Share News

సౌదీ చమురు ట్యాంకర్లపై దాడి చేసింది మేమే: హౌతీ

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:49 PM

ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న సౌదీ అరేబియాకు చెందిన రెండు భారీ చమురు ట్యాంకర్లపై తాము క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్లు యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుదారైన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.

సౌదీ చమురు ట్యాంకర్లపై దాడి చేసింది మేమే: హౌతీ
Houthis Claim Attack on Two Saudi Oil Tankers

సనా/రియాద్, జులై 23: పశ్చిమాసియా ప్రాంతంలో వైరం మరో తీవ్ర స్థాయికి చేరింది. ఎర్రసముద్రంలో (Red Sea) ప్రయాణిస్తున్న సౌదీ అరేబియాకు చెందిన రెండు భారీ చమురు ట్యాంకర్లపై తాము క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్లు యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుదారైన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఇటీవల యెమెన్ రాజధాని సనా (Sanaa) విమానాశ్రయంపై సౌదీ దళాలు నిర్వహించిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ సైనిక చర్య చేపట్టినట్లు స్పష్టం చేశారు.


హౌతీ దళాల అధికారిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరియా (Yahya Saree)టెలిగ్రామ్ వేదికగా ఈ దాడి వివరాలను వెల్లడించారు. సౌదీ అరేబియాకు చెందిన 'ఎన్సేలియా' (ENCELIA), 'లైలా' (LAYLA) అనే రెండు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు తెలిపారు. బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, విస్ఫోటన డ్రోన్లతో ఈ దాడి జరిపినట్లు, ఈ దెబ్బకు రెండు నౌకల్లోనూ భారీగా మంటలు చెలరేగాయని హౌతీలు ప్రకటించారు. ఈ దాడి భయంతో మరో 10 వాణిజ్య నౌకలు ప్రయాణాన్ని రద్దు చేసుకుని వెనక్కి మళ్లినట్లు ఆయన పేర్కొన్నారు.


మరోవైపు, సౌదీ అరేబియా రవాణా శాఖ (TGA) స్పందిస్తూ ఎర్రసముద్రంలో 'ఎన్సేలియా' నౌక ముందు భాగంపై దాడి జరిగి మంటలు చెలరేగిన మాట వాస్తవమేనని, అయితే నౌకలోని సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది.


'దిగ్బంధనానికి దిగ్బంధనమే సమాధానం'.. హౌతీల హెచ్చరిక

గత 12 ఏళ్లుగా సౌదీ అరేబియా తమ దేశంపై అక్రమ దిగ్బంధనాన్ని ప్రయోగిస్తోందని, దానికి సమాధానంగా తాము సౌదీ నౌకలపై 'సముద్ర దిగ్బంధనం' విధిస్తున్నామని హౌతీ ప్రతినిధి ప్రకటించారు.

'సౌదీ-అమెరికా శక్తులు మా ప్రజలపై చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టేందుకు, మా వనరులు, హక్కులను తిరిగి పొందేందుకు 'దిగ్బంధనానికి దిగ్బంధనమే' మా విధానం. సౌదీ అరేబియా యెమెన్‌పై మళ్లీ దాడికి తెగబడితే... ఇకపై వారి దేశ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారీ స్థాయి సైనిక చర్యలు చేపడతాం. దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి'.అని హౌతీ మిలిటరీ ప్రతినిధి యాహ్యా సరియా చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ట్రేడింగ్‌ పేరుతో రూ.15 కోట్లకు టోకరా

రాష్ట్రంలో మరో 4 కొవిడ్‌ కేసులు

Updated Date - Jul 23 , 2026 | 01:13 PM