వరుణ్‌పై గతంలోనూ క్రిమినల్ కేసు
ABN , Publish Date - Aug 11 , 2026 | 05:10 AM
అమెరికాలో తన ప్రియురాలిని హత్య చేసి జర్మనీలో అరెస్టయిన భారతీయ యువకుడు వరుణ్ బచ్చిగారిపై గతంలోనూ క్రిమినల్ కేసు నమోదైనట్టు అరిజోనా పోలీసుల దర్యాప్తులో తేలింది...
8 అమెరికాలో ప్రియురాలి హత్య కేసు దర్యాప్తులో గుర్తించిన ఆరిజోనా పోలీసులు
8 జర్మనీ పోలీసుల అదుపులో నిందితుడు
8 అరిజోనా పోలీసులకు అప్పగించే ప్రయత్నాలు
వాషింగ్టన్, ఆగస్టు 10: అమెరికాలో తన ప్రియురాలిని హత్య చేసి జర్మనీలో అరెస్టయిన భారతీయ యువకుడు వరుణ్ బచ్చిగారిపై గతంలోనూ క్రిమినల్ కేసు నమోదైనట్టు అరిజోనా పోలీసుల దర్యాప్తులో తేలింది. గతేడాది చివరల్లో 20 ఏళ్ల వరుణ్‌తో విభేదాలు తలెత్తడంతో అతని ప్రియురాలు జూలిస్సా రూబీ సలాజర్ (19) ఇంటి నుంచి వెళ్లిపోయింది. వరుణ్‌తో ఉన్న సమయంలో గృహహింసను ఎదుర్కొన్న ఆమె ఇక వారి బంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ ఏడాది మే నెలలో దాడి, ఉద్దేశపూర్వకంగా గాయపరచడం వంటి నేరాలపై వరుణ్‌పై పిమా కౌంటీ కోర్టులో ఒక క్రిమినల్ కేసు నమోదైంది. ఈ నెల 6న అరిజోనా రాష్ట్రంలోని టక్సన్‌లో సలాజర్ హత్యకు గురైంది. ఈ హత్య వరుణ్ చేశాడని ఆరోపించిన పోలీసులు.. అనంతరం సలాజర్ సెల్‌ఫోన్, క్రెడిట్ కార్డులను దొంగిలించాడని, ఆమె తల్లికి వరుసగా సందేశాలు పంపాడని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు టక్సన్‌లోని సలాజర్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి పరిశీలించగా ఆమె నేలపై విగతజీవిగా పడి ఉంది. గొంతు నులిమిన ఆనవాళ్లు, శరీరం పై గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వరుణ్‌పై హత్య, కిడ్నాప్ ఆరోపణలతో అరెస్ట్ వారెంట్ తీసుకున్నారు. హత్య అనంతరం వరుణ్ టక్సన్ నుంచి జర్మనీకి పారిపోయి.. అక్కడి నుంచి భారత్‌కు చేరుకోవాలని భావించాడు. అయితే ఫెడరల్ అధికారులు, జర్మనీ పోలీసులు.. బెర్లిన్ విమానాశ్రయంలో నిందితుడిని అరెస్టు చేశారు. జర్మనీ పోలీసుల అదుపులో ఉన్న వరుణ్‌ను అరిజోనా పోలీసులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
ఫిట్‌నెస్ కోసం 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్ ఈసారైనా నిరూపించుకుంటాడా?
2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్