కాలిఫోర్నియాలో దారుణం.. గర్భిణిని నేలపైకి ఈడ్చి పెప్పర్ స్ప్రే చల్లిన ICE అధికారులు
ABN , Publish Date - Nov 18 , 2026 | 02:47 PM
కాలిఫోర్నియాలో జైలు వెలుపల నిరసన తెలుపుతున్న 12 వారాల గర్భిణిని ICE అధికారులు నేలపైకి ఈడ్చి పెప్పర్ స్ప్రే చల్లారు. ఆ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాలిఫోర్నియా (అమెరికా), నవంబర్ 18: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఒక జైలు వెలుపల నిరసన తెలుపుతున్న 12 వారాల గర్భిణిపై ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. ఆమెను బలవంతంగా నేలపైకి ఈడ్చి, ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అస్వస్థతకు గురైన ఆమెను స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. 23 ఏళ్ల అమెరికన్ పౌరురాలిపై జరిగిన ఈ దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఫెడరల్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బాధితురాలిని 23 ఏళ్ల అమెరికన్ పౌరురాలు లిజ్బెత్ వర్గాస్ ఆండ్రేడ్ గా గుర్తించారు. కాలిఫోర్నియాలోని మోడెస్టోలో ఉన్న స్టానిస్లాస్ కౌంటీ జైలు నుంచి విడుదలవుతున్న వ్యక్తులను ఐసీఈ (ICE) ఏజెంట్లు అదుపులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె తన భర్త, వదినతో కలిసి జైలు వెలుపల నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదంలో ముగ్గురు ఐసీఈ అధికారులు ఆండ్రేడ్ను బలవంతంగా నేలపైకి లాగి పడేశారు. ఆమె ఒక అధికారిపై చేయి వేయడంతో వారు ఆమెను కిందకు తోసి, పెప్పర్ స్ప్రే చల్లినట్లు ఆమె తరపు న్యాయవాది పాట్రిక్ కొలాసిన్స్కీ తెలిపారు.
ఘటన అనంతరం ఫెడరల్ అధికారులు ఆమెను కొన్ని గంటల పాటు నిర్బంధంలో ఉంచి, ఆ తర్వాత విడుదల చేశారు. ఆమె కుటుంబ సభ్యులు విడుదల చేసిన వీడియోలలో ఆండ్రేడ్ను స్ట్రెచర్‌పై బయటకు తీసుకువచ్చి, స్టాక్టన్ ప్రాంతంలోని ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. అంబులెన్స్ నుంచి ఆమెతో పాటు ఒక ఐసీఈ అధికారి కూడా దిగడం కనిపించింది. వైద్య పరీక్షల అనంతరం ఆండ్రేడ్, ఆమె కడుపులోని శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, ప్రస్తుతం ఆమె ఇంటికి చేరుకున్నారని న్యాయవాది వెల్లడించారు.
గర్భిణి అని కూడా చూడకుండా అమెరికన్ పౌరురాలిపై ఫెడరల్ ఏజెంట్లు ఇంతటి బలప్రయోగం చేయడం, అక్రమంగా నిర్బంధించడంపై న్యాయవాది తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఘటనపై మోడెస్టో పోలీస్ డిపార్ట్మెంట్ స్పందిస్తూ.. కాలిఫోర్నియా చట్టాలకు అనుగుణంగా తాము ఈ నిర్బంధ ప్రక్రియలో పాల్గొనలేదని, ఫెడరల్ అధికారులకు ఎలాంటి సహాయం చేయలేదని స్పష్టం చేసింది. స్టానిస్లాస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం కూడా ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఉత్తర కాలిఫోర్నియా, బే ఏరియా ప్రాంతాల్లో ఇమ్మిగ్రేషన్ దాడులు పెరగడంపై స్థానిక ప్రజలు, చట్టసభ సభ్యుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. (ICE pepper spray pregnant woman)
ఇవి కూడా చదవండి..
కశ్మీర్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..