ఫ్రాన్స్‌ను వణికిస్తున్న బడిపిల్లలు
ABN , Publish Date - Oct 08 , 2026 | 03:02 AM
ఫ్రాన్స్‌ను పాఠశాల విద్యార్థులు వణికిస్తున్నారు. జెన్ ఆల్ఫా దెబ్బకు అక్కడి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
పాఠశాలల్లో సౌకర్యాలు, టీచర్ల కొరతపై మహోద్యమం.. ఒక్క పాఠశాలలో మొదలై దేశవ్యాప్తంగా విస్తరణ
రోడ్లపైకి 4.5 లక్షల మంది విద్యార్థులు
అణచివేతతో నిరసనలు హింసాత్మకం
ప్యారిస్, అక్టోబరు 7: ఫ్రాన్స్‌ను పాఠశాల విద్యార్థులు వణికిస్తున్నారు. జెన్ ఆల్ఫా దెబ్బకు అక్కడి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక్క పాఠశాలలో ప్రారంభమైన నిరసన.. దావానలంలా దేశం మొత్తాన్ని చుట్టుముట్టింది. ప్రభుత్వాన్నే కదిలిస్తున్న ఈ ఉద్యమకారులంతా 15-18 ఏళ్లలోపు వారే. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ సోషల్‌మీడియా వేదికలనే ప్రధాన ప్రచార మాధ్యమాలుగా చేసుకొని దేశం నలుమూలలా వీధులను ముంచెత్తుతున్నారు. ఉద్యమంపై ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రభుత్వం కఠిన అణచివేతకు దిగింది. ఇప్పటివరకు దాదాపు 6వేల మందిని అరెస్టు చేసింది. దీంతో ఉద్యమం తీవ్రంగా, హింసాత్మకంగా మారింది.
ఇలా మొదలైంది..
ఫ్రాన్స్‌లో పాఠశాల విద్యలో వివిధ స్థాయిలు ఉంటాయి. 3-6 ఏళ్ల పిల్లలు చదివే పాఠశాలను ఎకోల్ మాటెర్నెల్ (కిండర్‌గార్డెన్) అంటారు. 1నుంచి 5వ తరగతి వరకు ఉండే పాఠశాలను ఎకోల్ ఎలిమెంటైర్ అంటారు. 6 నుంచి 9 తరగతుల పాఠశాలను కాలేజ్ అంటారు. 10 నుంచి 12వ తరగతి వరకు ఉన్న పాఠశాలను లీసే అంటారు. ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న ఉద్యమం చేస్తున్న విద్యార్థులంతా ఈ లీసే స్థాయివారే. ఫ్రాన్స్‌లో 3,700 లీసే పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎక్కువశాతం పాత భవనాల్లో అంతంత మాత్రం సౌకర్యాలతోనే నడుస్తున్నాయి. ప్రధాన నగరాల్లో ధనికుల పిల్లలు చదివే పాఠశాలల్లో మాత్రమే మంచి సౌకర్యాలు ఉన్నాయి. ఒక్కో క్లాసులో 32 నుంచి 35 మంది విద్యార్థులు ఉంటారు. ఈ స్కూళ్లలో టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ సమయంలోనే ఫ్రాన్స్ ప్రభుత్వం ఆర్థిక పొదుపు చర్యల్లో భాగంగా టీచర్ల మూలవేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది.
దీనిని వ్యతిరేకిస్తూ ప్యారిస్ సమీపంలోని సెయింట్ ఎక్సుపెరీ లీసే స్కూల్‌లో గత నెల 21న టీచర్లు ధర్నాకు దిగారు. ఆ పాఠశాలలో టీచర్ల కొరత కూడా తీవ్రంగా ఉండటంతో కొత్త టీచర్లను నియమించాలని వారు డిమాండ్ చేశారు. వారికి విద్యార్థులు కూడా జతకలవటంతో స్కూలు మూతపడింది. స్పందించిన అధికారులు ఆ పాఠశాలకు కొత్త టీచర్లను పంపారు. అంతటితో సమస్య తీరిందని అనుకున్నారు. కానీ, మరుసటి రోజు నుంచే ఇతర ప్రాంతాల్లోని లీసే స్కూళ్లలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి రోడ్లపైకి వచ్చారు. ఈ నిరసనలు అత్యంత వేగంగా దేశమంతా వ్యాపించాయి.
