Share News

శాంతి పర్వం.. ఇంకెంత దూరం?

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:59 AM

పశ్చిమాసియాలో నెల రోజుల క్రితం రగులుకున్న మంటలు ఇప్పటికీ ఆరడం లేదు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ ఏకపక్ష దాడులుగా మొదలైన యుద్ధం.. ఇరాన్‌ తీవ్రస్థాయి...

శాంతి పర్వం.. ఇంకెంత దూరం?

విధ్వంసానికి నెలవై

అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధానికి నెల రోజులు

మరింతగా విస్తరిస్తున్న సమరం

ఇరాన్‌లో భారీ స్థాయిలో విధ్వంసం

2వేల మంది మృతి.. లక్షల్లో నిరాశ్రయులు

ఇజ్రాయెల్‌కూ గణనీయంగా నష్టం

పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలకు దెబ్బ

6 గల్ఫ్‌ దేశాల్లో చమురు కేంద్రాలపై దాడులు

హోర్ముజ్‌ మూసివేతతో ‘చమురు’ మంటలు

ఇంధనం, గ్యాస్‌ కొరతతో అల్లకల్లోలం

కాల్పుల విరమణపై నేడు, రేపు పాక్‌లో చర్చలు

యుద్ధంలోకి హౌతీలు.. చర్చలపై ప్రభావం!

యూఏఈ అల్యూమినియం పరిశ్రమ ధ్వంసం

ఐదుగురు భారతీయులకు గాయాలు

గల్ఫ్‌లోని లక్ష్యాలపై కొనసాగిన ఇరాన్‌ దాడులు

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, మార్చి 28: పశ్చిమాసియాలో నెల రోజుల క్రితం రగులుకున్న మంటలు ఇప్పటికీ ఆరడం లేదు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ ఏకపక్ష దాడులుగా మొదలైన యుద్ధం.. ఇరాన్‌ తీవ్రస్థాయి ప్రతిస్పందనతో పశ్చిమాసియా అగ్నిగోళంలా మారింది. ప్రతిరోజూ కొత్త దాడులు, ప్రతిదాడులు, హెచ్చరికలు, క్షిపణులు, డ్రోన్ల గర్జనలతో యుద్ధం పరిధి మరింతగా విస్తరిస్తూ.. ప్రాంతీయ స్థిరత్వానికే సవాళ్లు విసురుతోంది. హోర్ముజ్‌ జలసంధి మూతపడి, చమురు ధరలు పెరిగిపోయి ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతోంది. అటు ఇరాన్‌, లెబనాన్‌లలో లక్షలాది మంది ప్రజలు గూడు వదిలి గోసపడుతున్న దుస్థితి.. ఇటు గల్ఫ్‌దేశాల్లో ఎప్పుడు ఏ క్షిపణి మీదపడుతుందోనన్న భయం.. మరోవైపు ధరలు పెరిగి, ఇంధనాలకు కొరత ఏర్పడి ప్రపంచ దేశాల ప్రజల్లో నెలకొన్న ఆందోళన.. రోజురోజుకు కొత్త మలుపు తీసుకుంటున్న ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవైపు దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నా.. మరోవైపు విధ్వంసకాండ ఆగడం లేదు.


అనుకున్నదొక్కటి.. అవుతున్నదొక్కటి..

అమెరికా, ఇజ్రాయెల్‌ చేసిన మెరుపుదాడుల్లో మొదటి రోజే ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతొల్లా ఖమేనీ మరణించారు. దానికితోడు ఆ దేశాల ఆయుధ సంపత్తి గురించి తెలిసిన అందరూ కొన్ని రోజుల్లోనే యుద్ధం ముగుస్తుందని భావించారు. కానీ ఇరాన్‌ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ.. వ్యూహాత్మక పోరాటానికి తెరతీసింది. హోర్ముజ్‌ జలసంధిని మూసివేసింది. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడికి దిగింది. తక్కువ ఖర్చయ్యే డ్రోన్లను ప్రయోగిస్తూ.. అమెరికా ఖరీదైన క్షిపణులు ఖర్చయిపోయేలా చేసింది. గల్ఫ్‌ దేశాల్లోని విమానాశ్రయాలు, ఇంధన కేంద్రాలపైనా దాడులు చేసి ఒత్తిడిని పెంచింది. ఇరాక్‌లోని ఇస్లామిక్‌ రిపబ్లిక్‌, లెబనాన్‌లోని హెజ్బొల్లా.. తాజాగా యెమెన్‌లోని హౌతీలు ఇలా తన మద్దతు దారులనూ రంగంలోకి దింపింది.

ఇరువైపులా ఎంతో నష్టం..

  • ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ పేరుతో అమెరికా ఇరాన్‌పై ఆకస్మిక దాడులు మొదలుపెట్టింది. మినాబ్‌ పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో 165 మంది చిన్నారులు మృతిచెందారు. ఆ తర్వాతా అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగించాయి. ఇరాన్‌లో మృతుల సంఖ్య 1,937కి చేరింది. గల్ఫ్‌ దేశాల్లో ఏడుగురు భారతీయులు సహా 25 మంది మృతిచెందారు. ఇజ్రాయెల్‌లో 23 మంది మరణించారు.

