Share News

పెళ్లి ఉంగరాలు, గాజులు.. దేశాన్ని కాపాడేందుకు 227 టన్నుల బంగారం ఇచ్చిన దక్షిణ కొరియా ప్రజలు..

ABN , Publish Date - Jul 04 , 2026 | 01:51 PM

దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ఆసియా ఆర్థిక సంక్షోభం దక్షిణ కొరియాను తీవ్రంగా దెబ్బతీసింది. విదేశీ మారక నిల్వలు క్షీణించడంతో 1997లో దక్షిణ కొరియా ఆర్థికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంది.

పెళ్లి ఉంగరాలు, గాజులు.. దేశాన్ని కాపాడేందుకు 227 టన్నుల బంగారం ఇచ్చిన దక్షిణ కొరియా ప్రజలు..
South Korea gold donation

దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ఆసియా ఆర్థిక సంక్షోభం దక్షిణ కొరియాను తీవ్రంగా దెబ్బతీసింది. విదేశీ మారక నిల్వలు క్షీణించడంతో 1997లో దక్షిణ కొరియా ఆర్థికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంది. పరిస్థితి చేయి దాటడంతో ప్రభుత్వం, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సహాయం కోరింది. అప్పటికి చరిత్రలోనే అతిపెద్ద బెయిల్ అవుట్ ప్యాకేజీలలో ఒకదానిని స్వీకరించాల్సి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో దక్షిణ కొరియా ప్రజల స్ఫూర్తి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది (South Korea gold donation).


దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు బంగారాన్ని స్వచ్ఛందంగా అందించాలని ప్రజలను దక్షిణ కొరియా ప్రభుత్వం కోరింది. ఈ పిలుపునకు దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. 35 లక్షల మందికి పైగా ప్రజలు తమ పెళ్లి ఉంగరాలు, గొలుసులు, గాజులు, కుటుంబ వారసత్వ ఆభరణాలు, బంగారు నాణాలు, చివరకు ఒలింపిక్ పతకాలను కూడా ప్రభుత్వానికి అందజేశారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని అందించేందుకు ప్రజలు బ్యాంకుల ముందు బారులు తీరారు (South Korea economic crisis).

SOUTH2.jpg


కేవలం నాలుగు నెలల్లోనే ప్రజల నుంచి ప్రభుత్వం 227 టన్నుల బంగారాన్ని స్వీకరించింది. దీని విలువ అప్పటి లెక్కల ప్రకారం 2.1 బిలియన్ డాలర్లకు పైగానే ఉంది. ఈ బంగారాన్ని ప్రభుత్వం కరిగించి అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించి, వచ్చిన నిధులతో విదేశీ రుణ భారం తగ్గించింది. ఆ సమయంలో దక్షిణ కొరియా ప్రజల ఐక్యత, త్యాగం ఇతర దేశాల పెట్టుబడిదారులను విపరీతంగా ఆకర్షించాయి (South Korea national unity).


ఈ 'గోల్డ్ కలెక్షన్ మూవ్‌మెంట్' (Gold Collection Movement) ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప ప్రజా భాగస్వామ్య ఉద్యమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశం కోసం వ్యక్తిగత సంపదను త్యాగం చేయడానికి లక్షలాది మంది ముందుకు రావడం జాతీయ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. ఆ సంక్షోభం నుంచి దక్షిణ కొరియా వేగంగా కోలుకుని, కొద్ది సంవత్సరాల్లోనే తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంది. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఎదిగింది.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు పెరుగుతున్నాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


భర్త కనబడడం లేదని ఫిర్యాదు చేసింది.. చివరకు ఇంటి బాత్రూమ్ కింద తవ్వి చూడగా..

Updated Date - Jul 04 , 2026 | 03:04 PM