Share News

హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ట్రంప్‌ సర్కారు షాక్‌

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:19 AM

విదేశాల నుంచి అమెరికా వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నవారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్న ట్రంప్‌ సర్కారు.. తాజాగా వారి పాలిట పిడుగుపాటులాంటి మరో నిర్ణయం తీసుకుంది.

హెచ్‌-1బీ వీసాదారుల   జీవిత భాగస్వాములకు   ట్రంప్‌ సర్కారు షాక్‌
h1b visa

  • వారికి ఇచ్చే ‘ఈఏడీ’ రెన్యువల్‌ దరఖాస్తులపై 540 రోజుల ఆటోమేటిక్‌ పొడిగింపు రద్దు

వాషింగ్టన్‌, అక్టోబరు 14: విదేశాల నుంచి అమెరికా వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నవారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్న ట్రంప్‌ సర్కారు.. తాజాగా వారి పాలిట పిడుగుపాటులాంటి మరో నిర్ణయం తీసుకుంది. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకోవడానికి వీలు కల్పించే ‘ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడీ)’ పునరుద్ధరణ దరఖాస్తులపై ప్రస్తుతం ఉన్న 540 రోజుల ఆటోమేటిక్‌ పొడిగింపు వెసులుబాటును శాశ్వతంగా రద్దు చేసింది. హెచ్‌-1బీ వీసాదారుల్లో అత్యధికులు భారతీయులే కాబట్టి.. ఈ నిర్ణయం ప్రభావం భారతీయులపై గణనీయంగా పడనుంది.

అసలేమిటీ ‘ఈఏడీ’ అంటే.. హెచ్‌-1బీ, హెచ్‌2, హెచ్‌3 వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నవారి జీవిత భాగస్వాములకు హెచ్‌4 వీసా ఇస్తారు. వారు కూడా అక్కడ పనిచేసుకునే వీలు కల్పిస్తూ.. 2015లో ఒబామా సర్కారు ఈ ‘ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌’ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. తమ జీవితభాగస్వామి హెచ్‌-1బీ వీసా ఎంతకాలం ఉంటుందో అంతకాలం మాత్రమే ఈఏడీపై పనిచేసే వీలుంటుంది. ఈలోగా అది ముగిసిపోతుంటే.. వారు దాన్ని పొడిగించాల్సిందిగా కోరుతూ దరఖాస్తు చేసుకుంటారు. ఆ దరఖాస్తు ప్రాసెస్‌ అయ్యేలోపు కాలపరిమితి ముగిసిపోతే వారు ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండదు. అందుకే బైడెన్‌ హయాంలో... ఇలా కాలపరిమితి ముగిసిపోయేలోపే రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి 540 రోజుల ఆటోమేటిక్‌ ఎక్స్‌టెన్షన్‌ వెసులుబాటు కల్పించారు. అంతకుముందు అది 180 రోజులే (అంటే ఆర్నెల్లపాటే) ఉండేది.


బైడెన్‌ హయాంలో దాన్ని పెంచి.. పాత ఈఏడిపైనే మరో ఏడాదిన్నరపాటు వారు ఉద్యోగం చేసుకునే అవకాశం ఇచ్చారు. దాన్ని రద్దు చేస్తూ గత ఏడాది తాత్కాలిక నిర్ణయం తీసుకున్న ట్రంప్‌ సర్కారు.. ఇప్పుడు శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ప్రకటించింది. దీని అమలుకు కటాఫ్‌ తేదీని 2025 అక్టోబరు 30గా నిర్ణయించింది. అంటే.. గత ఏడాది అక్టోబరు 30 తర్వాత ఈఏడీ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారందరికీఈ రద్దు నిర్ణయం వర్తిస్తుందన్నమాట. అంతకు ముందు దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రం పాత విధానం ప్రకారమే 540 రోజుల ఆటోమేటిక్‌ పొడిగింపు లభిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి

పోప్ లియోకు క్యాన్సర్.. ఆయన అన్నకు కూడా

శ్వేతసౌధం కొత్త ప్రెస్ సెక్రటరీ తడబాటు.. ఊహించని మిస్టేక్..

Updated Date - Oct 15 , 2026 | 05:19 AM