బిల్‌బోర్డులపై అశ్లీల చిత్రాలు
ABN , Publish Date - Nov 03 , 2026 | 07:30 AM
పలు దేశాల్లో రోడ్ల పక్కన, రద్దీప్రాంతాల్లో ఏర్పాటుచేసిన డిజిటల్ బిల్‌బోర్డులపై అశ్లీల వీడియోలు ప్రసారం కావటం కలకలం రేపింది.
ఈజిప్టు, బ్రెజిల్, మలేషియా, చైనా, ఇరాక్‌లో ప్రసారం
బిల్‌బోర్డుల నిర్వహణ కంపెనీని
హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు
ప్రకటనల స్థానంలో అశ్లీల వీడియోల ప్రసారం
కైరో, నవంబరు 2: పలు దేశాల్లో రోడ్ల పక్కన, రద్దీప్రాంతాల్లో ఏర్పాటుచేసిన డిజిటల్ బిల్‌బోర్డులపై అశ్లీల వీడియోలు ప్రసారం కావటం కలకలం రేపింది. ఈజిప్టు, మలేషియా, బ్రెజిల్‌తోపాటు చైనా, ఇరాక్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న బిల్‌బోర్డులపై గత గురువారం ఒక్కసారిగా నీలిచిత్రాలు ప్రసారమయ్యాయి. ఈజిప్టులోని చాలా ప్రాంతాల్లో ఈ వీడియోలు ప్రసారం కావటంతో ఆ మార్గాల్లో వెళ్లేవారు కొందరు వాటిని వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ఈ పని తామే చేసినట్లు టెలిగ్రామ్ యాప్‌లో లీకర్స్ అనే గ్రూప్‌ను నిర్వహిస్తున్న హ్యాకర్లు ప్రకటించారు. బిల్‌బోర్డులను హైజాక్ చేయటానికి తమకు కొన్ని గంటల సమయమే పట్టిందని తెలిపారు. తాము డబ్బుకోసమో, బెదిరించటానికో ఈ పనిచేయలేదని.. బిల్‌బోర్డులను నిర్వహించే కంపెనీల సాఫ్ట్‌వేర్‌లు ఎంత బలహీనంగా ఉన్నాయో చెప్పటానికే చేసినట్లు తెలిపారు. ఈజిప్టులో నియంతల పాలన సాగుతోందని, ప్రజల జీవితాలు దశాబ్దాలు గడిచినా బాగుపడటం లేదని ఆరోపించారు. ఈ ఘటనపై ఈజిప్టు అంతర్గత వ్యహారాల శాఖ స్పందించింది. బిల్‌బోర్డుల నిర్వహణ సంస్థ వెబ్‌సైట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసి ఈ ఘటనకు పాల్పడ్డారని పేర్కొంది. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించింది. బిల్‌బోర్డుల నిర్వహణ సంస్థ అల్ అరేబియా యునైటెడ్ కూడా ఈ ఘటనపై స్పందించింది. తమ బిల్‌బోర్డులు హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలియగానే వాటిని స్విచాఫ్ చేసినట్లు వెల్లడించింది. బ్రెజిల్‌లోని క్యాంపో మయియోర్ వద్ద హైవే బీఆర్- 343పై ఉన్న బిల్‌బోర్డుపై కూడా నీలిచిత్రాలు ప్రసారమయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి