Share News

మోదీ.. నా ప్రశ్నకు బదులేదీ?

ABN , Publish Date - May 20 , 2026 | 02:42 AM

భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై పత్రికా స్వేచ్ఛపై తానడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ జవాబివ్వకుండా వెళ్లిపోయారని నార్వే మహిళా జర్నలిస్టు హెలె లెంగ్‌ స్వెండ్సెన్‌ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు రాజకీయంగా దుమారం రేపుతోంది.

మోదీ.. నా ప్రశ్నకు బదులేదీ?

  • కలకలం రేపిన నార్వే మహిళా జర్నలిస్టు.. హక్కుల ఉల్లంఘనపై ప్రశ్నిస్తే పట్టించుకోని భారత ప్రధాని

  • తర్వాత ఎంబసీ మీడియా సమావేశానికి ఆమెకు ఆహ్వానం

  • ఇండియాలో హక్కుల ఉల్లంఘన లేదన్న విదేశాంగ ప్రతినిధి సిబి జార్జ్‌

  • దిక్కూమొక్కూలేని సంస్థల కథనాలతో ప్రశ్నలు అడుగుతారని ఆగ్రహం

  • నార్వే జర్నలిస్టుపై భారీగా ట్రోలింగ్‌

ఓస్లో(నార్వే), మే 19: భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై పత్రికా స్వేచ్ఛపై తానడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ జవాబివ్వకుండా వెళ్లిపోయారని నార్వే మహిళా జర్నలిస్టు హెలె లెంగ్‌ స్వెండ్సెన్‌ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు రాజకీయంగా దుమారం రేపుతోంది. సోమవారం తాము చర్చించిన అంశాలపై నార్వే ప్రధాని జోనాస్‌ గహర్‌ స్టోర్‌తో కలిసి మోదీ ఆ దేశ రాజధాని ఓస్లోలో విలేకరుల సమావేశంలో ప్రకటన చేశారు. ఆయన వెళ్లిపోతుండగా స్వెండ్సెన్‌ మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించారు. అయితే ఇద్దరు ప్రధానులూ ప్రకటన మాత్రమే చేస్తారని.. ప్రశ్నలు, జవాబులు ఉండవని నార్వే ప్రభుత్వం ముందుగానే స్పష్టం చేసింది. అయినా స్వెండ్సెన్‌ ప్రశ్న అడగడానికి ప్రయత్నం చేశారు. మోదీ పట్టించుకోకుండా గహర్‌ స్టోర్‌తోపాటు నిష్క్రమించారు. దీంతో ఆమె ‘ఎక్స్‌’లో మోదీని ఆక్షేపిస్తూ పోస్టు పెట్టారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో నార్వే ప్రథమస్థానంలో ఉందని.. భారత్‌ 157వ స్థానంలో పాలస్తీనా, యూఏఈ, క్యూబాలతో పోటీపడుతోందని ఆక్షేపించారు. తాము సహకరిస్తున్న దేశాలను ప్రశ్నించడం తమ విధిగా పేర్కొన్నారు. ‘మోదీ నా ప్రశ్నకు జవాబివ్వలేదు’ అని ఆ పోస్టుకు శీర్షిక పెట్టారు. ఆయన వేదికపై నుంచి వెళ్లిపోతున్న వీడియోను కూడా షేర్‌ చేశారు. పత్రికాస్వేచ్ఛలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న నార్వే జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానమివ్వరని ఆమె బిగ్గరగా అరవడం అందులో వినిపించింది. ఆ తర్వాత రాత్రి 9.30గంటలకు ఓస్లోలోని భారత ఎంబసీ కార్యాలయం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసింది. దీనికి స్వెండ్సెన్‌ను కూడా ఆహ్వానించింది. ‘మీ దేశంలో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనలను ఆపుతామని మీరు హామీ ఇవ్వగలరా? భారతీయ మీడియా నుంచి సంక్లిష్ట ప్రశ్నలు స్వీకరించడాన్ని మోదీ ప్రారంభిస్తారా’ అని ఆమె ఈ సందర్భంగా అధికారులపై ప్రశ్నలవర్షం కురిపించారు. విదేశాంగ కార్యదర్శి (వెస్ట్‌) సిబి జార్జ్‌ ఆమె ప్రశ్నలకు సుదీర్ఘంగా జవాబిచ్చారు.

