హూతీలపై దాడులకు రెడీగా ఇజ్రాయెల్.. వారిస్తున్న సౌదీ
ABN , Publish Date - Oct 15 , 2026 | 07:15 AM
హూతీలపై దాడులకు తాము సిద్ధమేనని ఇజ్రాయెల్ చెబుతున్నప్పటికీ సౌదీ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు వెనకడుగు వేస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెలీ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: హూతీలపై దాడులతో ప్రస్తుతం సౌదీ అరేబియా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దాడులను ఎలా నిలువరించాలో తెలియక సతమతం అవుతోంది. సౌదీతో దౌత్యబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఉత్సుకతతో ఉన్న ఇజ్రాయెల్ హూతీలపై దాడులకు రెడీగా ఉంది. కానీ సౌదీ నుంచి మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇజ్రాయెల్ను సౌదీ ఇప్పటికీ ప్రత్యేక దేశంగా గుర్తించలేదు. దీంతో, సౌదీతో స్నేహ బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే యుద్ధాల్లో బిజీగా ఉన్న ఇజ్రాయెల్ దళాలను సౌదీ తరఫున రంగంలోకి దింపేందుకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సిద్ధంగా ఉన్నారు. హూతీల విషయంలో నిఘా సమాచారం పంచుకునేందుకు ఇజ్రాయెల్ ఇప్పటికే సిద్ధమైంది. అమెరికా చొరవతో ఇరు దేశాల అధికారులు సమావేశం కూడా నిర్వహించారు. హూతీల దాడులు పెరిగిన నేపథ్యంలో సౌదీకి అండగా సేనలను పంపాలని ఇజ్రాయెల్ భావిస్తోంది.
అయితే, ఇజ్రాయెల్ సాయం తీసుకునేందుకు సౌదీ యువరాజు, ప్రధాని మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) సందేహిస్తున్నారు. ఇజ్రాయెల్ సేనలను దించితే తమ దేశ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావచ్చని భావిస్తున్నారు. హూతీలతో ఘర్షణలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. నౌకాయానానికి కీలకమైన బాబ్ ఎల్ మాండెబ్ జలసంధిపై ఇప్పటికే వారు పట్టుసాధించారు. అంతేకాకుండా, సౌదీ భూభాగంపై డ్రోన్, మిసైల్ దాడులను తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలో సౌదీ, ఇజ్రాయెల్లు తమ ఉమ్మడి శత్రువుపై కలిసికట్టుగా పోరాడాలని ట్రంప్ సర్కారు కూడా భావిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
మోదీకి వ్యతిరేకంగా.. సీజేపీకి అమెరికన్ల నిధులు!
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ట్రంప్ సర్కారు షాక్