Share News

ఖమేనీకి కన్నీటి వీడ్కోలు.. పక్కనే 14 నెలల చిన్నారి శవపేటిక..

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:57 AM

అమెరికా దాడుల్లో మృతిచెందిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు శనివారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28న మరణించిన 86 ఏళ్ల ఖమేనీకి చివరి వీడ్కోలు పలికేందుకు వేలాదిగా ప్రజలు టెహ్రాన్ నగరానికి తరలివచ్చారు.

ఖమేనీకి కన్నీటి వీడ్కోలు.. పక్కనే 14 నెలల చిన్నారి శవపేటిక..

టెహ్రాన్: అమెరికా దాడుల్లో మృతిచెందిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇవాళ (శనివారం) అధికారికంగా ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28న మరణించిన 86 ఏళ్ల ఖమేనీకి చివరి వీడ్కోలు పలికేందుకు వేలాదిగా ప్రజలు టెహ్రాన్ నగరానికి తరలివచ్చారు. దేశ జెండాతో కప్పిన ఖమేనీ పార్థివదేహాన్ని నల్ల తలపాగా ఉంచిన శవపేటికలో పెట్టి అంతిమ సందర్శనకు ఉంచారు. అమెరికా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఖమేనీ కుటుంబ సభ్యుల పార్థివదేహాలనూ ఆయన పక్కనే ఉంచారు. అందులో ఖమేనీ 14 నెలల మనవరాలి చిన్న శవపేటిక అందరి మనసులను కలచివేస్తోంది. ఆ చిన్నారి శవపేటిక పక్కనే ఆమె ఫొటోను కూడా ఉంచారు.

Iran2.jpg


వారం రోజుల అంతిమ సంస్కారాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రమే ఖమేనీ పార్థివదేహం టెహ్రాన్‌కు చేరుకుంది. దీంతో గ్రాండ్ మొసల్లా ప్రాంగణం వెలుపల భారీ సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు బారులు తీరారు. శనివారం ఉదయం గ్రాండ్ మొసల్లా ద్వారాలు తెరవగానే వేలాది మంది లోపలికి ప్రవేశించి ఖమేనీకి కన్నీటి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎర్ర జెండాలు చేతబట్టి వచ్చిన మద్దతుదారులు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వారి నినాదాలతో గ్రాండ్ మొసల్లా ప్రాంగణం మార్మోగిపోతోంది. 'నా ప్రియమైన నాయకుడికి వీడ్కోలు చెప్పేందుకు వచ్చాను. ఇలాంటి రోజు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. ఈ విషాదాన్ని చూడకముందే నేను చనిపోయి ఉంటే బాగుండేది' అంటూ ఓ యువకుడు భావోద్వేగానికి గురయ్యాడు. కాగా, రాబోయే మూడు రోజుల్లో ఒక్క టెహ్రాన్‌లోనే 1.5 నుంచి 2 కోట్ల మంది వరకు ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం ఉందని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు.

Iran3.jpg


మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, అమెరికాతో చర్చలకు ప్రధాన ప్రతినిధిగా వ్యవహరించిన మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ సహా పలువురు ప్రముఖులు ఖమేనీకి నివాళులర్పించారు. తాజా దాడుల్లో మరణించిన రివల్యూషనరీ గార్డ్స్ మాజీ చీఫ్ స్థానంలో నియమితులైన అహ్మద్ వాహిదీ కూడా అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. భారత్ తరఫున బిహార్ గవర్నర్ సయ్యద్ అటా హుస్సైనీన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. కాగా, సోమవారం వరకు ఖమేనీ పార్థివదేహాన్ని టెహ్రాన్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం నగరంలో భారీ అంతిమయాత్ర నిర్వహిస్తారు. మంగళవారం నాడు పవిత్ర నగరమైన ఖోమ్‌కు, బుధవారం ఇరాక్‌లోని పవిత్ర ప్రాంతాలకు తీసుకెళ్తారు. గురువారం నాడు ఈశాన్య ఇరాన్‌లోని ఖమేనీ స్వస్థలమైన మష్హద్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్ శిబిరంపై బీఎల్ఏ దాడి.. 30 మంది భద్రతా సిబ్బంది హతం..

ఇరాన్ చర్చలపై అమెరికా మీడియా కథనం.. 'ఫేక్ న్యూస్'గా కొట్టిపారేసిన ఇజ్రాయెల్

Updated Date - Jul 04 , 2026 | 12:29 PM