Share News

నేపాల్‌ వరద విపత్తుకు వారం..

ABN , Publish Date - Sep 03 , 2026 | 05:56 AM

భయానక వరదలు నేపాల్‌ను అతలాకుతలం చేసి (గతనెల 26న) వారం రోజులు గడిచినా.. ఈ మహా విలయం నుంచి హిమాలయదేశం పూర్తిగా తెరిపినపడలేదు. రోడ్లు, వంతెనలు...

నేపాల్‌ వరద విపత్తుకు వారం..

ఇంకా తెరిపినపడని హిమాలయ దేశం

  • సహాయక చర్యలకు డ్రోన్లే ఆధారం

  • 1243కు పెరిగిన మృతుల సంఖ్య..

ఇంకా జాడలేని 4,858 మంది

కాఠ్మాండు, న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: భయానక వరదలు నేపాల్‌ను అతలాకుతలం చేసి (గతనెల 26న) వారం రోజులు గడిచినా.. ఈ మహా విలయం నుంచి హిమాలయదేశం పూర్తిగా తెరిపినపడలేదు. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయి, అనేక ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో.. సహాయక కార్యక్రమాలకు డ్రోన్లు కీలకంగా మారాయి. ఇటు నేపాల్‌, అటు చైనాలోని టిబెట్‌ పరిధిలో మరణించిన వారి సంఖ్య 1,243కు పెరగ్గా.. 4,858 మంది ఆచూకీ కోసం సహాయక బృందాలు ముమ్మరంగా శోధిస్తున్నాయి. భారత్‌ బుధవారం ఐదో విడత సాయాన్ని పంపింది. ఐదు టన్నుల అత్యవసర ఔషధాలతోపాటు, ఆహారం ఇందులో ఉన్నాయి. అలాగే, 11 మందితో కూడిన సహాయక బృందాన్ని కూడా తరలించింది. బాధితులకు చేయూతనిచ్చేందుకు బాలీవుడ్‌ నటుడు, మానవతావాది సోనూసూద్‌ తన బృందంతో కలసి ఖాట్మండులో అడుగుపెట్టారు. తమ వెంట దుప్పట్లు, ఆహార సామగ్రి తీసుకెళ్లారు. బాధితులను గుర్తించడం, వారికి ఆహారం, ఔషధాలు చేరవేయడం దగ్గర్నుంచి.. మృతదేహాల తరలింపునకు కూడా డ్రోన్లనే ఉపయోగిస్తున్నారు. నువాకోట్‌ జిల్లాలోని దేవీఘాట్‌-3 నుంచి దేవిఘాట్‌-5 వరకు భౌగోళికంగా అత్యంత ప్రమాదకరమైనది. అక్కడి నుంచి ఏడు మృతదేహాలను డ్రోన్ల ద్వారానే (యూఏవీలు) తరలించారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన ప్రాంతాలకు ఏఐ ఆధారిత డ్రోన్లను పంపుతున్నారు. ‘‘తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం ఉందా? ఔషధాలు ఏమైనా అవసరమా?.. చేతులు పైకెత్తి తెలియజేయండి’’అని డ్రోన్లకు అమర్చిన స్పీకర్ల ద్వారా ప్రకటిస్తున్నారు. నేలపైనున్న బాధితుల స్పందన ఆధారంగా వారికి కావాల్సిన సామగ్రిని డ్రోన్ల ద్వారా చేరవేస్తున్నారు. విపత్తుబారిన పడిన ప్రాంతాల నుంచి ఇప్పటికి 6,541 మందిని రక్షించారు. మరోవైపు 911 మృతదేహాల వివరాలను నేపాల్‌ పోలీస్‌ విభాగం తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. నేపాల్‌లో ఎడతెరిపిలేని వర్షాలతో మళ్లీ వరదముప్పు పొంచి ఉంది.

పరిహారం చెల్లించాల్సిందే..

భారీ వరదలకు భూతాపం పెరిగి, మంచు కొండలు కరగడమే కారణమని.. దీని కారణంగా నష్టపోయిన నేపాల్‌కు చైనా, అమెరికా, భారత్‌ నష్ట పరిహారాన్ని చెల్లించాలని ఆ దేశం డిమాండ్‌ చేసింది. తమకిచ్చేది సాయం కాదని, అది పరిహారమని స్పష్టం చేసింది. ప్రంపచంలో 29-33ు మేర కార్బన్‌డయాక్సైడ్‌ను చైనాయే విడుదల చేస్తోందని, ఆ తర్వాత అమెరికా ఏటా 12.7ు, భారత్‌ 7.3ు చొప్పున కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నందున.. తమకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఆ దేశాలపై ఉందని నేపాల్‌ విదేశాంగ మంత్రి శిశిర్‌ ఖనాల్‌ అన్నారు.


హిమాలయాల్లో ప్రమాదకరంగా 9 సరస్సులు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: హిమాలయాల్లో తొమ్మిది హిమానీనద సరస్సులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని ఐఐటీ మండీ హెచ్చరించింది. హిమానీనదాలు కరగడం వల్ల ఆ సరస్సులు నీటితో విస్తరిస్తున్నాయని వెల్లడించింది. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది. హిమాలయాల్లోని 2 వేల సరస్సులపై అధ్యయనం చేసిన ఐఐటీ మండీ బృందం.. వాటిలో 9 నుంచి 12 సరస్సులు ప్రమాదకరంగా ఉన్నాయంటూ ఓ నివేదికను రూపొందించింది. దీనిపై ఐఐటీ మండీ స్కూల్‌ ఆఫ్‌ సివిల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ వ్యవస్థాపక చైర్‌పర్సన్‌ డెరిక్స్‌ శుక్లా మాట్లాడుతూ, పర్యాటకం పెరగడం, కాలుష్యం, ధూళి పేరుకుపోతుండటం వల్ల హిమాలయాల్లో గ్లేసియర్లు కరిగిపోతున్నాయని చెప్పారు. శాశ్వతంగా ఉండే గట్టి మంచు (పెర్మాఫ్రాస్ట్‌) కూడా పర్యావరణ మార్పులతో కరిగిపోతోందని, దీనివల్ల హిమాలయాల్లో అసమతుల్యత ఏర్పడుతోందని అన్నారు. నేపాల్‌లో ఒక్కసారిగా విరుచుకుపడ్డ వరదలకు గ్లేసియర్లు కూలిపోవడంతో పాటు పెర్మాఫ్రాస్ట్‌ కరగడం కూడా కారణమని వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 05:56 AM