Share News

ఇరాన్‌పై దాడులు.. చైనా గగనతల రక్షణ వ్యవస్థ విఫలం!

ABN , Publish Date - Mar 01 , 2026 | 08:13 PM

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి ఇరాన్‌ను కాపాడటంలో చైనా గగనతల రక్షణ వ్యవస్థ విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా భారత దళాల దాడులను చైనా వ్యవస్థ అడ్డుకోలేకపోయిందని తెలుస్తోంది.

ఇరాన్‌పై దాడులు.. చైనా గగనతల రక్షణ వ్యవస్థ విఫలం!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌ నగరాల్లో పెద్ద సంఖ్యలో భవనాలు ధ్వంసం కావడంతో రక్షణ రంగ వర్గాల్లో చర్చ మొదలైంది. చైనా నుంచి కొనుగోలు చేసిన గగనతల రక్షణ వ్యవస్థలు విఫలమయ్యాయా? అన్న చర్చ నడుస్తోంది. ఇరాన్‌కు కీలకమైన సమయంలో చైనా క్షిపణి రక్షణ వ్యవస్థ ఆదుకోలేకపోయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

గతంలో ఇరాన్ వద్ద రష్యాకు చెందిన ఎస్-300పీఎమ్‌యూ-2 గగనతల రక్షణ వ్యవస్థ ఉండేది. గతేడాది అమెరికా జరిపిన క్షిపణి దాడులను అడ్డుకోవడంలో ఇది పూర్తిగా విఫలం కావడంతో ఇరాన్ చైనావైపు మళ్లింది. చైనా నుంచి హెచ్‌క్యూ-9బీ గగనతల రక్షణ వ్యవస్థను దిగుమతి చేసుకుంది. చమురుకు సరఫరాకు ప్రతిగా ఈ వ్యవస్థను తీసుకుంది.


దీర్ఘశ్రేణి లక్ష్యాల కోసం ఈ వ్యవస్థను చైనా నుంచి ఇరాన్ తెచ్చుకుంది. అణుకేంద్రాలు, అణు ఇంధన శుద్ధి కేంద్రాల వద్ద ఈ వ్యవస్థలను మోహరించింది. చైనా ఎయిరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ హెచ్‌క్యూ-9బీని అభివృద్ధి చేసింది. అమెరికాకు చెందిన పాట్రియట్ పీఏసీ-2 వ్యవస్థ స్ఫూర్తితో దీన్ని డిజైన్ చేసింది. ఆ తరువాత తనదైన మెరుగులు దిద్దింది. ఈ వ్యవస్థ రేంజ్ 260 కిలోమీటర్లు. గరిష్ఠంగా 50 కిలోమీటర్ల ఎత్తులోని లక్ష్యాలనూ ధ్వంసం చేయగలదు.

ఈ వ్యవస్థను చైనా స్వయంగా వినియోగిస్తోంది. వ్యూహాత్మకంగా కీలకమైన బీజింగ్, టిబెట్, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో వీటిని మోహరించింది. ఇక పాకిస్థాన్‌ కూడా ఈ గగనతల రక్షణ వ్యవస్థను వినియోగిస్తోంది. అయితే, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత దళాల దాడులను కూడా ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోయిందన్న విమర్శ ఉంది. తాజాగా ఇరాన్‌లో కూడా హెచ్‌క్యూ-9బీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఇవి కూడా చదవండి

భారతీయులు ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి

గ్రోక్ జోస్యం! చెప్పిన తేదీకే మొదలైన యుద్ధం! మస్క్ రియాక్షన్ ఇదీ

Updated Date - Mar 01 , 2026 | 09:42 PM