Share News

ఇరాన్‌తో అలాంటి ఒప్పందం ఏదీ లేదు: మంత్రి జైశంకర్

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:48 PM

హోర్ముజ్ మీదుగా భారత నౌకల అనుమతి కోసం ఇరాన్‌తో సమగ్ర ఒప్పందం ఏదీ లేదని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. రెండు నౌకలకు మాత్రం ఇరాన్ అనుమతించిందని చెప్పారు.

ఇరాన్‌తో అలాంటి ఒప్పందం ఏదీ లేదు: మంత్రి జైశంకర్
S Jaishankar On talks with Iran

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో రిజిస్టర్ అయిన చమురు రవాణా నౌకల కోసం ఇరాన్‌తో ఎలాంటి సమగ్ర ఒప్పందం లేదని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇటీవల జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో హోర్ముజ్ జలసంధి మీదుగా రెండు భారత ఆయిల్ ట్యాంకర్‌లను ఇరాన్ అనుమతించిందని చెప్పారు.

అమెరికా, ఇజ్రాయెల్‌, వాటి మిత్ర దేశాల చమురు రవాణా నౌకలను హోర్ముజ్ మీదుగా ఇరాన్ అనుమతించట్లేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌కు రావాల్సిన నౌకలు కూడా అక్కడ నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన మంత్రి జైశంకర్ ఇరాన్‌తో చర్చలు జరపడంతో రెండు భారతీయ నౌకలకు అనుమతి లభించింది.


ఈ విషయంలో అసలేం జరిగిందో మంత్రి జైశంకర్ తాజాగా స్పందించారు. ‘నేను ప్రస్తుతం వారితో చర్చలు జరుపుతున్నాను. నా ప్రయత్నాలు కొంత ఫలితాన్ని ఇచ్చాయి. కాబట్టి, సహజంగానే ఈ దిశగా మరిన్ని ప్రయత్నాలు ఉంటాయి’ అని మంత్రి అన్నారు. భారత నౌకలను అనుమతించినందుకు బదులుగా ఇరాన్‌ ప్రత్యేకంగా ఏమీ ఆశించలేదని తెలిపారు. ‘ఇది ఇచ్చి పుచ్చుకునే అంశం కాదు. ఇరాన్, భారత్‌ల మధ్య దౌత్య సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులపై ఇరు దేశాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి’ అని చెప్పారు.

ప్రస్తుతం ఇరాన్‌తో చర్చలు తొలి దశలోనే ఉన్నాయని మంత్రి జైశంకర్ తెలిపారు. భారత్ జెండాలు ఉన్న నౌకలు ఆ ప్రాంతంలో ఇంకా ఉన్నాయని చెప్పారు. కాబట్టి, ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. అయితే, భారతీయ నౌకలకు అనుమతి కోసం ఇరాన్‌తో పూర్తిస్థాయి ఒప్పందం ఏదీ లేదని స్పష్టం చేశారు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలకు చర్చలే పరిష్కారమని కూడా మంత్రి స్పష్టం చేశారు. భారత్ అభిప్రాయం ఇదేనని అన్నారు. తార్కిక దృష్టితో అంతా కలసికట్టుగా శ్రమించి పరిష్కారం కనుగొనాలని సూచించారు.


ఇవి కూడా చదవండి:

యుద్ధ నౌకల కోసం ట్రంప్ అభ్యర్థన.. తిరస్కరించిన మిత్ర దేశాలు

ఇరాన్ దాడులు.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులకు బ్రేక్

Updated Date - Mar 16 , 2026 | 01:13 PM