కూచిపూడికి డిస్నీ వరల్డ్ వావ్!
ABN , Publish Date - Oct 27 , 2026 | 03:49 AM
‘ధరాతలంపైనే అత్యంత సమ్మోహన ప్రదే శం (ది మోస్ట్ మ్యాజికల్ ప్లేస్ ఆన్ ఎర్త్)గా పేరుగాంచిన వాల్ట్ డిస్నీ వరల్డే ఆ నృత్యానికి మంత్రముగ్ధురాలైందేమో!
ఆ అద్భుతమైన వేదికపై తొలిసారిగా తెలుగు సంప్రదాయ నృత్య ప్రదర్శన
దీపావళి డ్యాన్స్ ఫెస్టివల్‌లో భాగంగా మెరిసిన ప్రవాసీయుల బృందం
(డాలస్ నుంచి కిలారు గోకుల్ కృష్ణ)
‘‘ధరాతలంపైనే అత్యంత సమ్మోహన ప్రదే శం (ది మోస్ట్ మ్యాజికల్ ప్లేస్ ఆన్ ఎర్త్)గా పేరుగాంచిన వాల్ట్ డిస్నీ వరల్డే ఆ నృత్యానికి మంత్రముగ్ధురాలైందేమో! ఏది నిజమో.. పర్యాటకులను గమ్మత్తయిన ప్రపంచంలో విహరింపజేసే ఆ అద్భుత వేదికలో తొలిసారిగా తెలుగు సంప్రదాయ నృత్యమైన కూచిపూడి ప్రదర్శన తళుక్కుమంది. ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండోలోని వాల్ట్ డిస్నీ వరల్డ్‌లో ‘దీపావళి డ్యాన్స్ ఫెస్టివల్-2026’లో భాగంగా శని, ఆదివారాల్లో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. కాలిఫోర్నియాకు చెందిన ప్రవాసాంధ్రురాలు, సిలికాన్ ఆంధ్ర-ఆరియా విశ్వవిద్యాలయ గురువు భండారి సాహితీ లత శిష్య బృందం నేతృత్వంలో జరిగిన ఈ ప్రత్యేక ప్రదర్శనలు అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శనివారం డిస్నీ మ్యాజిక్ కింగ్‌డమ్‌లోని ప్రసిద్ధ కోట ఎదుట డిస్నీ టీమ్ ప్రత్యేకంగా రూపొందించిన పాటకు అనుగుణంగా ఈ బృందం నృత్యం చేస్తూ పరేడ్‌లో పాల్గొంది ఆదివారం డిస్నీ యానిమల్ కింగ్‌డమ్‌లోని ఫైండింగ్ నెమో థియేటర్లో జరిగిన ఇంటర్నేషనల్ డ్యాన్స్ షోకే స్ లో ఈ బృందం కూచిపూడి వైభవం పేరిట రెండో ప్రదర్శననిచ్చింది. 1600 మందికి పైగా ప్రేక్షకులు వీక్షించిన ఈ కార్యక్రమంలో బ్రిటన్, ఆస్ట్రేలియా, కరేబియన్ దీవులకు చెందిన కళలతో పాటు కూచిపూడికి ప్రాధాన్యం దక్కింది. ఇత్తడి పళ్లెం అంచులపై నిల్చుని క్లిష్టమైన లయకు అనుగుణంగా ప్రదర్శించే సంప్రదాయ తరంగం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ ప్రదర్శనకు అవసరమైన సామగ్రిని తీసుకువెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి వచ్చిందని, భండారి సాహితీ లత తెలిపారు. అనుమతుల కోసం ఏడాదిగా తాను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. కాగా ప్రదర్శనలో శివుడిగా కూచిభొట్ల అనూష.. కృష్ణుడిగా ఆర్యవీర్.. పార్వతి, రాధ రూపాల్లో సంప్రదాయ వస్త్రాలు, ఆభరణాలతో యువ నర్తకులు భారతీయ సంస్కృతి, కళావైభవాన్ని ప్రపంచవేదికపై చాటారు. చీరకట్టుతో మిన్నీ, షేర్వాణీలో మిక్కీ ప్రధానాకర్షణగా నిలిచారు. జొన్నవిత్తుల రచించి, రామాచారి స్వరపరిచిన ప్రత్యేక గీతానికి ఈ బృందం ప్రదర్శననిచ్చింది.