Share News

ఇరాన్ తన వ్యూహాన్ని మార్చిందా?

ABN , Publish Date - Mar 02 , 2026 | 05:03 PM

ప్రత్యర్థుల ఆయుధ నిల్వలు త్వరగా తరిగిపోయేలా చేసి పైచేయి సాధించడమే లక్ష్యంగా ఇరాన్ ముందుకు సాగుతోందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇరాన్ తన వ్యూహాన్ని మార్చిందా?
Iran new military strategy

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌ తన వ్యూహాన్ని మార్చిందా? ఇజ్రాయెల్‌తో గతేడాది ఘర్షణల సందర్భంగా నేర్చిన గుణపాఠాలతో ప్రస్తుతం రంగంలో నిలిచిందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఈసారి ఇరాన్ భారీ మిసైళ్లను ప్రయోగించకుండా కొత్త వ్యూహంతో ఇజ్రాయెల్‌, అమెరికాను టార్గెట్ చేసిందని అంటున్నారు.

గతేడాది ఇరాన్‌ ప్రయోగించిన అనేక భారీ మిసైల్స్‌ను ఇజ్రాయెల్ మార్గమధ్యంలోనే కూల్చి వేసింది. దీంతో, ఇరాన్ సరికొత్త వ్యూహంతో దాడులను కొనసాగిస్తోందట. మునుపటివలె కాకుండా, స్వల్ప స్థాయి మిసైల్స్‌, షాహీద్ డ్రోన్స్‌ను ఇజ్రాయెల్‌‌తో పాటు గల్ఫ్‌లోని ఇతర దేశాలపై ప్రయోగిస్తోంది. దీర్ఘకాలం పాటు దాడులను కొనసాగించి శత్రు దేశాల ఆయుధ సామగ్రి తగ్గిపోయేలా చేయడమే ఇరాన్ లక్ష్యమని నిపుణులు చెబుతున్నారు.

గతంతో పోలిస్తే ఈసారి ఇరాన్ తన లక్ష్యాలను కూడా మార్చుకుందని అంటున్నారు. గతంలో కేవలం మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేస్తే ఈసారి పౌర లక్ష్యాలపై కూడా బాంబులను ప్రయోగిస్తోంది. బహ్రెయిన్‌లోని అమెరికా నావికా స్థావరంతో పాటు గల్ఫ్‌లోని పలు దేశాల్లో పౌర లక్ష్యాలను టార్గెట్ చేస్తోంది. యూఏఈ, ఖతర్‌పై దాడులు చేయడం ద్వారా వారిపై ఒత్తిడి పెంచి అమెరికా, ఇజ్రాయెల్‌లను రాజీకి ఒప్పించడమే ఇరాన్ వ్యూహం అని అంటున్నారు. అయితే, ఇజ్రాయెల్ దాడుల తీరుతో ఇరాన్‌ కూడా ఇక్కట్ల పాలవుతోంది. ఇరాన్‌‌లోని బాలిస్టిక్ మిసైల్ లాంచర్లే టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దీంతో, ఇరాన్ ఇప్పటికే 50 శాతం మిసైల్ లాంచర్లను నష్టపోయిందట. తద్వారా మిగిలిన మిసైల్స్‌ను ప్రయోగించలేని ముప్పును ఎదుర్కుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు.


అమెరికా, ఇజ్రాయెల్‌ల యుద్ధ సన్నద్ధతను ఇరాన్ పరీక్షిస్తోందని కొందరు విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌లు ఖరీదైన టోమహాక్, ఇతర ఇంటర్‌సెప్టర్ క్షిపణులను వినియోగించాల్సి వస్తోంది. ఈ మిసైల్స్ వినియోగం మేరకు ఉత్పత్తి లేకపోవడంతో నిల్వలు తరిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇజ్రాయెలీ ప్రజల మానసికస్థైర్యం దెబ్బతీసేలా ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. క్రమం తప్పకుండా స్వల్ప స్థాయి దాడులతో ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తూ అక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేయడమే ఇరాన్ లక్ష్యమని అంటున్నారు. సుదీర్ఘకాలం పాటు ఇలా దాడులు కొనసాగిస్తే ఇజ్రాయెల్ జనాల ధైరస్థైర్యాలు సన్నగిల్లతాయని ఇరాన్ అంచనా వేస్తోంది. శత్రుదేశ ఆయుధ నిల్వలు కరిగిపోయేలా, ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా చేసి పైచేయి సాధించేలా ఇరాన్ ముందుకు సాగుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి

ఇరాన్‌పై దాడులు! అమెరికన్ల అభిప్రాయం ఏంటంటే..

ఇరాన్‌పై దాడులు.. చైనా గగనతల రక్షణ వ్యవస్థ విఫలం!

Updated Date - Mar 02 , 2026 | 05:58 PM