పోలీసుల తీరుతో హింసాత్మకం
పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలని, కొత్త టీచర్లను నియమించాలని, సెలవుల్లో ఉన్న టీచర్ల స్థానంలో కొత్తవారిని పంపాలని డిమాండ్ చేస్తూ వేలమంది విద్యార్థులు భారీ ప్రదర్శనలు నిర్వహించటం మొదలుపెట్టారు. పోలీసులు ఈ నిరసనలను మొదట తేలిగ్గా తీసుకొని, విద్యార్థులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. నిరసనలు మరింత తీవ్రతరం కావటంతో అణచివేత ప్రారంభించారు. విద్యార్థులపై భాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్లు కూడా ప్రయోగించారు. వందల ప్రదేశాల్లో దారుణంగా లాఠీచార్జీ చేశారు. దొరికినవారిని దొరికినట్లు అరెస్టు చేశారు. దీంతో విద్యార్థులు రెచ్చిపోయారు. పాఠశాలలకు నిప్పు పెట్టారు. స్కూళ్లను బలవంతంగా తెరవటానికి ప్రయత్నించిన పలువురు ప్రిన్సిపాళ్లపై దాడులు చేశారు. ఇప్పటివరకు దాదాపు 100 పాఠశాలలు అగ్నికి ఆహుతయ్యాయి. 6 వేల మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 87 శాతం పాఠశాల విద్యార్థులేనని ప్రభుత్వమే ప్రకటించింది. మార్సీవిల్లే ప్రాంతంలో విధ్వంసం అధికంగా జరిగింది. మంగళవారం దేశవ్యాప్తంగా 4.5 లక్షల మంది నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 488 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల గ్రెనేడ్ పేలి ఓ విద్యార్థి చెయ్యి కోల్పోయాడు.
ఉద్యమంలోకి రాజకీయాలు..
ఈ విద్యార్థుల ఉద్యమానికి మొదట ప్రత్యేకమైన నాయకత్వమంటూ ఏమీ లేదు. క్రమక్రమంగా ఉద్యమానికి వామపక్షాలు మద్దతు ప్రకటించి ప్రత్యక్షంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నాయి. యూనియన్ సిండికేట్ లైసియెన్నే వంటి విద్యార్థి సంఘాలు ఉద్యమంలోకి ప్రవేశించాయి. తాజాగా కార్మిక సంఘాలు, రైతులు కూడా విద్యార్థుల వెంట నడుస్తున్నారు. పోలీసుల దాడుల నుంచి తమ పిల్లలను కాపాడుకొనేందుకు వారి తల్లిదండ్రులు కూడా వస్తున్నారు. లా ఫ్రాన్స్ ఇన్‌సౌమీస్ అనే వామపక్ష పార్టీ విద్యార్థులకు రక్షణగా నిలవాలని తన కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఈ ఉద్యమాన్ని మితవాదులు కూడా వాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి నిరసనల్లో పాల్గొనటాన్ని నేరంగా పరిగణించే కొత్త చట్టం తేవాలని మితవాద నేషనల్ ర్యాలీ నేత మరీన్ లీ పెన్ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఉద్యమంలోకి రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ప్రవేశించటం ప్రభుత్వానికి కూడా అవకాశంగా మారింది. ఇది విద్యార్థుల ఉద్యమం కాదని, ప్రతిపక్ష పార్టీల రాజకీయ కుట్ర అని ప్రధాని సెబాస్టియన్ లీకార్ను ఆరోపించారు. మంగళవారం ఆయన నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘తీవ్రమైన హింస మన పాఠశాలల గుమ్మాల వరకు చేరుకుంది. ఈ హింసను దేశంలోని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలి’ అని పిలుపునిచ్చారు. అదే సమయంలో అణచివేత నుంచి కాస్త వెనక్కు తగ్గారు. అధికారులు ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థుల డిమాండ్లను సావధానంగా వినాలని సూచించారు. నిరసనల కారణంగా ఇప్పటికే దేశంలో 215 మంది విద్యార్థులు, 85 మంది పాఠ శాలల సిబ్బందితోపాటు పోలీసులు కూడా గాయపడ్డారని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్- మేలో దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు విద్యార్థుల ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిని వాడుకొనేందుకు ప్రయత్నించారు. ‘ఇది స్కూళ్లకోసం కాదు. ఒకప్పటి గొప్ప దేశాన్ని ఆక్రమించుకొనేందుకు ఇస్లాం మతం చేస్తున్న ప్రయత్నం’ అని ఆయన మంగళవారం ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. వచ్చే నెల మూడోతేదీన అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడి ఓటర్లలో చీలిక తెచ్చేందుకే ట్రంప్ ఈ ఉద్యమాన్ని బూచిగా చూపుతున్నారని అమెరికా మీడియా పేర్కొంది.
విద్యార్థుల ఉద్యమానికి ప్రధాన కారణాలు
పాఠశాలల్లో సౌకర్యాల కొరత..
వేడి, చలికి తట్టుకొనే పరిస్థితులు కూడా లేకపోవటం.
టీచర్ల కొరత.. ఉన్నవారిలో కూడా ఎక్కువ మంది సెలవుల్లో ఉండటం
క్లాసురూముల్లో పరిమితికి మించి విద్యార్థులను ఉంచటం.
లీసే స్థాయి నుంచి యూనివర్సిటీకి వెళ్లేందుకు నిర్వహించే పోటీ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకొనేందుకు ఉద్దేశించిన పర్‌కూర్సప్ వెబ్‌సైట్ లోపాలమయంగా మారటం.
ఆర్థిక పొదుపు చర్యల్లో భాగంగా విద్యారంగానికి నిధుల కోత పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించటం. టీచర్ల వేతనాల్లోనూ కోత పెట్టాలని ప్రభుత్వం చూస్తోందనే వార్తలు అగ్నికి ఆజ్యం పోశాయి.
ఈ వార్తలు కూడా చదవండి
రసాయన శాస్త్రంలో కగాన్, సోయైలకు నోబెల్ పురస్కారం
భారతీయులున్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి