Share News

ట్రంప్‌ సన్నిహిత సెనేటర్‌ మృతి

ABN , Publish Date - Jul 13 , 2026 | 06:09 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు అత్యంత సన్నిహితుడు, సెనేటర్‌ లిండ్సే గ్రాహమ్‌(71) మరణించారు. శనివారం ఉన్నట్లుండి అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస...

ట్రంప్‌ సన్నిహిత సెనేటర్‌ మృతి

  • లిండ్సే గ్రాహమ్‌ అనుమానాస్పద మృతి

  • విషప్రయోగం జరిగినట్లు ప్రచారం

  • ఇరాన్‌, రష్యాపై అనుమానాలు

వాషింగ్టన్‌, జూలై 12: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు అత్యంత సన్నిహితుడు, సెనేటర్‌ లిండ్సే గ్రాహమ్‌(71) మరణించారు. శనివారం ఉన్నట్లుండి అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆయన కార్యాలయం ఆదివారం ప్రకటించింది. గ్రాహమ్‌ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌కు బద్ద విరోధి అయిన గ్రాహమ్‌.. ఆ దేశంపై ట్రంప్‌ యుద్ధం ప్రకటించటంలో కీలకపాత్ర పోషించారు. ట్రంప్‌ ప్రభుత్వ విదేశాంగ విధానంలోనూ ఆయన పాత్రే కీలకం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌, చైనా వంటి దేశాల నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై భారీగా ప్రతీకార సుంకాలు విధించటంలోనూ ఆయన ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు.

గతవారం ఆయన ఉక్రెయిన్‌కు వెళ్లి ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. గ్రాహమ్‌ను అంతమొందిస్తామని ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) ఇటీవలే ప్రకటించింది. అంతలోనే ఆయన మరణించటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రాహమ్‌ మృతి వెనుక ఇరాన్‌ లేదా రష్యా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కొందరు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించారని చెబుతున్నారు. దక్షిణ కరోలినాకు చెందిన గ్రాహమ్‌ 2002, 2008, 2014, 2020లో సెనేట్‌కు ఎన్నికయ్యారు. అంతకు ముందు 1994లో హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్‌కు ఎన్నికయ్యారు. ఇరాన్‌కు ఆయన జీవితకాల విరోధి. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. విదేశాంగ విధాన రూపకల్పనలో గ్రాహమ్‌కు అధిక ప్రాధాన్యం దక్కింది. భారత్‌, చైనా సహా పలుదేశాలపై 500 శాతం ప్రతీకార సుంకాలు విఽధించేందుకు తీసుకొచ్చిన చట్టం రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. ఇరాన్‌పై యుద్ధం చేయాలని ట్రంప్‌ను ప్రోత్సహించారు. విదేశాంగ విధానంలో ట్రంప్‌ తీసుకున్న ప్రతి ప్రధాన నిర్ణయం వెనుక గ్రాహమ్‌ ఉన్నట్లు చెబుతారు. ఆయన మృతిపట్ల ట్రంప్‌ తీవ్ర సంతాపం తెలిపారు. గ్రాహమ్‌ నిజమైన దేశభక్తుడన్నారు.

Also Read:

ఫిరంగి కోసం పోరాటం

వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు

Updated Date - Jul 13 , 2026 | 06:52 AM