ఈసారి ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్
ABN , Publish Date - May 14 , 2026 | 05:09 AM
ఇరాన్‌తో చర్చలు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్న నేపథ్యంలో.. ఆ దేశంపై మరోసారి సైనిక చర్య చేపట్టేందుకు అమెరికా సమాయత్తమవుతున్నట్లు...
కొత్తపేరుతో ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా వ్యూహం
వాషింగ్టన్, మే 13: ఇరాన్‌తో చర్చలు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్న నేపథ్యంలో.. ఆ దేశంపై మరోసారి సైనిక చర్య చేపట్టేందుకు అమెరికా సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. చర్చలు పూర్తిగా విఫలమైతే ఇరాన్‌పై గతంలో కంటే భీకరంగా దాడులు చేస్తామని ట్రంప్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఆ సైనిక చర్య కొత్త పేరుతో ఉంటుందని అధికార వర్గాలను ఉటంకిస్తూ అమెరికా మీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్‌తో కలిసి ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యకు ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తే ఆ సైనిక చర్యకు ‘ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్’ అని పేరు పెట్టాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తున్నట్లు తెలిసింది. ఏదైనా దేశంపై అమెరికా సైన్యం యుద్ధం చేయాలన్నా, సైనిక చర్య చేపట్టాలన్నా ప్రభుత్వం ముందుగా ఆ దేశ చట్ట సభ అయిన కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. ఒకవేళ అధ్యక్షుడు తన విశేషాధికారాలు ఉపయోగించి యుద్ధం మొదలుపెట్టినా 48 గంటల్లోగా కాంగ్రె్‌సకు తెలియజేయాలి. యుద్ధం మొదలుపెట్టిన నాటి నుంచి 60 రోజుల్లో కాంగ్రెస్ ఆమోదం పొందాలి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండానే అధ్యక్షుడు ట్రంప్ మొదలుపెట్టారు. మే 1తోనే ఆ ఆపరేషన్‌కు కాంగ్రెస్ అనుమతి పొందాల్సి గడువు తీరిపోయింది. అయితే, ఏప్రిల్‌లో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరటంతో.. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసిందని ట్రంప్ ప్రభుత్వం కాంగ్రె్‌సకు తెలియజేసింది. అందువల్ల కాంగ్రెస్ అనుమతి అవసరం లేదని పేర్కొంది. ఇప్పుడు అదే పేరుతో సైనిక చర్యను తిరిగి ప్రారంభిస్తే కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. కాంగ్రె్‌సలోని చాలామంది సభ్యులు ఇరాన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తుండటంతో అనుమతి లభిస్తుందో లేదోననే అనుమానం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి ఇరాన్‌పై దాడి చేయాల్సి వస్తే కొత్త పేరుతో మొదలు పెట్టాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఐఆర్‌జీసీ మూలాలపై గురి..
ఇరాన్‌లోని సైనిక, పౌర మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీసినా ఆ దేశం లొంగిపోకపోవటంతో అమెరికా తన వ్యూహాలను మారుస్తోంది. నౌకాశ్రయాల దిగ్బంధనంతో ఇప్పటికే ఇరాన్ చమురు వాణిజ్యాన్ని దెబ్బతీసిన ఆ దేశం.. తాజాగా ఇరాన్‌లోని అత్యంత శక్తిమంతమైన మిలిటరీ దళం ఐఆర్‌జీసీ ఆర్థిక మూలాలపై దృష్టి పెట్టింది. ఐఆర్‌జీసీకి నిధులు అందజేస్తున్న సంస్థలు, వ్యక్తుల వివరాలు తెలిపినవారికి రూ.145 కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఇరాన్ సుప్రీంలీడర్‌కు మాత్రమే జవాబుదారీ అయిన ఐఆర్‌జీసీ.. తాజా యుద్ధం తర్వాత దేశంలో మరింత పట్టు పెంచుకున్నట్లు సమాచారం. ఇరాన్ ప్రభుత్వాన్ని కూడా లెక్కచేయకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్