Share News

ఇరాన్‌ను విడిచి వెళ్లండి.. భారత పౌరులకు ఎంబసీ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:22 PM

ఇరాన్‌లో ఉన్న భారతీయులకు ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.

ఇరాన్‌ను విడిచి వెళ్లండి.. భారత పౌరులకు ఎంబసీ కీలక ఆదేశాలు
India advisory Iran

టెహ్రాన్, ఏప్రిల్ 8: ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ఆగిన సంగతి తెలిసిందే. ఇరాన్, అమెరికాల మధ్య 15 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ‘ది ట్రూత్‌’లో వరుస పోస్టులు పెడుతున్నారు. తాజాగా, ‘ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు. ఇరాన్‌తో పాటు ఇతర దేశాలు కూడా శాంతి కోరుకుంటున్నాయి. హోర్ముజ్‌ జలసంధిలో ట్రాఫిక్‌ క్లియరెన్స్‌కు సహకరిస్తాం’ అని రాసుకొచ్చారు. అమెరికా సీజ్ ఫైర్ నిర్ణయానికి ఇజ్రాయెల్‌ కూడా మద్దతు తెలిపింది. లెబెనాన్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేసింది.


ఇండియన్ ఎంబసీ కీలక ఆదేశాలు

ఇరాన్‌లో ఉన్న భారతీయులకు ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. అవసరమైతే భారత రాయబార కార్యాలయం సహాయం తీసుకోవాలని తెలిపింది. తాము సూచించిన మార్గాల్లో మాత్రమే దేశాన్ని వీడాలని ఎంబసీ ఆదేశించింది. ఎంబసీని సంప్రదించకుండా.. పర్మీషన్ తీసుకోకుండా అంతర్జాతీయ సరిహద్దుల వద్దకు వెళ్లరాదని హెచ్చరించింది. ఈ మేరకు ఎంబసీ బుధవారం ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టింది.


హోర్ముజ్‌ జలసంధిపై వెనక్కి తగ్గని ఇరాన్‌

ఇరాన్, అమెరికా దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగినా కూడా హోర్ముజ్ విషయంలో ఇరాన్ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. ఇప్పటికీ ఇరాన్‌ నియంత్రణలోనే హోర్ముజ్‌ జలసంధి ఉంది. హోర్ముజ్‌లో షిప్పుల నుంచి ఇరాన్ భారీ మొత్తంలో టోల్‌ వసూలు చేస్తోంది. టోల్‌ ఫీజు ఆదాయాన్ని పునర్నిర్మాణానికి ఖర్చు చేస్తామని అంటోంది.


ఇవి కూడా చదవండి

మున్సిపల్ కార్పొరేషన్‌లో మంత్రి ఆకస్మిక తనిఖీ.. సిబ్బందిపై ఆగ్రహం

కమల్‌ను ప్రచారానికి ఆహ్వానించిన సీపీఎం

Updated Date - Apr 08 , 2026 | 12:27 PM