కుప్పకూలిన రష్యా సైనిక రవాణా విమానం.. 29 మంది మృతి
ABN , Publish Date - Apr 01 , 2026 | 08:58 AM
రష్యాకు చెందిన సైనిక రవాణా విమానం ఏఎన్-26 ప్రమాదానికి గురైంది. క్రిమియాలో కొండను ఢీకొట్టి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: రష్యాకు చెందిన సైనిక రవాణా విమానం ఏఎన్-26 ప్రమాదానికి గురైంది. క్రిమియాలో కొండను ఢీకొట్టి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 23 మంది ప్రయాణికులు కాగా.. ఆరుగురు సిబ్బంది ఉన్నారు. రష్యా రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఈ ప్రమాదంపై బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మార్కో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఏఎన్-26 సిగ్నల్స్ కోల్పోయిందని తెలిపారు. క్రిమియాలో కొండను ఢీకొట్టి విమానం కుప్పకూలిందని వెల్లడించారు.
విమానంలో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఏఎన్-26 విమానంపై దాడి జరిగిన ఆధారాలు లేవని అన్నారు. సాంకేతిక లోపంతోనే విమాన ప్రమాదం జరిగిందని రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఏఎన్-26 విమానాలు 1969 నుంచి రవాణా సేవలు అందిస్తున్నాయి. గత కొన్నేళ్ల నుంచి ఏఎన్-26 విమానాలు పెద్ద సంఖ్యలో ప్రమాదాలకు గురవుతున్నాయి. 2022లో ఉక్రెయిన్‌కు చెందిన ఏఎన్-26 విమానం ఉక్రెయిన్‌లోని ఆగ్నేయ జపోరిజ్జియా ప్రాంతంలో కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు 2020లో ఈశాన్య ఉక్రెయిన్‌లో ఏఎన్-26 శిక్షణా విమానం కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 27 మంది ఉన్నారు. 26 మంది అక్కడికక్కడే చనిపోగా.. ఒకరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. 2020లో దక్షిణ సూడాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఐదుగురు రష్యన్లతో సహా మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. అలాగే 2017లో పశ్చిమ ఆఫ్రికాలోని కోట్ డి ఐవరీలో ఏఎన్-26 విమానం ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. విమానంలో 10 మంది ప్రయాణిస్తుండగా.. వారిలో నలుగురు మృతి చెందారు.
ఇవి కూడా చదవండి
ఫిపా ప్రపంచ కప్: వరుసగా మూడోసారి.. ప్లే ఆఫ్స్ నుంచే నిష్క్రమించిన ఇటలీ
ఉప్పల్-నారపల్లి ఫై ఓవర్‌కు బండారి రాజిరెడ్డి పేరు