Share News

ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల సాయం.. అమెరికా ఉపాధ్యక్షుడు ఏమన్నారంటే..

ABN , Publish Date - Jun 17 , 2026 | 09:48 AM

శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా 300 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం చేయబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు.

ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల సాయం.. అమెరికా ఉపాధ్యక్షుడు ఏమన్నారంటే..
Iran Reconstruction Fund

న్యూయార్క్, జూన్ 17: అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా 300 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం చేయబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా 300 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం చేస్తోందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఆర్థికసాయానికి బదులుగా.. అమెరికా, ఇరాన్ డీల్ షరతులకు కట్టుబడి ఉండే దేశాలు ఇరాన్‌లో పెట్టుబడులు పెట్టే విధంగా ప్లాన్‌ చేస్తున్నామన్నారు.


మంగళవారం ఆయన ‘ది మెగిన్ కెల్లీ షో’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరాన్‌కు ఆర్థికసాయంపై మెగిన్ కెల్లీ.. జేడీ వాన్స్‌ను ప్రశ్నించింది. ఆయన సమాధానం ఇస్తూ.. ‘ఇరాన్‌కు సమీపంలో మనకున్న అత్యుత్తమ మిత్రదేశాలలో ఒకటైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గురించే మాట్లాడుకుందాం. ఆ దేశం ఇరాన్‌లో ఒక అణు విద్యుత్ ప్లాంట్‌లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటోందని అనుకుందాం. అది సాధ్యం కావడానికి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్న కొన్ని ఆంక్షలను మనం ఎత్తివేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే యూఏఈ.. ఇరాన్‌లో పెట్టుబడులు పెట్టడం కష్టం’ అని అన్నారు.


జేడీ వాన్స్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘ఇరానియన్లు తమ ప్రవర్తనను మార్చుకోనంత వరకు ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాదు. ఇరానియన్లు గనుక తమ ప్రవర్తనను మార్చుకుంటే.. ఇతర దేశాలు వారి దేశాన్ని పునర్నిర్మించడానికి, ఆ దేశంలో సంపద సృష్టించడానికి మేము అనుమతిస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

అదరగొట్టిన మెస్సీ.. అర్జెంటీనా ఘన విజ‌యం

దోసె తింటే బరువు తగ్గుతారా?

Updated Date - Jun 17 , 2026 | 10:08 AM