Share News

యుద్ధ విరమణకు 3 షరతులు

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:14 AM

అమెరికా, ఇజ్రాయెల్‌తో రెండు వారాలుగా సాగుతున్న భీకర యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. అయితే, అందుకు మూడు షరతులు విధించింది.....

యుద్ధ విరమణకు 3 షరతులు

  • అమెరికా, ఇజ్రాయెల్‌ ముందు ఇరాన్‌ డిమాండ్లు

  • మా చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలి

  • యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి

  • భవిష్యత్తులో దాడి చేయకుండా అంతర్జాతీయ హామీ కావాలి

  • ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ డిమాండ్‌

  • ప్రాంతీయ శాంతి సుస్థిరతకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటన

టెహ్రాన్‌, మార్చి12: అమెరికా, ఇజ్రాయెల్‌తో రెండు వారాలుగా సాగుతున్న భీకర యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. అయితే, అందుకు మూడు షరతులు విధించింది. ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ‘రష్యా, పాకిస్థాన్‌ నేతలతో మాట్లాడుతున్నాను. ఈ ప్రాంతంలో (పశ్చిమాసియా) శాంతిని నెలకొల్పేందుకు ఇరాన్‌ సిద్ధంగా ఉంది. యూదులు, అమెరికా కలిసి ప్రారంభించిన ఈ యుద్ధం ఆగాలంటే ఇరాన్‌ చట్టబద్ధమైన హక్కులను ఆ దేశాలు గుర్తించాలి. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి. భవిష్యత్తులో మళ్లీ మాపై దాడి జరగదని స్పష్టమైన అంతర్జాతీయ హామీ ఇవ్వాలి’ అని పెజెష్కియాన్‌ డిమాండ్‌ చేశారు. మరోవైపు దీర్ఘకాల యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అమెరికా, దాని మిత్ర దేశాలను ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ సలహాదారు అలీ ఫదావీ హెచ్చరించారు. కాగా, ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ఒమన్‌ సుల్తాన్‌ హైతమ్‌ బిన్‌ తారిఖ్‌ బుధవారం ఫోన్‌ లో మాట్లాడారు. ఒమన్‌లోని సలాలాహ్‌ నౌకాశ్రయంపై ఇరాన్‌ దాడి చేయటంపై సుల్తాన్‌ నిరసన తెలిపినట్లు ఒమన్‌ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ యుద్ధం మొదలైన తర్వాత ఒక పశ్చిమాసియా దేశాధినేత ఇరాన్‌ ఉన్నత స్థాయి నేతతో మాట్లాడటం ఇదే తొలిసారి.


ఇజ్రాయెల్‌ వెనక్కు తగ్గేనా?

ఇరాన్‌లో దాడులు చేసేందుకు ఇంకా టార్గెట్‌లు ఏవీ మిగల్లేదని చెప్తూ యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల సంకేతాలిచ్చిన నేపథ్యంలో పెజెష్కియాన్‌ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, యుద్ధం ముగింపునకు అమెరికా ముందుకొచ్చినా అందుకు ఇజ్రాయెల్‌ ఒప్పుకొనే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్‌లోని ప్రస్తుత పాలకులను పూర్తిగా తొలగించటమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28న దాడి మొదలైన తొలిరోజే ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఖమేనీని వైమానిక దాడిలో చంపివేశాయి. అప్పటి నుంచి ఇరాన్‌లోని అనేక సైనిక, పరిపాలనా కేంద్రాలను నేలమట్టం చేశాయి. ఇరాన్‌ కూడా పశ్చిమాసియా దేశాల్లోని అమెరికా ఆస్తులే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌పై కూడా ఎడతెరిపి లేకుండా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. హోర్ముజ్‌ జలసంధిని మూసివేయటంతో చమురు, గ్యాస్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని విరమించాలని అమెరికాపై దాని మిత్రదేశాలు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అమెరికా కూడా ఇరాన్‌పై దాదులను కాస్త తగ్గించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇజ్రాయెల్‌ మాత్రం అటు లెబనాన్‌పై, ఇటు ఇరాన్‌పై భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. తమ లక్ష్యం పూర్తిగా నెరవేరేవరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ఇరాన్‌ పెట్టిన మూడు షరతులను అమెరికా, ఇజ్రాయెల్‌ ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకొనే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.

మిగ్‌-29ను నడిపిన వాయుసేన అధిపతి

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో భారత వాయుసేన (ఐఏఎఫ్‌) అప్రమత్తమైంది. యుద్ధ సన్నద్ధతపై ఐఏఎఫ్‌ చీఫ్‌ ఏపీ సింగ్‌ దృష్టి పెట్టారు. దేశంలోని అత్యంత కీలకమైన పశ్చిమ కమాండ్‌ పరిధిలోని ఎయిర్‌ బేస్‌ను గురువారం ఆయన సందర్శించి, ఆధునీకరించిన మిగ్‌-29 యుద్ధ విమానాన్ని దాదాపు 45 నిమిషాల పాటు స్వయంగా నడిపారు. నాలుగో తరానికి చెందిన ఈ యుద్ధ విమానాల పనితీరును పరిశీలించారు. పశ్చిమ కమాండ్‌లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది సన్నద్ధత, యుద్ధ విమానాల నిర్వహణ తదితర అంశాలను కూడా ఏపీ సింగ్‌ సమీక్షించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమ, ఉత్తర కమాండ్‌లలో మిగ్‌-29, మిగ్‌- 29 యూపీజీ యుద్ధ విమానాలతో కూడిన మూడు స్వ్కాడ్రన్లను ఐఏఎఫ్‌ నిర్వహిస్తోంది. గత ఏడాది పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో మిగ్‌-29 యుద్ధ విమానాలు కీలకపాత్ర పోషించాయి.

1.jpg

Updated Date - Mar 13 , 2026 | 06:03 AM