Share News

యెమెన్‌లో భీకర యుద్ధం

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:22 AM

యెమెన్‌లో ఇరాన్‌ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులకు అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ప్రభుత్వానికి మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది.

యెమెన్‌లో భీకర యుద్ధం
saudi

  • కీలక పట్టణం తుర్బాను స్వాధీనం చేసుకున్న హూతీలు

  • దేశంలో మూడో పెద్ద నగరం తెయిజ్‌ ముట్టడి

  • హూతీలను నిలువరించేందుకు 100యుద్ధ విమానాలతో సౌదీ ఆపరేషన్‌

  • ఆపరేషన్‌ డాన్‌ ఆఫ్‌ యెమెన్‌ పేరుతో యెమెన్‌ ప్రభుత్వం సైనిక చర్య

  • 1,747 మంది హూతీ రెబల్స్‌ను చంపేశామని ప్రకటన

ఎడెన్‌, అక్టోబరు 5: యెమెన్‌లో ఇరాన్‌ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులకు అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ప్రభుత్వానికి మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. హూతీలను అణచివేసేందుకు ఈ యుద్ధంలోకి సౌదీ అరేబియా కూడా ప్రవేశించటంతో పోరాటం భీకరంగా సాగుతోంది. ఇటీవల దూకుడు పెంచిన హూతీలు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన తుర్బా పట్టణాన్ని ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పశ్చిమ తీరప్రాంతం మొత్తాన్ని ఆక్రమించిన వీరు.. ప్రభుత్వానికి ప్రధాన పరిపాలనా కేంద్రంగా ఉన్న ఎడెన్‌ నగరంపై దృష్టి సారించారు. అందులో భాగంగానే తుర్బా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ బలగాలకు ప్రధాన స్థావరమైన దేశంలోనే మూడో అతిపెద్ద నగరం తెయిజ్‌ను ఎడెన్‌ నగరంతో కలిపే రహదారిపై ఈ తుర్బా పట్టణం ఉంది. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటంతో ప్రభుత్వ బలగాలు ఎడెన్‌ నుంచి తెయిజ్‌కు, ఇటు నుంచి ఎడెన్‌కు వేగంగా కదలకుండా హూతీలు నిరోధించగలుగుతున్నారు. తెయిజ్‌ నగరాన్ని కూడా హూతీలు చుట్టుముట్టినట్లు తెలిసింది. ఆ నగరం చుట్టూ ఉన్న గ్రామాలను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు.


YAMENTEIZ.jpg100 యుద్ధ విమానాలతో సౌదీ ఆపరేషన్‌

హూతీలు తుర్బా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న కొద్దిసేపటికే వారిపై ఆపరేషన్‌ డాన్‌ ఆఫ్‌ యెమెన్‌ పేరుతో భారీ సైనిక చర్య చేపడుతున్నట్లు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రెసిడెన్షియల్‌ లీడర్‌షిప్‌ కౌన్సిల్‌ అధిపతి రషద్‌ అల్‌ అలిమీ ప్రకటించారు. ఈ సైనిక చర్యకు తాము పూర్తి మద్దతు ఇస్తామని సౌదీ అరేబియా ప్రకటించింది. దాదాపు 100 యుద్ధ విమానాలతో హూతీలపై సౌదీ మిలిటరీ విరుచుకుపడింది. హూతీలపై 1,122 లక్షిత దాడులు చేసినట్లు యెమెన్‌ ప్రభుత్వం తెలిపింది. ఈ దాడుల్లో 1,747 మంది తిరుగుబాటుదారులు చనిపోయినట్లు వెల్లడించింది. హూతీల రాకెట్‌ దాడుల్లో సౌదీలోని అత్యంత కీలకమైన ఈస్ట్‌ వెస్ట్‌ చమురు పైప్‌లైన్‌ దెబ్బ తినటంతో సరఫరాను నిలిపేశారు. హూతీలతో పోరు నేపథ్యంలో సౌదీలోని రియాద్‌లో మక్కా జాయింట్‌ డిఫెన్స్‌ అగ్రిమెంట్‌ ప్రకారం సోమవారం అత్యవసర భేటీ నిర్వహించినట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది. మక్కా భద్రతా కూటమిలో సౌదీ, పాక్‌, తుర్కియే దేశాలున్నాయి. కాగా, అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన బాబ్‌ ఎల్‌ మండెబ్‌ జలసంధిపై హూతీలు ఇటీవల పట్టు పెంచుకున్న సంగతి తెలిసిందే.

ఇరాన్‌ మహిళలకు సైనిక శిక్షణ

అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమదేశంలోని మహిళలకు కూడా సైనిక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. టెహ్రాన్‌లో ఎంపిక చేసిన మహిళలకు ఆదివారం నుంచి సైనిక శిక్షణ ప్రారంభమైందని ఆ దేశ మీడియా వెల్లడించింది. ఇస్లామిక్‌ పాలకుల చేతిలో ఉన్న ఇరాన్‌లో మహిళలపై కఠిన ఆంక్షలు ఉంటాయి. ఈ ఆంక్షలను వ్యతిరేకిస్తూ గతంలో ఆ దేశ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించారు. ఇప్పుడే ప్రభుత్వమే వారికి తుపాకులు వాడటంలో శిక్షణ ఇస్తుండం విశేషం.

ఈ వార్తలు కూడా చదవండి

అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.

ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్

Updated Date - Oct 06 , 2026 | 04:29 AM