రియల్ లైఫ్ 'బ్యాట్‌మ్యాన్'.. దొంగలను వేటాడి, స్తంభాలకు కట్టేస్తున్న ముసుగు వీరుడు!
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:27 PM
సినిమాల్లో ముసుగు వేసుకుని వచ్చి నేరస్థులను నడిరోడ్డుపై శిక్షించే 'బ్యాట్‌మ్యాన్' పాత్రను మనం చూసే ఉంటాం. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఘటనలే నిజజీవితంలో జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అతడిని నెటిజన్లు 'మెక్సికన్ బ్యాట్‌మ్యాన్'గా పిలుచుకుంటున్నారు.
మెక్సికో సిటీ, జూన్ 29: సినిమాల్లో ముసుగు వేసుకుని వచ్చి నేరస్థులను నడిరోడ్డుపై శిక్షించే 'బ్యాట్‌మ్యాన్' పాత్రను మనం చూసే ఉంటాం. ఇప్పుడు సరిగ్గా అలాంటి వరుస ఘటనలే మెక్సికోలో నిజంగా జరుగుతున్నాయి. బైక్ దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న దొంగలను వేటాడి, వారిని నడిరోడ్డుపై కరెంట్ స్తంభాలకు డక్ టేప్‌తో కట్టేస్తున్న ఓ అపరిచిత వ్యక్తి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. సోషల్ మీడియాలో అతడిని నెటిజన్లు 'మెక్సికన్ బ్యాట్‌మ్యాన్', 'బ్యాట్‌మ్యాన్ ఆఫ్ లాగోస్ డి మోరెనో' అని పిలుస్తున్నారు. అయితే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఈ ముసుగు వీరుడిని పట్టుకోవడానికి స్థానిక పోలీసులు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.
స్తంభాలకు టేపులతో.. ముఖాలపై పిల్లి మీసాలతో..!
మెక్సికోలోని జలిస్కో రాష్ట్రంలో ఉన్న లాగోస్ డి మోరెనో మున్సిపాలిటీలో జూన్ 13 నుంచి ఈ విచిత్ర సంఘటనలు మొదలయ్యాయి. కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఇలాంటివి కనీసం ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ 'బ్యాట్‌మ్యాన్' అర్ధరాత్రి వేళల్లో ఒంటరిగా తిరుగుతూ బైక్ దొంగలను పట్టుకుంటున్నాడు. వారిని చితకబాది, రోడ్డు పక్కన ఉండే విద్యుత్ స్తంభాలకు డక్ టేపులతో కదలకుండా కట్టేస్తున్నాడు. అంతటితో ఆగకుండా వారు దొంగిలించిన బైక్‌లను కూడా వారి పక్కనే ఉంచేసి వెళ్తున్నాడు.
అంతేకాదు, ఆ దొంగల ముఖాలపై స్కెచ్ పెన్నులతో పిల్లి మీసాలు, గడ్డాలు గీసి, వారి నుదిటిపై స్పానిష్ భాషలో 'రటెరో'(దొంగ) అని రాస్తున్నాడు. ఒక ఘటనలోనైతే ఇద్దరు దొంగలను కలిపి ఒకే స్తంభానికి కట్టేసి, వారి తలపైన గులాబీ రంగులో ఓ వార్నింగ్ బోర్డ్ కూడా పెట్టాడు.
రంగంలోకి దిగిన పోలీసులు
ఈ ఘటనలపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్తంభాలకు ఉన్న దొంగలను విడిపించి, గాయాలైన వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే, చట్టప్రకారం పోలీసులు వీరిని దొంగలుగా కాకుండా.. దాడికి గురైన బాధితులుగా పరిగణిస్తుండటం గమనార్హం.
స్థానిక భద్రతా కార్యదర్శి జువాన్ పాబ్లో హెర్నాండెజ్ మాట్లాడుతూ.. ఈ దాడులకు పాల్పడుతున్న వ్యక్తి కోసం తాము ముమ్మరంగా గాలిస్తున్నామని తెలిపారు. ఈ దాడులకు ఉపయోగించిన రెండు వాహనాలను ఇప్పటికే గుర్తించామని, ఇది ఒకే వ్యక్తి చేస్తున్న పనా లేక ఏదైనా గ్రూప్ చేస్తోందా అనే కోణంలో విచారణ చేపట్టామని చెప్పారు.
నెటిజన్ల ప్రశంసలు.. హక్కుల సంఘాల ఆందోళన
లాగోస్ డి మోరెనో ప్రాంతంలో ఇటీవల కాలంలో మోటార్ సైకిల్ దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో విసిగిపోయిన స్థానిక ప్రజలు, నెటిజన్లు ఈ 'మెక్సికన్ బ్యాట్‌మ్యాన్' చర్యలను టిక్‌టాక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తెగ పొగిడేస్తున్నారు. 'పోలీసులు చేయలేని పనిని అతడు చేస్తున్నాడు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కానీ, మానవ హక్కుల సంఘాలు మాత్రం ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాయి. నేరస్థులైనా సరే, ఇలా సొంతంగా శిక్షలు వేయడం వల్ల సమాజంలో హింస మరింత పెరుగుతుందని, ఇది న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసినట్టవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
జైపుర్‌లో విషాదం.. గోడ కూలడంతో ముగ్గురు కార్మికుల మృతి
గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్‌కు పునాది: శివరాజ్‌సింగ్