Share News

పాకిస్థాన్ సరిహద్దుల్లో నౌకలు.. 11 గంటలపాటు మాయం..

ABN , Publish Date - Feb 21 , 2026 | 08:16 AM

ఫిబ్రవరి 6వ తేదీన ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు నౌకలను నేవీ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫిబ్రవరి 15వ తేదీన ఎల్లో గేట్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం 9 మందిపై కేసు నమోదైంది.

పాకిస్థాన్ సరిహద్దుల్లో నౌకలు.. 11 గంటలపాటు మాయం..
The Indian Coast Guard

ముంబై, ఫిబ్రవరి 21: ఇండియన్ నేవీ అధికారులు ఇరాన్‌కు చెందినవిగా భావిస్తున్న ఆయిల్ సరఫరా చేసే మూడు నౌకలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6వ తేదీన ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న ఆ మూడు నౌకలను నేవీ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫిబ్రవరి 15వ తేదీన ఎల్లో గేట్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం 9మందిపై కేసు నమోదైంది. 9మందిలో ఆ మూడు నౌకల యజమాని కూడా ఉన్నాడు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.


నేవీ అధికారులు సీజ్ చేసిన నౌకల పేర్లు అస్ఫల్ట్ స్టార్, స్టెల్లార్ రూబీ, ఏఐ జఫ్జియాగా గుర్తించారు. నేవీ అధికారులు సీజ్ చేసే సమయానికి వాటిల్లో 55మంది సిబ్బంది ఉన్నారు. సీజ్ చేయడానికి ముందు మూడు నౌకలు పాకిస్థాన్ మ్యారీటైమ్ జోన్‌(సముద్రంలో పాకిస్థాన్‌కు అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఉన్న హక్కుల పరిధి)లో కొన్ని రోజులపాటు ఉన్నాయి. జనవరి 28వ తేదీన ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఐఎస్), వెరీ హై ఫ్రీక్వెన్సీలతోపాటు అన్ని సెన్సార్స్‌ను ఆఫ్ చేశాయి. 11 గంటలపాటు సిగ్నల్స్‌కు దొరకకుండా మాయం అయ్యాయి.


ఈ సమయంలో ట్యాంకర్లు అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడినట్లు నేవీ అధికారులు భావిస్తున్నారు. సిగ్నల్స్‌కు దొరకకుండా ఉండేలా మూడు ట్యాంకర్లు ఏఐఎస్ స్పూఫింగ్, ఫాల్స్ ఐడెంటిటీ డేటాను వాడుతున్నల్లు తేలింది. యూఏఈకి చెందిన ట్యాంకర్ల యజమాని స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. తన ట్యాంకర్లు ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నాడు. భారత సరిహద్దులకు దూరంగా ఉన్న ఇతర నౌకలకు తమ ట్యాంకర్లు అత్యవసరాలను అందించాయని చెప్పాడు.


ఇవి కూడా చదవండి

గుట్టువిప్పరు..కారణాలు చెప్పరు?

పెరిగిన పచ్చిమిర్చి, దొండ..తగ్గిన టమోటా

Updated Date - Feb 21 , 2026 | 09:05 AM