నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. అసలు ఏం జరిగింది?
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:25 PM
నేపాల్‌లో ఆకస్మిక వరదలు అనేక మందిని బలితీసుకున్నాయి. అయితే, నేపాల్ ఇలాంటి ముప్పును నిత్యం ఎదుర్కొంటూనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నేపాల్ భౌగోళిక స్వరూపమే ఇందుకు కారణమని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో నేడు ఉదయం అకస్మాత్తుగా ముంచుకొచ్చిన వరదలు అనేక మందిని పొట్టనపెట్టుకున్నాయి. 105 మంది భారతీయులు కూడా ఈ విపత్తులో గల్లంతయ్యారు. చైనాతో సరిహద్దుకు సమీపంలోని రసువా జిల్లాలోని భోటే కోశీ నదిలో ఒక్కసారిగా వరద పొట్టెత్తడంతో తీరంలోని అనేక గ్రామాలు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో నేపాల్‌కు దిగువన ఉన్న బిహార్, యూపీ రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. మరోవైపు, ఈ అకస్మిక వరదలకు కారణం ఏంటో తెలుసుకునేందుకు నేపాల్ అధికారులు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు.
నిత్యం ముప్పు అంచున నేపాల్..
ఆకస్మిక వరదలు కేవలం గంటల వ్యవధిలోనే విరుచుకుపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారిగా భారీ స్థాయిలో కుండపోత వర్షం కురిసినా, లేదా నదీప్రవాహానికి అడ్డుగా ఉండే కొండచరియలు విరిగి పడిన సందర్భాల్లో కూడా ఆకస్మిక వరదుల దిగువన ఉన్న ప్రాంతాలను ముంచెత్తుతాయి. కొండల్లోని మంచు కరగడంతో ఏర్పడే గ్లేషియల్ సరస్సులు అస్థిరమై ఒక్కసారిగా కిందకు దూసుకొచ్చిన సందర్భాల్లో కూడా లోతట్టు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తుతాయి. అంతెత్తున ఉండే కొండల నుంచి కిందకు వేగంగా దూసుకొచ్చే నీటి ప్రవాహానికి తన దారిలో ఉన్న అన్ని నిర్మాణాలను నేలమట్టం చేయగల శక్తి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే, రసువా జిల్లాలో నేడు వర్షాలకు అవకాశం తక్కువని అక్కడి వాతావరణ శాఖ ముందే అంచనా వేసింది. కానీ నేపాల్‌కు ఎగువన ఉన్న టిబెట్‌లో భారీ వర్షం కురిసిన విషయం శాటిలైట్ చిత్రాల్లో బయటపడ్డట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయమై తమను ముందస్తుగా హెచ్చరించడంలో చైనా విఫలమైందని ఇప్పటికే నేపాల్ జర్నలిస్టు ఒకరు నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిమాలయాల్లో ఉన్న నేపాల్‌లో భారీ పర్వతాలు, వాటి నుంచి కిందకు వేగంగా దూసుకొచ్చే నదులతో ఎల్లప్పుడూ ముప్పు పొంచి ఉంటుంది. ముఖ్యంగా వానాకాలంలో కురిసే వర్షాల కారణంగా కొండ కోనల్లో పోటెత్తే వరదలు చూస్తుండగానే మహోగ్రరూపం దాలుస్తాయి. ఇది చాలదన్నట్టు వాతావరణ మార్పులు పరిస్థితులను మరింత జటిలం చేస్తున్నాయి.
భూతాపం పెరుగుతుండటంతో నేపాల్‌లోని కొండలపై ముంచు కరిగిపోతోంది. హిమనదాలు కనుమరుగు అవుతున్నాయి. ఫలితంగా కొండలపై భారీ గ్లేషియల్ సరస్సులు ఏర్పడుతున్నాయి. కొండప్రాంతాలు సహజంగా అస్థిరంగా ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో కొండచరియుల విరిగిపడ్డా లేక కాస్త ఎక్కువ వర్షం కురిసినా సరస్సులు కట్టలు తెంచుకుని దిగువనున్న ప్రాంతాలను ముంచెత్తే అవకావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 1000 మంది గల్లంతు..
మోదీ వ్యతిరేక ర్యాలీ పెట్టుకోండి.. న్యూయార్క్ మేయర్‌పై అమెరికన్ సింగర్ ఫైర్..