మా మాట వినరా?
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:48 AM
దుర్భరమైన జీవన పరిస్థితులు, చదువు పూర్తయిన తర్వాత ఉపాధి లభిస్తుందో లేదోనన్న భయం, ఇంకాఇంకా పేదరికంలోకి కూరుకుపోతున్నామన్న నిరాశ,
ప్రపంచవ్యాప్తంగా జెన్‌జీలో అసంతృప్తి
తమ బాధలను ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆక్రోశం
భవిష్యత్తుపై భయాలతో పాలకులపై తిరుగుబాట్లు
యూరప్‌లో ఉద్యమం
న్యూఢిల్లీ, అక్టోబరు 28: దుర్భరమైన జీవన పరిస్థితులు, చదువు పూర్తయిన తర్వాత ఉపాధి లభిస్తుందో లేదోనన్న భయం, ఇంకాఇంకా పేదరికంలోకి కూరుకుపోతున్నామన్న నిరాశ, ఎటుచూసినా అవినీతి, ఏది కొందామన్నా మండిపోతున్న ధరలు.. పైగా ఈ సమస్యల గురించి మాట్లాడితే.. చిన్నపిల్లలు మీకేం తెలుసు? అన్న చిన్నచూపు మాటలు.. వెరసి ప్రపంచవ్యాప్తంగా జెన్‌జీ యువతలో తీవ్ర అశాంతిని, ఆగ్రహావేశాలను రగిలిస్తున్నాయి. ఆసియా దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మొదలైన జెన్‌జీ ఉద్యమం ఇప్పుడు యూరప్ ఖండాన్ని కుదిపేస్తోంది. యూర్‌పలో ఉద్యమాలకు పుట్టినిల్లు లాంటి ఫ్రాన్స్ యువత నిరసనలతో మండుతోంది. ఇటలీ, బెల్జియం, అల్బేనియా, సెర్బియాలో నిత్యం ఏదో ఒకచోట నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. వచ్చేవారంలో జర్మనీలోనూ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు అక్కడి యువ సంఘాలు ప్రకటించాయి. సెర్బియాలో గత 14 ఏళ్లుగా అవినీతి, అణచివేతలతో సాగిన అఽధ్యక్షుడు అలెక్సాండర్ ఉసిక్ పాలనకు ఈ నెల 25న జెన్జీలు విజయవంతంగా చరమగీతం పాడారు. యువతలో ఇంతటి ఆగ్రహావేశాలు పెల్లుభికటానికి ఆర్థిక, సామాజిక కారణాలతోపాటు వారి అభిప్రాయాలను పాలకులు పట్టించుకోకపోవటమూ ప్రధాన కారణమని తెలుస్తోంది. ‘మా అభిప్రాయాలను, ఆకాంక్షలను ఎవరూ పట్టించుకోవటం లేదు. సమస్యలపై మేము మాట్లాడటానికి ప్రయత్నిస్తే చిన్నపిల్లలు.. మీకేం తెలుసు అని కొట్టిపారేస్తున్నారు. ప్రభుత్వం మా అభిప్రాయాలకు విలువ ఇవ్వటం లేదు’ అని బెల్జియంకు చెందిన 19 ఏళ్ల విద్యార్థి మాయా గార్డెల్ ఆవేదన వ్యక్తంచేశారు. విద్యాసంస్థల్లో టీచర్లతోపాటు సౌకర్యాల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు.
కొన్ని పాఠశాల భవనాలు ఎప్పుడు కూలిపోతాయో కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి పెరిగిపోయిందని, నిత్యావసరాల ధరలు, ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరిగాయని వెల్లడించారు. ‘పాలకులు మా భవిష్యత్తును, కలలను దోపిడీ చేస్తున్నారన్న భావన నాలాగే యువత అందరిలో ఉంది. కష్టపడి చదివినా ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం లేదు’ అని ఆమె తెలిపారు.
ఆర్థిక ఒత్తిడి, సామాజిక భద్రతా భారం..
దేశాలు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాయి. దాదాపు పది కోట్ల మంది పేదరికం, సామాజిక వేర్పాటు ముప్పును ఎదుర్కొంటున్నారు. నిధుల కొరతతో ప్రభుత్వాలు వారిని ఆదుకోలేకపోతున్నాయి. పైగా సామాజిక భద్రత పథకాలకు కోతలు పెడుతున్నాయి. వీరిలో అత్యధికంగా 26.3 శాతం 18-24 ఏళ్లలోపు వారే ఉన్నారు. మరోవైపు వృద్ధుల జనాభా పెరిగిపోతుండటంతో వారి సంక్షేమానికి తాము అధికంగా కష్టపడాల్సి వస్తోందని యువత భావిస్తోంది. ఫ్రాన్స్‌లో 60 ఏళ్లు దాటినవారు దేశ జనాభాలో పావు వంతు ఉండగా, దేశ సంపదలో 60 శాతం వారి చేతుల్లోనే ఉంది. గ్రీస్, ఇటలీల్లో ఆ దేశాల జీడీపీలో 16 శాతాన్ని పెన్షన్ల కోసమే ఖర్చు చేస్తున్నారు. ఫ్రాన్స్‌లో ఇది 14 శాతంగా ఉంది. ఇది కూడా యువతలో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోందని ప్యారిస్ కు చెందిన 17 ఏళ్ల బిలాల్ నర్జిస్సి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్‌పై మోదీ సెటైర్.. బ్యాలెట్ పేపర్‌తో ఎన్ని సీట్లు వచ్చాయంటూ పోస్ట్
పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఒకరి మృతి