Share News

చీలిక దిశగా యూకే? కీలక పరిణామాలు

ABN , Publish Date - Sep 13 , 2026 | 08:56 PM

యూకేలో చీలిక దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. స్కాట్‌లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాలు యూకే నుంచి వేరుపడే దిశగా అడుగుల వేస్తున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

చీలిక దిశగా యూకే?  కీలక పరిణామాలు
UK PM Andy Burnham

ఇంటర్నెట్ డెస్క్: యూకేలో చీలిక దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. స్కాట్‌లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాలు యూకే నుంచి వేరుపడే దిశగా అడుగుల వేస్తున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు కోసం ఫస్ట్ మినిస్టర్స్ (ముఖ్యమంత్రులు) జాన్ స్విన్నీ (స్కాట్‌లాండ్), హ్రూన్ అప్ యోర్వర్త్ (వేల్స్), మిషెల్ ఓ నీల్ (ఉత్తర ఐర్లాండ్) కార్డిఫ్ నగరంలో రేపు సమావేశం కానున్నారు. ప్రజాస్వామ్య మార్గాల్లో యూకే నుంచి వేరు పడే హక్కును కోరుతూ తీర్మానం చేయనున్నారు. ఇంగ్లండ్, వేల్స్, స్కాట్‌లాండ్, ఉత్తర ఐర్లాండ్‌ను కలిపి యూనైటెడ్ కింగ్‌డమ్ అంటారన్న విషయం తెలిసిందే.


అసలేం జరిగిందంటే..

ఇటీవల యూకే ప్రధాని ఆండీ బర్న్‌హామ్ చేసిన ఓ ప్రకటనతో వేర్పాటు డిమాండ్స్ మళ్లీ మొదలయ్యాయని అక్కడి విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని మాట్లాడుతూ స్కాట్‌లాండ్ స్వాతంత్ర్యంపై మరో రెఫరెండమ్‌ను నిర్వహించేందుకు తాము సిద్ధమేనని పొరపాటున ప్రకటించారు. ఆ వెంటనే తేరుకున్న ఆయన స్కాట్‌లాండ్ నేతలకు లేఖ రాస్తూ రెఫరెండమ్‌కు అవకాశమే లేదని తేల్చి చెప్పినప్పటికీ జరగవల్సిన నష్టం జరిగిపోయింది.

ఇటీవలి ఎన్నికల్లో లేబర్ పార్టీ అపజయాలు ఎదుర్కోవడంతో అక్కడి రాజకీయాల్లో కీలక మార్పులు మొదలయ్యాయి. వేల్స్‌కు స్వయం ప్రతిపత్తిని కోరుతున్న ప్లెయిడ్ కమ్రీ అక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించింది. పార్టీ నేత హ్రూన్ ఆప్ యోర్వర్త్ ఫస్ట్ మినిస్టర్‌గా ఎన్నికయ్యారు. స్కాట్‌లాండ్‌లో ఎన్ఎన్‌పీ బలమైన రాజకీయ శక్తిగా కొనసాగుతోంది. ఇక ఉత్తర ఐర్లాండ్‌లో షీన్ ఫెయిన్ పార్టీ శక్తివంతమైన పార్టీగా కొనసాగుతోంది. మిషెల్ ఓ నీల్ ఫస్ట్ మినిస్టర్‌గా ఉన్నారు. యూకే నుంచి స్వేచ్ఛ కోరుతూ ఈ మూడు పార్టీలు ఒక్కతాటిపైకి రావడం చరిత్రలో ఇదే తొలిసారని అక్కడి రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు కూడా ఈ మూడు పార్టీలకు కొత్త బలాన్ని ఇచ్చాయి. ఉత్తర ఐర్లాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ఒక్కటైతే చూడాలని ఉందని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు.


స్వాతంత్ర్యం కోసం ముగ్గురు ముఖ్యమంత్రులూ తీర్మానించినా ఆ కల సాకారం కావడం అంత సులభం కాదని అక్కడి నిపుణులు చెబుతున్నారు. యూకే నుంచి విడివడేందుకు రెఫరెండమ్‌ను అనుమతించే అధికారం కేవలం యూకే పార్లమెంటుకు మాత్రమే ఉందని అంటున్నారు. అయితే, యూకేలో శాశ్వత రాజకీయపరమైన మార్పులు మాత్రం మొదలయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇంగ్లండ్, వేల్స్, ఐర్లాండ్, స్కాట్‌లాండ్ మధ్య వందల ఏళ్ల పాటు జరిగిన యుద్ధాలు, ఒప్పందాల అనంతరం యూకే ఒక దేశంగా ఏర్పడింది. 1536లో వేల్స్ రాజ్యం ఇంగ్లండ్‌లో భాగమైంది. 1707లో జరిగిన విలీన ఒప్పందంతో స్కాట్‌లాండ్ కూడా చేరడంతో గ్రేట్ బ్రిటన్ ఏర్పడింది. అనంతరం 1801లో ఐర్లాండ్ గ్రేట్ బ్రిటన్‌లో ఐక్యం కావడంతో యూనైటెడ్ కింగ్‌డమ్ ఏర్పడింది. ఇక 1922లో ఐర్లాండ్ చీలికతో రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ఉత్తర ఐర్లాండ్ మాత్రం యూకేలో భాగంగా ఉండిపోయింది.


ఈ వార్తలనూ చదవండి:

మరో 25 ఏళ్లల్లో యూఎస్‌ను అధిగమించనున్న భారత్: ఆర్థికవేత్త జెఫ్రీ శాక్స్

బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు

Updated Date - Sep 13 , 2026 | 10:07 PM