నేపాల్-భారత్ సరిహద్దులు మూసివేత.. ఎందుకంటే..
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:33 PM
సోషల్ మీడియా ఎఫెక్ట్ మామూలుగా ఉండటం లేదు. ముఖ్యంగా నేపాల్‌లో దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంటోంది. తాజాగా వచ్చిన ఓ టిక్ టాక్ వీడియో.. నేపాల్-భారత్ సరిహద్దులు పాక్షికంగా మూసివేతకు కారణమైంది.
ఆంధ్రజ్యోతి, జనవరి 6: దక్షిణ నేపాల్‌లో టిక్‌టాక్ వీడియోతో మొదలైన అల్లర్లు.. నేపాల్-భారత్ సరిహద్దులు మూసివేసేదాకా వెళ్లాయి. బిర్‌గంజ్, పర్సాలో కర్ఫ్యూ విధించే పరిస్థితి ఏర్పడింది. నేపాల్‌లోని దక్షిణ ప్రాంతం (మధేశ్ ప్రావిన్స్)లో ఇటీవల ఒక టిక్‌టాక్ వీడియో కారణంగా మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి.
ధనుషా జిల్లాలోని కమలా మున్సిపాలిటీలో ఇద్దరు ముస్లిం యువకులు (హైదర్ అన్సారీ, అమానత్ అన్సారీ) పోస్ట్ చేసిన వీడియో హిందూ మత భావాలను దెబ్బతీసిందని ఆరోపణలు రావడంతో స్థానికులు ఓ మసీదును ధ్వంసం చేశారు. దీనికి ప్రతిగా ముస్లిం సముదాయం నిరసనలు చేపట్టడంతో ఉద్రిక్తతలు బిర్‌గంజ్ (పర్సా జిల్లా)కు వ్యాపించాయి.
బిర్‌గంజ్‌లో నిరసనకారులు టైర్లు తగలబెట్టి, రోడ్లపైకి వచ్చారు. పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనల నేపథ్యంలో పర్సా జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ (DAO).. బిర్‌గంజ్ మెట్రోపాలిటన్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు, తర్వాత కర్ఫ్యూ విధించారు.
జనవరి 5న సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమైన కర్ఫ్యూ జనవరి 6 మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పొడిగించారు. భారత్-నేపాల్ సరిహద్దు ప్రాంతమైన బిర్‌గంజ్ (రక్సాల్ సరిహద్దు సమీపం)లో ఈ అల్లర్లు జరగడంతో వ్యాపార వాణిజ్యాలు, ప్రయాణాలపై ప్రభావం చూపాయి. అయితే సరిహద్దులు పాక్షికంగా మూసివేశారు. వీడియో పోస్ట్ చేసిన యువకులతోపాటు మసీదు ధ్వంసంలో పాల్గొన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మధేశ్ ప్రావిన్స్‌లోని ఎనిమిది జిల్లాల్లో భద్రతను పెంచారు. స్థానిక అధికారులు, సంస్థలు సామాజిక సామరస్యాన్ని కోరుతూ పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి ఉద్రిక్తతలు త్వరగా వ్యాపించడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు అలర్ట్.. మరింత పెరిగిన బంగారం ధర..
బీసీ కులగణనపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారా..
Read Latest Telangana News and National News