జాహ్నవి కందుల మృతి కేసు.. బాధితురాలి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారం
ABN , Publish Date - Feb 12 , 2026 | 03:50 PM
2023లో రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న పోలీసు కారు ఢీకొని మరణించిన భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత జాహ్నవి కందులకు న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: మూడేళ్ల కిందట అమెరికా(America)లో పోలీస్ అధికారి నిర్లక్ష్యం వల్ల తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(Jahnavi Kandula) ప్రాణాలు కోల్పోయింది. తమ బిడ్డకు న్యాయం జరగాలని జాహ్నవి కుటుంబం పోరాటం చేసింది. మూడేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత జాహ్నవికి న్యాయం జరిగింది. ఆమె కుటుంబానికి 26 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.262 కోట్లు) భారీ పరిహారం చెల్లించేందుకు సియాటెల్(Seattle) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ బుధవారం నాడు ప్రకటన చేశారు. ‘జాహ్నవి కందుల మరణం ఎంతో బాధాకరం. ఈ పరిహారం ఆమె కుటుంబానికి కాస్తయినా ఊరటనిస్తుందని ఆశిస్తున్నాం’ అని సియోటెల్ అటార్నీ తమ ప్రకటనలో పేర్కొంది. కాకపోతే, దీనిపై జాహ్నవి కుటుంబం తరుఫు అటార్నీ నుంచి ఇప్పటివరకూ స్పందన రాలేదు. కాగా, ఈ కేసులో సెటిల్‌మెంట్ కోసం ఇరుపక్షాలు గత వారం కోర్టులో దరఖాస్తు దాఖలు చేసుకున్నట్లు సమాచారం.
అసలేం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లాకు చెందిన జాహ్నవి(23) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. సౌత్‌లేక్ యూనియన్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరింది జాహ్నవి. 2023, జనవరి 3న రాత్రి ఆమె రోడ్డు దాటుతుండగా పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో జాహ్నవి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయింది. ఈ ప్రమాదానికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డవే, మరో అధికారి డేనియల్ అడరర్.. జాహ్నవి మృతి పట్ల అమానవీయంగా ప్రవర్తించడమే కాదు, జోకులు వేసుకున్నారు.
వివాదానికి దారి తీసిన దృశ్యాలు:
‘ఆమె ఒక సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువే లేదు’ అంటూ పోలీస్ అధికారి అన్న మాటలు, ఆయన ప్రవర్తించిన తీరు కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలు బయటకు రావడంతో భారత్‌తోపాటు అమెరికాలోనూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కెవిన్ తీరుపై అమెరికాలోనూ విమర్శలు రావడంతో ఆయన్ని విధుల నుంచి తొలగించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కేవలం 40 కిలోమీటర్ల జోన్ ఉంది. కానీ, కెవిన్ గంటకు 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపి జాహ్నవి మరణానికి కారణమయ్యాడు.
న్యాయం గెలిచింది:
తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన జాహ్నవిని మృత్యువు వెంటాడింది. తల్లిదండ్రులకు ఇచ్చే ఈ పరిహారం ఆమెను వెనక్కి తీసుకురాలేదని.. కానీ, ‘ఆమె ప్రాణాలనికి విలువ లేదు’ అన్న అధికారుల అహంకార పూరిత వ్యాఖ్యలకు భారీ జరిమానా ఒక గట్టి సమాధానంగా నిలిచిందని ఎన్ఆర్ఐలు అభిప్రాయపడుతున్నారు. చట్టం ముందు అందరూ సమానమే, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే అధికారులకు ఇదో హెచ్చరికగా మిగిలిపోతుందని అంటున్నారు.