ఇరాన్ తీరుతో యూఎస్‌కు అవమానాలు: జర్మనీ ఛాన్సలర్
ABN , Publish Date - Apr 27 , 2026 | 09:21 PM
ఇరాన్ తీరుతో అమెరికాకు అవమానాలు ఎదురవుతున్నాయని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ అభిప్రాయపడ్డారు. చర్చల్లో ఇరాన్ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ తీరుతో అమెరికాకు అవమానాలు ఎదురవుతున్నాయని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ అన్నారు. చర్చల కోసం పాక్‌కు వెళ్లిన యూఎస్ నేతలు ఇరాన్ వల్ల ఎలాంటి ఫలితం లేకుండా వెనుదిరగాల్సి వచ్చిందని అన్నారు. ఇరాన్ యుద్ధం నుంచి బయటపడేందుకు అమెరికా వ్యూహం ఏమిటో కూడా తనకు తెలియదని అన్నారు.
‘చర్చల విషయంలో ఇరానీయన్లు చాలా చాకచక్యంగా ఉన్నారు. పాక్‌కు వెళ్లిన అమెరికా నేతలు ఎలాంటి ఫలితం లేకుండా తిరిగి వెళ్లేలా చేశారు’ అని అన్నారు. మార్స్‌బర్గ్‌లోని (జర్మనీ) ఒక స్కూల్ సందర్శనకు సోమవారం వెళ్లిన ఆయన అక్కడి విద్యార్థులతో అంతర్జాతీయ వ్యవహారాలపై మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.
‘ఇరాన్ నాయకులు, ముఖ్యంగా ఇరాన్ సైనిక దళం కారణంగా ఒక దేశం (యూఎస్) అవమానాల పాలవుతోంది. ఈ యుద్ధం త్వరగా ముగిసిపోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఇరాన్‌ను తక్కువ అంచనా వేసినట్టు ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అంచనాలకు మించి వారు శక్తిమంతంగా ఉన్నట్టు అనిపిస్తోందని అన్నారు.
ఇరాన్ యుద్ధం విషయంలో తన అనుమానాలను నేరుగానే యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌తో పంచుకున్నానని కూడా చెప్పారు. యుద్ధం ఆరు వారాల పాటు సాగడమే కాకుండా మరింత తీవ్రంగా మారుతుందని భావించి ఉంటే తన అభిప్రాయాలను మరింత స్పష్టంగా చెప్పి ఉండేవాడినని కూడా మెర్జ్ అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్ ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇస్తాము: రష్యా అధ్యక్షుడు పుతిన్
మరో ఆయిల్ ట్యాంకర్‌ను టార్గెట్ చేసిన ఇరాన్