ప్రపంచాన్ని భయపెడుతున్న హంటావైరస్.. ఎలా వ్యాపిస్తుందంటే..
ABN , Publish Date - May 08 , 2026 | 09:25 AM
ఇజ్రాయెల్‌లో నమోదైన కేసును ‘కామన్ యురోపియన్ స్ట్రెయిన్’గా అధికారులు గుర్తించారు. ఈ రకం ఎలుకల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. దీని వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని వైద్య నిపుణులు అంటున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఇజ్రాయెల్ దేశంలో ప్రపంచాన్ని భయపెడుతున్న హంటావైరస్ తొలి కేసు నమోదు అయింది. కొన్ని నెలల క్రితం యూరప్ ట్రిప్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తికి హంటావైరస్ సోకినట్లు శుక్రవారం వైద్యాధికారులు తెలిపారు. హంటావైరస్ లక్షణాలు కనిపించటంతో సదరు వ్యక్తి వైద్యసాయం కోరాడని, పీసీఆర్ టెస్ట్‌తో పాటు యాంటీ బాడీ టెస్ట్ ద్వారా హంటావైరస్‌ను నిర్థారించామని వెల్లడించారు. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖకు తెలియజేశామని అన్నారు.
ఎలుకల నుంచి మనుషులకు..
ఇజ్రాయెల్‌లో నమోదైన కేసును ‘కామన్ యురోపియన్ స్ట్రెయిన్’గా అధికారులు గుర్తించారు. ఈ రకం ఎలుకల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. దీని వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే, సౌత్ అమెరికాకు చెందిన ‘ది యాండెస్ స్ట్రెయిన్’ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఈ రకం చాలా తక్కువ శాతంలో మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తిస్తుందని వెల్లడించారు. ఎంవీ హోండియస్ నౌకలో నమోదైన హంటావైరస్ కేసులు ‘ది యాండెస్ స్ట్రెయిన్’ రకానికి చెందినవని తెలిపారు.
వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
హంటావైరస్ అనేది వైరస్‌ల సమూహం. ఇది ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకల మల,మూత్ర విసర్జనలు.. లాలాజలం ద్వారా ఎలుకల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఎలుకల వ్యర్థాలు ఎండిపోయిన తర్వాత కణాలుగా మారి గాల్లో కలిసిపోతాయి. గాల్లో కలిసిపోయిన ఎలుకల వ్యర్థాల కణాలను పీల్చటం లేదా వైరస్ ఉన్న ఉపరితలాలను తాకిన తర్వాత ముఖాన్ని ముట్టుకోవడం వల్ల మనుషులకు ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది.
లక్షణాలు ఇవి..
శరీరంలోకి వైరస్ ప్రవేశించిన కొన్ని రోజుల తర్వాత లక్షణాలు మొదలవుతాయి. జలుబుతో పాటు జ్వరం, అలసట, కండరాల నొప్పులు, తలనొప్పి వస్తుంది. వైరస్ తీవ్రతను బట్టి ఊపిరితిత్తులు లేదా మూత్రపిండాల సమస్యలకు దారితీయవచ్చు. దీనికి ప్రత్యేకమైన యాంటీవైరల్ చికిత్స లేదు. కాబట్టి ప్రారంభంలోనే వైద్య సహాయం పొందడం చాలా ముఖ్యం. లేదంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంది.
వైరస్ కేసులు నమోదైన దేశాలు..
2026, మే నాటికి 12 దేశాల్లో హంటావైరస్ కేసులు నమోదు అయ్యాయి. అర్జెంటీనా, చిలీ, బ్రెజిల్, పరాగ్వే, కెనడా, అమెరికా, ఫిన్‌లాండ్, జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్, క్రొవాటియా, స్లోవేనియా, నెదర్లాండ్, చైనా, దక్షిణ కొరియా, తుర్కియే, సౌత్ ఆఫ్రికా, కేప్ వెర్డే దేశాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఎంవీ హోండియస్ నౌకలో 8 కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి
భార్యపై భర్త దాడి.. నడి రోడ్డుపై గొంతు కోసేందుకు యత్నం..
హోర్ముజ్‌లో అమెరికా వార్ షిప్‌లపై దాడి.. ఇరాన్‌పై ట్రంప్ ఆగ్రహం..