Share News

ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్‌ హువాంగ్‌

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:33 AM

అమెరికా చిప్‌ల తయారీ దిగ్గజ కంపెనీ ఎన్విడియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో)గా జెన్సన్‌ హువాంగ్‌ను ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డు తిరిగి నియమించింది.

ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్‌ హువాంగ్‌
jenson

  • 25 శాతం పెరిగిన ఎన్విడియా కంపెనీ షేర్‌ విలువ

వాషింగ్టన్‌, నవంబరు 23: అమెరికా చిప్‌ల తయారీ దిగ్గజ కంపెనీ ఎన్విడియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో)గా జెన్సన్‌ హువాంగ్‌ను ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డు తిరిగి నియమించింది. చైనా గూఢచారిగా అనుమానిస్తున్న అలిస్‌ హువాంగ్‌ అనే వ్యాపారవేత్తతో వివాహేతర సంబంధం బయటపడటంతో జెన్సన్‌ హువాంగ్‌ ఈ నెల 12న ఎన్విడియా సీఈవో పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై కంపెనీ స్వతంత్ర విచారణ కూడా జరుపుతోంది. జెన్సన్‌ను తిరిగి సీఈవోగా నియమించే అవకాశం లేదని డైరెక్టర్ల బోర్డు చైర్‌పర్సన్‌ హార్వే సీ జోన్స్‌ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. పూర్తిస్థాయి కొత్త సీఈవోను వెదికేందుకు హీడ్రిక్‌ అండ్‌ స్ట్రగుల్స్‌ అనే కన్సల్టింగ్‌ సంస్థను కూడా నియమించారు. అయితే, ఆ తర్వాత కొద్దిరోజులకే బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకుంది. జెన్సన్‌తో డైరెక్టర్ల బోర్డు వరుస సమావేశాలు నిర్వహించిన తర్వాత.. ఆయన శక్తిసామర్థ్యాలపై విశ్వాసం వ్యక్తంచేసిందని జోన్స్‌ సోమవారం వెల్లడించారు. సంస్థ అధ్యక్షుడిగా, సీఈవోగా, బోర్డు డైరెక్టర్‌గా ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. దీంతో 11 రోజుల్లోనే ఆయన సంస్థకు తిరిగి సీఈవో అయ్యారు. జెన్సన్‌ రాజీనామా తర్వాత తాత్కాలిక సీఈవోగా బాధ్యతలు చేపట్టిన కంపెనీ సీఎఫ్‌వో కొలెట్‌ క్రెస్‌పై జోన్స్‌ ప్రశంసలు కురిపించారు.


క్రెస్‌ ఇకపై కూడా సీఎఫ్‌వోగా కొనసాగుతారని తెలిపారు. జెన్సన్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, స్పేస్‌ఎక్స్‌ అధినేత మస్క్‌ వంటి ప్రముఖులు ఆయనకు మద్దతుగా నిలిచారు. ట్రంప్‌ ప్రభుత్వ యంత్రాంగంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో చర్చల తర్వాతే జెన్సన్‌ను డైరెక్టర్ల బోర్డు తిరిగి సీఈవోగా నియమించినట్లు తెలిసింది. జెన్సన్‌ దేశభద్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడలేదని ప్రభుత్వ పెద్దలు స్పష్టంచేసిన తర్వాతే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా మీడియా పేర్కొంది. జెన్సన్‌ తిరిగి సీఈవోగా రావటంతో ఎన్విడియా కంపెనీ షేర్ల విలువ ఏకంగా 25శాతం పెరిగింది. జెన్సన్‌ హువాంగ్‌ పునర్నియామకంపై ట్రంప్‌ సంతోషం వ్యక్తంచేశారు. కంపెనీ సరైన నిర్ణయం తీసుకుందని ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్

భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్

Updated Date - Nov 24 , 2026 | 04:40 AM