అవరోధాలు, బెదిరింపుల నీడలో చర్చలు సాధ్యం కాదు: పాక్ ప్రధానితో ఇరాన్ అధ్యక్షుడు
ABN , Publish Date - Apr 26 , 2026 | 07:01 AM
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రధానమంత్రితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం, బెదిరింపుల మధ్య తాము చర్చలకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు.
టెహ్రాన్ [ఇరాన్], ఏప్రిల్ 26: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం (Naval Blockade), బెదిరింపుల మధ్య తాము చర్చలకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు.
ఒత్తిడి లేదా బెదిరింపులకు లోనై చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పేర్కొన్నారు. చర్చల మార్గంలో పురోగతి ఉండాలంటే ముందుగా అమెరికా తన శత్రుత్వ చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు.
శాంతి చర్చలు పునఃప్రారంభం కావాలంటే అమెరికా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, ఇరాన్ ఓడరేవులపై విధిస్తున్న సైనిక, ఆర్థిక అడ్డంకులను.. ముఖ్యంగా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించాలని ఆయన సూచించారు.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదంపై స్పందిస్తూ, పాకిస్థాన్‌లో ఇరాన్ అధికారులతో జరగాల్సిన శాంతి చర్చలను రద్దు చేయడాన్ని సమర్థించుకున్నారు. ఇరాన్ వైపు నుంచి వచ్చిన ప్రతిపాదనలు సంతృప్తికరంగా లేవని, అలాగే ఇరాన్ అగ్రనాయకత్వం లేని సమావేశాల కోసం తమ ప్రతినిధులు అంత దూరం ప్రయాణించడం వృథా అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా, ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయకూడదనేది తమ ప్రధాన డిమాండ్ అని అమెరికా పునరుద్ఘాటించింది. పాకిస్థాన్ ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇవాళ పాకిస్థాన్‌లో మరోసారి పర్యటించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..
నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్‌పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..