రోదసిలో ఏఐ చిప్స్ పనిచేస్తాయా?
ABN , Publish Date - Sep 26 , 2026 | 03:29 AM
భూమికి ఆవల.. అంతరిక్షంలో.. ఆర్బిటల్ (కక్ష్యలో సొంత తెలివితో పనిచేసే) డేటా సెంటర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న గూగుల్ సంస్థ.. అసలు అక్కడ ఏఐ కంప్యూటింగ్ చిప్స్ పనిచేస్తాయో లేదో పరీక్షించేందుకు ప్రాజెక్ట్ సన్‌క్యాచర్ పేరిట ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టింది.

ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’ద్వారా అంతరిక్షంలో
ఏఐ చిప్స్ పరీక్షలు
కక్ష్యలో డేటా సెంటర్ల ఏర్పాటుకు గూగుల్ ప్రయోగాలు
న్యూయార్క్, సెప్టెంబరు 25: భూమికి ఆవల.. అంతరిక్షంలో.. ఆర్బిటల్ (కక్ష్యలో సొంత తెలివితో పనిచేసే) డేటా సెంటర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న గూగుల్ సంస్థ.. అసలు అక్కడ ఏఐ కంప్యూటింగ్ చిప్స్ పనిచేస్తాయో లేదో పరీక్షించేందుకు ప్రాజెక్ట్ సన్‌క్యాచర్ పేరిట ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టింది. భూమిపై డేటా సెంటర్ల ఏర్పాటుకు విపరీతమైన విద్యుత్తుఖర్చవుతుంది. అదే రోదసిలో అయితే.. అపారంగా, అదీ ఉచితంగా లభించే సౌర శక్తిని ఎలాంటి అంతరాయం లేకుండా ఉపయోగించుకుని ఏఐతో మాత్రమే చేయగలిగే పెద్ద పెద్ద పనులను సులువుగా చేసే వీలుంటుంది. అందుకే గూగుల్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా.. ఏఐ చిప్స్‌తో కూడిన టెస్ట్ శాటిలైట్‌ను దిగువ భూకక్ష్యలో ప్రవేశపెట్టేందుకు గూగుల్ ప్రణాళికలు రచిస్తోంది. రాకెట్ ప్రయోగం తాలూకూ ఒత్తిడిని, స్పేస్ రేడియేషన్‌ను, అసాధారణ ఉష్ణోగ్రతలను ఏఐ చిప్స్ తట్టుకోగలవా? లేదా? అనే అంశాన్ని తెలుసుకోవడమే గూగుల్ చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రాథమిక లక్ష్యం. అంతేకాదు.. రోదసిలో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన, అనువైన కొత్త లొకేషన్‌ను ఈ ప్రాజెక్టులో భాగంగా అన్వేషించనున్నారు. అనువైన ప్రదేశం అంటే.. ఉపగ్రహాలు నిరంతరాయంగా సూర్యకాంతిని గ్రహించగలిగే వీలుండే ప్రాంతం. కాగా.. భూమిపై తాము నిర్వహించిన వైబ్రేషన్, రేడియేషన్ పరీక్షల్లో తమ పరికరాలు బాగా పనిచేశాయని గూగుల్ వెల్లడించింది. దిగువ భూకక్ష్యలో అవి ఎలా పనిచేస్తాయో ఈ ప్రయోగం ద్వారా తెలుస్తుందని పేర్కొంది. ఇక.. ఏఐ చిప్స్ పనిచేసే క్రమంలో విపరీతమైన వేడి వెలువడుతుంది.
భూమ్మీద అయితే గాలి ద్వారా అవి కొంత చల్లబడతాయి. పూర్తిగా చల్లబరచడానికి నీటిని వినియోగిస్తారు. కానీ, రోదసిలో గాలి ఉండదు. కాబట్టి, ఏఐ చిప్స్ ఉత్పత్తి చేసే వేడిని బయటకు పంపడానికి ఉపగ్రహంలో ప్రత్యేకమైన పరికరాలను ఉపయోగించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఏఐ సాయంతో క్లిష్టమైన పనులు చేయడానికి.. ఉపగ్రహాలను లేజర్లతో అనుసంధానించాలని గూగుల్ సంస్థ భావిస్తోంది. 2027లో అలా తొలిసారి రెండు శాటిలైట్ల మధ్య అనుసంధానాన్ని పరీక్షించేందుకు ప్లాన్ చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఇటలీ స్కూళ్లలో బురఖాను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు
జిన్‌పింగ్‌కు ట్రంప్ అరుదైన కానుక.. మూడు అడుగుల బాల్డ్ ఈగల్ శిల్పం బహూకరణ