Share News

మళ్లీ హోర్ముజ్‌ మూత

ABN , Publish Date - Jul 13 , 2026 | 06:14 AM

పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికా-ఇరాన్‌ మధ్య ఇటీవల మొదలైన పరస్పర దాడులు మరింతగా ముదిరాయి. హోర్ముజ్‌ జలసంధిలో తమ అనుమతి లేకుండా...

మళ్లీ హోర్ముజ్‌ మూత

  • పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత

  • జలసంధిలో తమ అనుమతి లేకుండా ప్రయాణిస్తోందంటూ వాణిజ్య నౌకపై ఇరాన్‌ దాడి

  • అందులో 11 మంది భారతీయులు.. ఒకరు గల్లంతు.. దాడిని ఖండించిన భారత్‌

  • సిబ్బందిని రక్షించేందుకు ఒమన్‌తో కలిసి రెస్క్యూ ఆపరేషన్‌

  • ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. 140 లక్ష్యాలపై దాడి.. ఇరాన్‌ ప్రతిదాడులు

  • బహ్రెయిన్‌, కువైట్‌, ఖతార్‌, ఒమన్‌లలోని అమెరికా స్థావరాలపైకి డ్రోన్లు, క్షిపణులు

దుబాయ్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, జూలై 12: పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికా-ఇరాన్‌ మధ్య ఇటీవల మొదలైన పరస్పర దాడులు మరింతగా ముదిరాయి. హోర్ముజ్‌ జలసంధిలో తమ అనుమతి లేకుండా ప్రయాణిస్తోందంటూ మరో వాణిజ్య నౌకపై ఇరాన్‌ దాడి చేసింది. దీనిపై ఆగ్రహించిన అమెరికా వెంటనే ఇరాన్‌పై విరుచుకుపడింది. ప్రతిగా ఇరాన్‌ కూడా గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైకి డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. అంతేకాదు హోర్ముజ్‌ జలసంధిని తిరిగి మూసేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఇరాన్‌ దాడి చేసిన వాణిజ్య నౌకలో 11 మంది భారతీయులు ఉండగా.. అందులో పదిమందిని రక్షించారు. మరొకరు గల్లంతయ్యారు. అమెరికాతో ఇటీవలి అవగాహన ఒప్పందం తర్వాత ఇరాన్‌ హోర్ముజ్‌ జలసంధిని తెరిచినా.. తమకు సమాచారమిచ్చి, టోల్‌ చెల్లించిన నౌకలను మాత్రమే, అదీ తాము నిర్దేశించిన మార్గం మీదుగా ప్రయాణించేందుకు అనుమతిస్తోంది. ఆ మార్గం ఇరాన్‌ తీరానికి దగ్గరగా ఉంది. మరోవైపు ఒమన్‌ తీరానికి సమీపంలోని మరో మార్గం నుంచి ప్రయాణించేలా కంటెయినర్‌ నౌకలు, చమురు ట్యాంకర్లకు అమెరికా సూచనలు చేస్తోంది. అలా నౌకలు ప్రయాణిస్తే హోర్ముజ్‌పై తమ పట్టు సడలిపోతుందని భావిస్తున్న ఇరాన్‌.. వాటిపై దాడులు చేస్తోంది. ఇలా గత వారం రోజుల్లోనే పది వరకు నౌకలపైకి క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించి దెబ్బతీసింది. దీనిని తప్పుపడుతూ ఇరాన్‌పై వైమానిక దాడులు చేస్తోంది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున ఒమన్‌ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న జీఎ్‌ఫఎస్‌ గెలాక్సీ కంటెయినర్‌ నౌకపై ఇరాన్‌ దాడి చేసింది. తమ సూచనలను పెడచెవిన పెట్టి.. తాము సూచించిన మార్గంలో కాకుండా, మరో మార్గంలో పలు నౌకలు ప్రయాణిస్తున్నాయని.. అందులో ఒకదానిపై హెచ్చరిక దాడి చేశామని ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జీసీ) వెల్లడించింది. హోర్ముజ్‌ జలసంధిని మూసివేస్తున్నామని ప్రకటించింది. దీనిపై మళ్లీ ప్రకటన చేసే వరకు మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే హోర్ముజ్‌ తెరిచే ఉందని, నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ పేర్కొనడం గమనార్హం.


ఒక భారతీయ నావికుడు గల్లంతు

ఇరాన్‌ దాడితో సైప్రస్‌ జెండాతో ప్రయాణిస్తున్న జీఎ్‌ఫఎస్‌ నౌక ఇంజన్‌ ప్రాంతంలో పేలుళ్లు జరిగి, మంటలు చెలరేగాయి. ఈ నౌకలో 11 మంది భారతీయ సిబ్బంది ఉండగా.. పది మందిని ఒమన్‌ తీరప్రాంత గస్తీ దళాలు కాపాడాయి. మరొకరు గల్లంతయ్యారు. ఒమన్‌ దళాలతో సమన్వయం చేసుకుని భారతీయ సిబ్బందిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టినట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతున్నట్టు తెలిపింది. హోర్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్‌ దాడులు ఆందోళనకరమని పేర్కొంది. జలసంధిలో నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించే పరిస్థితులు ఉండాలని స్పష్టం చేసింది.

