విశ్వసుందరిగా జెన్నిఫర్ బారెటో
ABN , Publish Date - Nov 26 , 2026 | 04:00 AM
ప్రపంచ అందాల పోటీల్లో ప్యూర్టోరికో సుందరి సత్తా చాటారు.
ప్యూర్టోరికో భామకు మిస్ యూనివర్స్-2026 కిరీటం
తొలిసారి విజేతగా నిలిచిన తల్లిగా రికార్డు
75వ వార్షికోత్సవం సందర్భంగా..3,150 వజ్రాలతో విశ్వసుందరికి ప్రత్యేక కిరీటం
టాప్-30కే పరిమితమైన భారత సుందరి
శాన్‌జువాన్, నవంబరు 25: ప్రపంచ అందాల పోటీల్లో ప్యూర్టోరికో సుందరి సత్తా చాటారు. ఆ దేశానికి చెందిన 27 ఏళ్ల జెన్నిఫర్ బారెటో మిస్ యూనివర్స్-2026 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ప్యూర్టిరికో రాజధాని శాన్‌జువాన్‌లో జరిగిన 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో 116 మంది అందాల భామలను వెనక్కి నెట్టి ఆమె విజేతగా నిలిచారు. డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నునెజ్ తొలి రన్నర్‌పగా, వెనుజువెలాకు చెందిన క్లారా వేగాస్ రెండో రన్నర్‌పగా నిలిచారు. ఇక భారత్ తరుఫున పోటీల్లో పాల్గొన్న కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో టాప్-30లో చోటు దక్కించుకున్నారు. అయితే, స్విమ్‌సూట్ రౌండ్ అనంతరం టాప్-12లోకి చేరలేకపోయారు. మిస్ యూనివర్స్ పోటీల చరిత్రలో తొలిసారి విజేతగా నిలిచిన తల్లిగా జెన్నిఫర్ రికార్డు సృష్టించడం విశేషం. ఆమె విజయంతో 20 ఏళ్ల తర్వాత ప్యూర్టోరికోకు మళ్లీ విశ్వసుందరి కిరీటం దక్కింది. గతేడాది విజేత మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్.. జెన్నిఫర్‌కు కిరీటాన్ని అలంకరించారు.
న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్న సమాధానం..
చివరి దశకు చేరుకున్న ఐదుగురు అందగత్తెలకు నిర్వాహకులు ఒకే ప్రశ్న సంధించారు. ‘ప్రస్తుతం ప్రపంచానికి నాయకుల నుంచి ఏం కావాలి?’ అని అడిగారు. దీనికి జెన్నిఫర్ సమాధానమిస్తూ.. ప్రపంచానికి సమర్థులైన నాయకులు అవసరమని పేర్కొన్నారు. నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అభిప్రాయపడ్డారు. సమాజ అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించినప్పుడే సానుకూల మార్పు సాధ్యమవుతుందని చెప్పి న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నారు.
3,150 వజ్రాలతో మెరిసిన కిరీటం
మిస్ యూనివర్స్ పోటీలు ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి వజ్రోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ‘ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ’ పేరుతో కొత్త కిరీటాన్ని రూపొందించారు. 18 క్యారెట్ల వైట్‌గోల్డ్‌తో తయారు చేసిన ఈ కిరీటంలో ఏకంగా 3,150 వజ్రాలను పొదిగారు. కాగా, తాజా విజయంతో ప్యూర్టోరికో ఖాతాలో ఆరోసారి మిస్ యూనివర్స్ కిరీటం చేరింది. గతంలో 1970లో మారిసోల్ మాలరెట్, 1985లో డెబోరా కార్తీ-డ్యూ, 1993లో దయానారా టోర్రెస్, 2001లో డెనిస్ క్వినోన్స్, 2006లో జులేకా రివేరా ఈ టైటిల్‌ను గెలుచుకున్నారు. అత్యధికంగా అమెరికా తొమ్మిదిసార్లు, వెనుజువెలా ఏడుసార్లు ఈ కిరీటాన్ని దక్కించుకోగా.. ప్యూర్టోరికో ఆరు విజయాలతో తర్వాతి స్థానంలో నిలిచింది.
ఇవి కూడా చదవండి..
భారత్ ఎదిగితే వారి దుకాణాలు మూతపడతాయి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
చికెన్ షవర్మా తిని 43 మందికి అస్వస్థత.. బాధితుల్లో గర్భిణీ, చిన్నారులు!