Share News

'ఫ్లైదుబాయ్' ఫ్లైట్ ఘటన.. కో-పైలట్ దాడిని తిప్పికొట్టిన ప్రయాణికులు!

ABN , Publish Date - Sep 30 , 2026 | 07:51 PM

'ఫ్లైదుబాయ్' ఫ్లైట్ ఘటనలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కొందరు ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి కాక్‌పిట్ తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించి పెద్దముప్పును తప్పించినట్టు తెలుస్తోంది.

'ఫ్లైదుబాయ్' ఫ్లైట్ ఘటన.. కో-పైలట్ దాడిని తిప్పికొట్టిన ప్రయాణికులు!
Flydubai Plane Incident: Passengers Overpower Pilot After Cockpit Attack

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 30: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన 'ఫ్లైదుబాయ్' (FZ 1073) విమానంలో గాల్లో ఉండగానే ఊహించని భయాందోళనకర పరిస్థితి నెలకొంది. విమానం ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్ లోపల ఇద్దరు పైలట్ల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఒక పైలట్ తోటి పైలట్‌పై కత్తితో దాడి చేసి, విమానాన్ని కూల్చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ సమయంలో విమానం తీవ్ర ఒడుదొడుకులకు లోనై కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే దాదాపు 17,400 అడుగుల కిందకు పడిపోయిన సంగతి తెలిసిందే.


అదే సమయంలో కాక్‌పిట్ నుంచి అత్యవసర, హైజాక్ సంకేతాలు వెళ్లడంతో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దింపింది. విమానంలో భయాందోళనలు వ్యక్తమవడంతో, కొందరు ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి కాక్‌పిట్ తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించినట్టు తెలుస్తోంది. రక్తం ఓడుతున్న గాయపడిన పైలట్‌ను కాపాడి, దాడికి పాల్పడిన వ్యక్తిని ప్రయాణికులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.


ఆ తర్వాత విమానంలో ప్రయాణిస్తున్న ఆఫ్-డ్యూటీ పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానాన్ని సౌదీ అరేబియాలోని 'తబుక్' విమానాశ్రయంలో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తిని సౌదీ అధికారులు అదుపులోకి తీసుకోగా, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని, ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాద కోణాన్ని కూడా విచారిస్తున్నామని అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలూ చదవండి

సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్

ఏఐతో మానవాళికి ముప్పే!

Updated Date - Sep 30 , 2026 | 07:51 PM