Share News

అమెజాన్‌ డేటా సెంటర్‌పై దాడి

ABN , Publish Date - Jul 22 , 2026 | 06:23 AM

ఇరాన్‌, అమెరికా పరస్పర దాడులు మరింత ఉధృతమవుతున్నాయి. ఇరువైపులా మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి...

అమెజాన్‌ డేటా సెంటర్‌పై దాడి

గల్ఫ్‌ దేశాల్లో మౌలిక సదుపాయాలే లక్ష్యంగా విరుచుకుపడుతున్న ఇరాన్‌

  • పాక్‌ వేదికగా మళ్లీ శాంతి యత్నాలు

దుబాయ్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, జూలై 21: ఇరాన్‌, అమెరికా పరస్పర దాడులు మరింత ఉధృతమవుతున్నాయి. ఇరువైపులా మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్‌లోని అమెరికా సంస్థలు, అమెరికా సంస్థల భాగస్వామ్యం ఉన్న కార్యాలయాలను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకుంది. బహ్రెయిన్‌లో అమెజాన్‌ డేటా సెంటర్‌పై, కువైట్‌, జోర్డాన్‌, బహ్రెయిన్‌లలో విమానాశ్రయాలు, విద్యుత్‌ ప్లాంట్లు, డీసాలినేషన్‌ ప్లాంట్లపై దాడులు చేసింది. జోర్డాన్‌లోని అమెరికా స్థావరంలో గగనతల రక్షణ రాడార్‌ వ్యవస్థను, ఒక ఎఫ్‌-15 ఫైటర్‌ను ధ్వంసం చేశామని ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌(ఐఆర్‌జీసీ) ప్రకటించింది. ఒమాన్‌ తీరానికి సమీపం నుంచి హోర్ముజ్‌ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన మరో రెండు చమురు నౌకలపై ఇరాన్‌ దాడులు చేసింది.

ఇరాన్‌పై బాంబుల వర్షం..

మంగళవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని కీలక ప్రాంతాల్లో అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఫార్స్‌, హొర్మోజ్‌గాన్‌, ఇలామ్‌, కెర్మన్‌, సిస్టన్‌, బలూచిస్తాన్‌ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ కేంద్రాలు, టెలీ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, రైల్వే స్టేషన్లు, పోర్టులపై దాడులు చేసింది. కీలకమైన బందర్‌ అబ్బాస్‌ పోర్టు పట్టణం, ఖెష్మ్‌ దీవి, చాబహార్‌ పోర్టులో భారీగా పేలుళ్లు జరిగాయి. బోంజీ ప్రాంతంలో డీసాలినేషన్‌ ప్లాంటునూ ధ్వంసం చేసింది. ఆరు కీలక వంతెనలు, అహ్వజ్‌లో ఒక ఆస్పత్రి ధ్వంసమయ్యాయని, ఇరాన్‌షహర్‌, సెమ్నాన్‌, జామ్‌ విమానాశ్రయాలపైనా దాడి జరిగిందని ఇరాన్‌ అధికారులు తెలిపారు. బుషెహర్‌ అణువిద్యుత్‌ కేంద్రంపైనా దాడి జరిగినట్టు వెల్లడించారు. ఇరాన్‌ చంపే ఒక్కో అమెరికా సైనికుడికి బదులుగా అంతకు ఎన్నో రెట్లు మరణాలతో ఇరాన్‌ బదులు తీర్చుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు.

సుప్రీం లీడర్‌ సూచనలతోనే

ప్రస్తుతం తమ సుప్రీంలీడర్‌ మొజ్తాబా ఖమేనీతో సమన్వయం మెరుగుపడిందని, ఆయన సూచనలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామని ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ చెప్పారు. ‘అటు యుద్ధమూ కాదు, ఇటూ శాంతీ కాదు’ అన్నట్టుగా కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని సుప్రీంలీడర్‌ తనకు స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. ఇక పాక్‌ వేదికగా మళ్లీ శాంతి యత్నాలు సాగుతున్నాయి. మంగళవారం పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌, ప్రధాని షరీ్‌ఫలతో ఇరాన్‌ అంతర్గత భద్రత మంత్రి ఇస్కాందార్‌ భేటీ అయి చర్చించారు.


బాబ్‌ అల్‌ మందేబ్‌.. మరో ఆందోళన

బాబ్‌ అల్‌ మందేబ్‌ జలసంధి మీదుగా సౌదీ అరేబియా చమురుతో వెళ్లే, సౌదీతో సంబంధమున్న నౌకలపై దాడులు చేస్తామన్న యెమెన్‌ హౌతీల ప్రకటనతో మరో ఆందోళన నెలకొంది. సౌదీ నుంచి చమురు, కార్గోను తీసుకెళ్లడం గానీ, ఆ దేశానికి రవాణాగానీ చేయవద్దని.. అలాంటి నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని నౌకారవాణా సంస్థలకు హౌతీలు ఈ-మెయిల్‌ పంపింది. మంగళవారం భారత్‌, చైనాలకు రవాణా చేయడం కోసం సౌదీ నుంచి చమురు తీసుకుని వస్తున్న రెండు నౌకలు హౌతీల హెచ్చరికలతో బాబ్‌ అల్‌ మందేబ్‌ జలసంధి వద్ద వెనక్కి మళ్లి వెళ్లిపోయాయి. ఎర్ర సముద్రం నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించే మార్గంలో ఉన్న ఈ జలసంధి మీదుగా ప్రపంచ చమురులో 11శాతం మేర రవాణా అవుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి:

ప్రభుత్వ అధీనంలోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!

Updated Date - Jul 22 , 2026 | 06:23 AM