ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన ఉగ్ర స్థావరాలు.. పీఓకేలో మళ్లీ కడుతున్నారా?
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:55 PM
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పాకిస్థాన్ మళ్లీ పునర్నిర్మిస్తున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని కొన్ని ఉగ్రస్థావరాలను ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ధ్వంసం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పాకిస్థాన్ మళ్లీ పునర్నిర్మిస్తున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని కొన్ని ఉగ్రస్థావరాలను ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ధ్వంసం చేసింది. ఆ ఉగ్ర మౌలిక వసతులు తిరిగి నిర్మాణ దశలో ఉన్నట్లు తాజా విజువల్స్ సూచిస్తున్నాయి. దీంతో సరిహద్దు అవతల ఉగ్ర మౌలిక వసతులను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి (Operation Sindoor, PoK terror camps).
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ 2025 మేలో ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద సంస్థలకు చెందిన పలు స్థావరాలను భారత సాయుధ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. లష్కరే తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు సంబంధించిన ఉగ్ర మౌలిక వసతులపై దాడులు జరిగాయి. ఆ దాడుల్లో మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు కేంద్రం ప్రకటించింది (Pak terror hideouts rebuilt).
పీవోకేలో గతంలో దెబ్బతిన్న కొన్ని ఉగ్ర స్థావరాల వద్ద మళ్లీ నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం. లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న, విడివిడిగా ఉండే క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం కూడా పలు నివేదికలు వచ్చాయి. భారత నిఘా వ్యవస్థలు, ఉపగ్రహాలు, డ్రోన్ల నిఘా నుంచి తప్పించుకునేందుకు దట్టమైన అటవీ ప్రాంతాలను ఎంచుకుంటున్నట్లు సమాచారం (LoC terror infrastructure).
పెద్ద స్థావరాల స్థానంలో చిన్న, విడివిడిగా ఉన్న ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేసే వ్యూహాన్ని పాకిస్థాన్ అనుసరిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. లూని, పుట్వాల్, తైపు పోస్ట్, జమీలా పోస్ట్, ఉమ్రాన్‌వాలి, చప్రార్, ఫార్వర్డ్ కహుటా, చిన్నా చక్, జంగ్లోరా వంటి ప్రాంతాల్లో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త క్యాంపుల్లో థర్మల్ సెన్సర్లు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలు వంటి సాంకేతిక పరికరాలను కూడా ఉపయోగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..