యుద్ధఖైదీల అప్పగింతకు రష్యా, ఉక్రెయిన్ అంగీకారం
ABN , Publish Date - Nov 11 , 2026 | 08:10 PM
అమెరికా చొరవతో గత రెండు రోజులుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపించింది. యుద్ధ ఖైదీలను పరస్పరం అప్పగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా చొరవతో గత రెండు రోజులుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపించింది. యుద్ధ ఖైదీలను పరస్పరం అప్పగించేందుకు ఇరు దేశాలు తాజాగా అంగీకరించాయి. అబుదాబీ వేదికగా జరుగుతున్న చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరినట్టు రష్యా తరఫున చర్చల్లో పాల్గొన్న వ్లాదిమిర్ మెదిన్స్కీ తెలిపారు. ఇతరత్రా అంశాలపై కూడా కొంత వరకూ అవగాహన కుదిరిందని అన్నారు.
అయితే, యుద్ధం ముగించే దిశగా ఆశించిన మేర అడుగులు పడలేదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇక ఎంతమంది యుద్ధ ఖైదీలను అప్పగించేదీ గురువారం నిర్ణయిస్తామని అమెరికా ప్రత్యేక ప్రతినిధి జేరెడ్ కుష్నర్ తెలిపారు. చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయాల గురించి తాను, మరో ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్తో కలిసి మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వివరిస్తానని చెప్పారు. చర్చల్లో గుర్తించిన అంశాలపై మరింత పురోగతి సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు.
ఇలాంటి యుద్ధ ఖైదీల అప్పగింత కార్యక్రమాలు గతంలో కూడా జరిగాయని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతటి ఉన్నతస్థాయి దౌత్యచర్చలు లేకుండానే ఇరు దేశాలు సుమారు 100 నుంచి 300 వరకూ ఖైదీలను ప్రత్యర్థి దేశానికి పలుమార్లు అప్పగించాయని అన్నారు. ఈసారి కార్యక్రమానికి కాస్తంత ప్రాధాన్యం ఏర్పడాలంటే కనీసం 1000 - 1500 మంది ఖైదీలను ఇరు దేశాలు పరస్పరం అప్పగించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. భూభాగాల విషయంలో ఏకాభ్రియాన్ని సాధించడమే అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని చెప్పారు. భవిష్యత్తులో కూడా మరిన్ని చర్చలు జరుగుతాయని రష్యా ప్రతినిధి మెదిన్స్కీ తెలిపారు. ఈ చర్చల్లో ఐరోపా సామఖ్య పాల్గొన్నా తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని ఆయన అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీలంక గైడ్‌ను సముద్రంలోకి తోసిన ఇజ్రాయెల్ పర్యాటకుడు
నెతన్యాహు ప్రసంగిస్తుండగా భార్య సారా వాగ్వాదం.. ఇజ్రాయెల్ పార్లమెంట్లో కలకలం!