణకు పాక్ సైన్యం చేపల వలలు

ఇస్లామాబాద్ / పేషావార్, అక్టోబర్ 6: అఫ్గానిస్థాన్ సరిహద్దు సమీపంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ తీవ్రవాదుల నుంచి వరుస డ్రోన్ దాడులు పెరుగుతుండటంతో పాకిస్థాన్ సైన్యం ఒక వినూత్న పరిష్కారాన్ని ఎంచుకుంది. తమ ఆర్మీ, పోలీస్ చెక్‌పోస్టులను డ్రోన్ దాడుల నుంచి రక్షించుకోవడానికి ఖరీదైన యాంటీ-డ్రోన్ వ్యవస్థలకు బదులుగా చేపల వలలు (Fishing Nets) ఏర్పాటు చేస్తోంది. (Pakistan Army Fishing Nets)


ఆల్ జజీరా వార్తా సంస్థ నివేదిక ప్రకారం, పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ నేతృత్వంలో సరిహద్దుల్లోని సున్నితమైన ప్రాంతాల్లో ఈ వలలను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ ఒక చెక్‌పోస్ట్‌ను చేపల వలలతో కప్పడానికి దాదాపు $1,400 (రూ. 1.30 లక్షలు) మాత్రమే ఖర్చు చేస్తోంది. ఆధునిక యాంటీ-డ్రోన్ సిస్టమ్‌ల ధర $5,000 నుంచి $50 లక్షల డాలర్ల వరకు ఉండటంతో సైన్యం ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది.


డ్రోన్లు చెక్‌పోస్ట్‌లపైకి వచ్చినప్పుడు వాటి ప్రోపెల్లర్లు ఈ వలల్లో చిక్కుకుని ఆగిపోతాయి. ఒకవేళ డ్రోన్ వలపైనే పేలిపోయినా, దాని శిథిలాలు, ష్రాప్‌నెల్ నేరుగా చెక్‌పోస్ట్ లోపల పడకుండా గాలిలోనే చెల్లాచెదురై ప్రాణనష్టం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.

డిసెంబర్ 2025లో TTP మౌల్వీ సలీమ్ హక్కానీ నేతృత్వంలో ప్రత్యేక డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. విపణిలో లభించే వాణిజ్య డ్రోన్‌‌లను సవరించి, హోండా మోటార్ సైకిల్ బ్యాటరీల సహాయంతో ఎక్కువ సేపు ఎగిరేలా చేస్తూ దాడులకు తెగబడుతున్నారు.

పాకిస్థాన్ గతంలో చైనా, టర్కీ తయారీ యాంటీ-డ్రోన్ వ్యవస్థలపై ఆధారపడగా, అవి ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో ఇప్పుడు అమెరికాకు చెందిన 'పవర్‌అస్' సంస్థ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

హంగు జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులపై జరిగిన దాడుల అనంతరం భద్రతా సిబ్బంది బ్యారక్‌‌ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. చేపల వలలు తాత్కాలికంగా కొంత ఊరటనిచ్చినప్పటికీ, TTP తీవ్రవాదుల ఆధునిక డ్రోన్ తంత్రాలను అడ్డుకోవడంలో పాకిస్థాన్ సైనిక రక్షణ వ్యవస్థలోని లోపాలను ఇది స్పష్టంగా ఎత్తిచూపుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.

ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్

Updated Date - Oct 06 , 2026 | 01:23 PM