Share News

ఏఐ ఎఫెక్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకూ ముప్పు

ABN , Publish Date - Oct 27 , 2026 | 07:23 PM

ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్న నేదర్‌లాండ్స్ ప్రభుత్వం కూడా ఏఐ బాటపట్టింది. రాబోయే కొన్నేళ్లల్లో సుమారు 25 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించి వారి బాధ్యతలను ఏఐకి అప్పగించేందుకు నిర్ణయించింది.

ఏఐ ఎఫెక్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకూ ముప్పు
Dutch Government

ఇంటర్నెట్ డెస్క్: ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్న నేదర్‌లాండ్స్ ప్రభుత్వం కూడా ఏఐ బాటపట్టింది. రాబోయే కొన్నేళ్లల్లో సుమారు 25 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించి వారి బాధ్యతలను ఏఐకి అప్పగించేందుకు నిర్ణయించింది. కట్టుతప్పుతున్న ప్రభుత్వ ఖర్చులకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2027 నాటికి ఏటా 900 మిలియన్ యూరోల పొదుపును లక్ష్యంగా పెట్టుకుంది. 2035 నాటికి ఏటా 3.5 బిలియన్ డాలర్లు ఆదా చేసుకోవాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా ఉద్యోగుల సంఖ్యను కుదించేందుకు నిర్ణయించింది.


ప్రస్తుతం అక్కడి ప్రభుత్వంలో 1.6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 2018 తరువాత వీరి సంఖ్య 41 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో కఠిన నిర్ణయాలకు సిద్ధమేనని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఉద్యోగుల స్థానంలో ఏఐ వినియోగంతో ప్రభుత్వ కార్యకలాపాల్లో ఉత్పాదకతను 20 శాతం మేర పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ఓ ప్రణాళికను మంత్రివర్గం వచ్చే ఏడాది పార్లమెంటు ముందుకు తీసుకురానుంది. ఈ దిశగా వివిధ శాఖల్లోని ఐటీ మౌలిక వసతులను ఏకీకృతం చేసేందుకు నిర్ణయించింది. పాలనను సులభతరం చేసేందుకు ఏటా 500 రకాల వ్యర్థ నిబంధనలను కూడా వదిలించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.


ఇకపై కొత్త ఉద్యోగులను నియమించుకునే ముందు ఏఐతో పని జరుగుతుందా లేదా అని పరిశీలించే నియామకాలు చేపట్టనుంది. దేశానికి కీలకమైన పోలీసింగ్, డిఫెన్స్ విభాగాల్లో కోతలు ఉండవని తెలుస్తోంది. ఇతర విభాగాల్లో మాత్రం 45 నుంచి 60 శాతం వరకూ కోతలు ఉండే అవకాశం ఉంది. వాస్తవానికి డచ్ ప్రభుత్వ బడ్జెట్ లోటు 1.8 శాతం. యావత్ ఐరోపాలో ఇదే అత్యంత కనిష్టం. అయినప్పటికీ డబ్బు విషయంలో ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికా భారీ సైనిక ప్రణాళిక.. భారీ యుద్ధం వచ్చినా 90 రోజులు పనిచేసేలా..

2023 అక్టోబర్‌లో ఉగ్రదాడి తర్వాత ఇజ్రాయెల్‌లో మొదటిసారి ఎన్నికలు

Updated Date - Oct 27 , 2026 | 07:23 PM