2.jpg


మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను తోసిపుచ్చారు. న్యాయం, స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ భారత రాజ్యాంగ విలువలుగా ఉన్నాయని తెలిపారు. అయితే ఇండియాలో హక్కుల ఉల్లంఘనలు ఉన్నాయని.. అలాంటప్పుడు ఆ దేశాన్ని ఎలా విశ్వసించాలని స్వెండ్సెన్‌ ప్రశ్నించారు. దీనికి ప్రపంచంలో చాలా దేశాలతో భారత్‌ విశ్వసనీయ భాగస్వామిగా ఉందని జార్జ్‌ వివరించారు. జి-20 సదస్సు, ఇటీవలి ఏఐ ఇంపాక్ట్‌ సదస్సును విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. కొవిడ్‌ విజృంభించినప్పుడు వందకుపైగా దేశాలకు భారత్‌ వ్యాక్సిన్లు పంపిందన్నారు. తాను అడిగినదానికి నేరుగా జవాబివ్వాలని స్వెండ్సెన్‌ మళ్లీ అడుగగా.. సిబి గట్టిగా స్పందించారు. భారత్‌ను ఎందుకు విశ్వసించాలో సమాధానం ఇస్తున్నానని, మధ్యలో అడ్డుకోవద్దని కోరారు. ‘భారత్‌ 5వేల సంవత్సరాల చరిత్రగల నాగరిక దేశం. ప్రపంచమంతా కొవిడ్‌తో విలవిల్లాడినప్పుడు భారత్‌ చేసిన సాయమే విశ్వాసానికి పునాది’ అని స్పష్టంచేశారు. భారతదేశ స్థాయి ఏమిటో కొందరికి అవగాహన లేదన్నారు. దిక్కూమొక్కూలేని, పనికిమాలిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రచురించే ఒకట్రెండు కథనాలు చదివి ప్రశ్నలు అడుగుతుంటారని ఆక్షేపించారు. హక్కుల ఉల్లంఘనల గురించి ఆందోళన అక్కర్లేదని.. ఎవరి హక్కులైనా ఉల్లంఘనకు గురైతే కోర్టుకు వెళ్లే వెసులుబాటు వారికి ఉందని గుర్తుచేశారు. అయితే స్వెండ్సెన్‌ సంతృప్తి చెందలేదు. హక్కుల ఉల్లంఘనలపై జవాబులు రాబట్టేందుకు తాను, మరో సహచర జర్నలిస్టు ఎంతో ప్రయత్నించామని.. కానీ విఫలమయ్యామని.. భారత ప్రతినిధులు కొవిడ్‌, యోగా విషయాల్లో తమ దేశ కృషి గురించి చెప్పారంటూ మరో పోస్టుపెట్టారు.

భారత ప్రతిష్ఠ ఏం కావాలి: రాహుల్‌

తన ప్రశ్నకు మోదీ జవాబివ్వలేదని నార్వే జర్నలిస్టు పెట్టిన పోస్టుపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘అన్ని విషయాల్లో ప్రధాని..అంతర్జాతీయ వేదికపై కొన్ని ప్రశ్నలకే కంగారుపడి పారిపోతే భారత్‌ ప్రతిష్ఠ ఏమవుతుంది’ అని ప్రశ్నించారు. దాచడానికి ఏమీలేకపోతే భయపడాల్సిన అవసరం లేదని ‘ఎక్స్‌’లో వ్యాఖ్యానించారు.


చైనాకు స్నేహితురాలు?

హక్కుల ఉల్లంఘనపై మోదీని ప్రశ్నించిన స్వెండ్సెన్‌ పేరు సోషల్‌ మీడియాలో మార్మోగుతోంది. ఆమె ఫోలోవర్ల సంఖ్య ఒక్కరాత్రిలోనే 800 నుంచి 17 వేలకు చేరింది. మరోవైపు.. ఆమెపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్‌ ప్రారంభమైంది. ‘విదేశీ మొక్క’, ‘గూఢచారి’, ‘చైనా తాబేదారు’ అని విమర్శలు వెల్లువెత్తాయి. మానవ హక్కుల ఉల్లంఘనకు పెట్టింది పేరైన చైనాను సూపర్‌పవర్‌గా ప్రశంసిస్తూ, జిన్‌పింగ్‌ను కీర్తిస్తూ ఆమె గతంలో రాసిన కథనాలను ప్రస్తావిస్తున్నారు. మీడియా సమావేశంలో మోదీతో పాటు ఆమె దేశ ప్రధాని కూడా ఉన్నారని.. ఆయనా ప్రశ్నలు స్వీకరించలేదని గుర్తుచేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఆమెను సమర్థిస్తున్నారు. మోదీ 2014లో ప్రధాని అయ్యాక ఒక్కసారి కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయలేదని ఆక్షేపిస్తున్నారు. తనపై విమర్శలకు స్వెండ్సెన్‌ ఇంకో పోస్టులో వివరణ ఇచ్చారు. ‘ఇలా రాయాల్సి వస్తుందని ఏనాడూ అనుకోలేదు. నేను ఏ ప్రభుత్వమో పంపిన విదేశీ గూఢచారిణిని కాదు. నా వృత్తి జర్నలిజం’ అని ఆమె ట్వీట్‌ చేశారు. వాస్తవానికి ఈమె ఫ్రీలాన్సర్‌. నార్వేలో పలు పత్రికల తరఫున పనిచేశారు. ‘ఎక్స్‌’లో ఆమె చివరిగా 2024 ఏప్రిల్‌ 10న కనిపించారు. కొకైన్‌కు బానిసలైన యువత గురించి నాడు ఆమె పోస్టు చేశారు. కాగా, మోదీ నుంచి జవాబు రాబట్టలేని స్వెండ్సెన్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని ఇంటర్వ్యూ కోరడం గమనార్హం. అయితే ఆయన నుంచి స్పందన రాలేదు.

Updated Date - May 20 , 2026 | 07:34 AM