140 లక్ష్యాలపై అమెరికా బాంబులు..

ఇరాన్‌ తీరుపై మండిపడిన అమెరికా దాడులు మొదలుపెట్టింది. హోర్ముజ్‌ సమీపంలోని ఇరాన్‌ దక్షిణ తీర ప్రాంత నగరాలు బందర్‌ మషెహర్‌, బందర్‌ అబ్బాస్‌, హెండిజాన్‌, బుషెహర్‌, అసల్యుయె, కంగాన్‌, జాస్క్‌లతోపాటు రాజధాని టెహ్రాన్‌పైనా బాంబులు, క్షిపణులు వేసింది. మొత్తం 140 లక్ష్యాలపై దాడులు చేశామని.. క్షిపణి, డ్రోన్‌ లాంఛర్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు, సమాచార, నిఘా వ్యవస్థలను ధ్వంసం చేశామని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్‌ దాడులు చేసే సామర్థ్యాన్ని దెబ్బతీసినట్టు తెలిపింది. ఇక ఇరాన్‌ తప్పుడు మార్గాన్ని ఎంచుకుందని, దీనికి తగిన మూల్యం చెల్లిస్తుందని అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్‌ హెచ్చరించారు. మరోవైపు ఇరాన్‌ కూడా దీటుగా స్పందించింది. బహ్రెయిన్‌, ఖతార్‌, ఒమన్‌ తదితర దేశాల్లో అమెరికా స్థావరాలపైకి డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. కువైట్‌లో అమెరికా పేట్రియాట్‌ క్షిపణి వ్యవస్థ, ఆయుధ డిపో, రాడార్లను ధ్వంసం చేసినట్టు ఐఆర్‌జీసీ ప్రకటించింది. ఖతార్‌లోని అల్‌ ఉదైద్‌ ఎయిర్‌బే్‌సలో యుద్ధ విమానాల మరమ్మతుల కేంద్రం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ధ్వంసం చేసినట్టు తెలిపింది. అయితే ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకున్నామని.. అయితే వాటి శకలాలు పడి, పేలుళ్లు జరిగి ఒక చిన్నారి సహా ముగ్గురు గాయపడ్డారని ఖతార్‌ ప్రకటించింది. బహ్రెయిన్‌లో రోజంతా సైరన్లు మోగుతూనే ఉన్నాయని స్థానికులు పేర్కొన్నారు. యూఏఈలోనూ పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. కాగా, ఏకపక్ష ఒప్పందాలకు కాలం చెల్లిందని, ఒప్పందం విషయంలో అమెరికా మాటమీద నిలబడాలని ఇరాన్‌ స్పీకర్‌ బఘర్‌ ఘలీబఫ్‌ స్పష్టం చేశారు.


అర్ధరాత్రి తర్వాత బాంబుల వర్షం

ఆదివారం అర్ధరాత్రి తర్వాత అమెరికా, ఇరాన్‌ మధ్య మరోసారి ఉధృతంగా పరస్పర దాడులు జరిగాయి. హోర్ముజ్‌ జలసంధిలోని ఖెష్మ్‌ దీవి, బందర్‌ అబ్బాస్‌ పోర్టు, హజ్జియాబాద్‌ పోర్టుపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఖెష్మ్‌ దీవిలోని పలు ప్రాంతాల్లో 11కుపైగా భారీ పేలుళ్లు సంభవించినట్టు ఆ ప్రాంత గవర్నర్‌ ప్రకటించారు. ఇక కువైట్‌లోని అమెరికా స్థావరంలో ఉన్న హిమార్స్‌ క్షిపణి లాంఛర్లను, క్షిపణుల నిల్వ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్టు ఐఆర్‌జీసీ పేర్కొంది. ఖతార్‌, బహ్రెయిన్‌, యూఏఈ, జోర్డాన్‌లపైనా దాడులు చేసినట్టు తెలిపింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో.. ఖతార్‌ తమ దేశ తీరప్రాంతం వెంట సముద్ర కార్యకలాపాలపై నిషేధం విధించింది. వాణిజ్య, విహార నౌకలు, చేపల బోట్లు సహా ఏవీ సముద్రంలోకి వెళ్లకూడదని, ప్రజా భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది.

తమ యుద్ధ వాహక నౌక నుంచి ఇరాన్‌ వైపు క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ విడుదల చేసిన వీడియోలోని దృశ్యం

Also Read:

ఫిరంగి కోసం పోరాటం

Updated Date - Jul 13 , 2026 | 06:14 AM