  • ఇరాన్‌లోని నతాంజ్‌ అణుశుద్ధి కేంద్రం, బుషెహర్‌ అణు విద్యుత్‌ కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. దీనితో రేడియేషన్‌ వెలువడే ప్రమాదం ఉందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

  • ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీతోపాటు ఐఆర్‌జీసీ కమాండర్‌ మహమ్మద్‌ పాక్‌పౌర్‌, జనరల్‌ అబ్దొల్‌ రహీమ్‌ మౌసావి, ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ, సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ చీఫ్‌ అలీ లారిజానీ, బసిజ్‌ ఫోర్సెస్‌ చీఫ్‌ రెజా సోలేమానీ సహా కీలక నేతలు మృతిచెందారు.

  • హోర్ముజ్‌ జలసంధి మూసివేతతో చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ఇరాన్‌ దాడుల్లో మూడు ఎఫ్‌-15ఈ విమానాలు, ఆరు కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్‌ విమానాలు, 10 ఎంక్యూ-9 డ్రోన్లు కూలిపోయాయి. ఒక ఎఫ్‌-35, రెండు ఎఫ్‌-16 ఫైటర్లు దెబ్బతిన్నాయి. 13 మంది అమెరికా సైనికులు మరణించారు.

  • ఖతార్‌లోని అల్‌ ఉదేద్‌ అమెరికా సైనిక స్థావరంలో ఉన్న కీలకమైన ‘ఏఎన్‌/ఎ్‌ఫపీఎ్‌స-132 ఫేజ్డ్‌ అర్రే రాడార్‌’ వ్యవస్థ, బహ్రెయిన్‌లోని అమెరికా నేవీ ఫిఫ్త్‌ ఫ్లీట్‌ కమాండ్‌ సెంటర్‌, రాడార్లు, యూఏఈ, సౌదీ, కువైట్‌లలోని పలు పేట్రియాట్‌, థాడ్‌ క్షిపణి రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి.

  • ఇరాన్‌కు మద్దతుగా హెజ్బొల్లా రంగంలోకి దిగింది. దీనితో లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ విధ్వంసం సృష్టించింది. 1,300 మంది వరకు మరణించారు.

  • ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌, జేరుసలేం, డిమోనా, అరద్‌ ప్రాంతాల్లో, బెన్‌ గురియన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లు, హెజ్బొల్లా రాకెట్లు విధ్వంసం సృష్టించాయి.

  • ఇరాన్‌లోని ఇంధన నిల్వ కేంద్రాలు, గ్యాస్‌ క్షేత్రంపై ఇజ్రాయెల్‌ దాడులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా తప్పుపట్టారు. అయినా కూడా ఇరాన్‌లోని కీలక సదుపాయాలపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగించింది.


  • ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్‌ను ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, అమెరికాలోని యూదు లాబీ పురికొల్పిందని.. ఇరాన్‌పై సులువుగా గెలవవచ్చనే అబద్ధాన్ని చెప్పి దాడులకు ఒప్పించిందని ఆరోపిస్తూ అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్‌ జో కెంట్‌ రాజీనామా చేశారు.

  • హోర్ముజ్‌ జలసంధిని తెరిచి, రక్షణ కల్పించేందుకు రావాలని ట్రంప్‌ కోరినా.. నాటో దేశాలేవీ స్పందించలేదు. దీనిపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటో దేశాల నేతలను మూర్ఖులు అంటూ తిట్టిపోశారు.

  • యుద్ధంతో జరిగిన నష్టాలను పూడ్చుకొనేందుకంటూ.. హోర్ముజ్‌ జలసంధిలో ప్రయాణించే నౌకల నుంచి చార్జీలు వసూలు చేయడానికి ఇరాన్‌ సిద్ధమైంది. ఇందుకోసం చట్టాన్ని తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది.

  • చర్చల ప్రయత్నాలు సాగుతున్న సమయంలోనే ఇరాన్‌లోని అణు కేంద్రాలు, స్టీల్‌ ప్లాంటు, గ్యాస్‌ సరఫరా కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి.

  • తాజాగా హౌతీలు కూడా రంగంలోకి దిగడంతో.. ఎర్ర సముద్రం నుంచీ నౌకల రాకపోకలకు ఇబ్బంది తలెత్తి, ఉద్రిక్తతలు మరింత పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఎవరి పట్టు వారిదే..

అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ కోసం పాకిస్థాన్‌, ఈజిప్ట్‌, తుర్కియే తదితర దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో హోర్ముజ్‌ తెరవడం, యురేనియం అప్పగింత తదితర 15 అంశాల ప్రణాళికను ట్రంప్‌ ప్రతిపాదించగా.. ఇరాన్‌ తిరస్కరించింది. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని, అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశ్చాత్తాపపడే వరకు యుద్ధం కొనసాగిస్తామని ఐఆర్‌జీసీ ప్రకటించింది. అయితే గల్ఫ్‌లోని స్థావరాల ఎత్తివేత, నష్టపరిహారం చెల్లింపు, హోర్ముజ్‌పై ఇరాన్‌ అధికారానికి గుర్తింపు సహా ఆరు కీలక అంశాలతో డిమాండ్ల లిస్టును అమెరికా ముందు పెట్టింది. దౌత్య పరిష్కారం కోసమంటూ మొదట రెండురోజులు దాడులు నిలిపేసిన ట్రంప్‌.. తర్వాత ఐదు రోజులు, ఆపై మరో 10 రోజులు గడువు ఇచ్చారు. ఈ క్రమంలో దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి...

సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 29 , 2026 | 07:00 AM