షాడో సుప్రీం లీడర్ టు సుప్రీం లీడర్.. మొజ్తాబా గురించి ఈ విషయాలు తెలుసా?..
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:40 AM
ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ మొజ్తాబాను కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నిక చేశారని సమాచారం. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పదవిలో లేని మొజ్తాబా ఒక్కసారిగా సుప్రీం లీడర్‌గా ఎన్నికవ్వటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
టెహ్రాన్, మార్చి 4: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ స్థానంలో ఆయన కుమారుడు మొజ్తాబా హుస్సేన్ ఖమేనీ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికైనట్లు తెలుస్తోంది. సుప్రీం లీడర్ రేసులో మొజ్తాబాతో పాటు ఇబ్రహీం రైసి, సాధిక్ లర్జానీలు ఉన్నప్పటికి రెవల్యూషనరీ గార్డ్స్ మాత్రం మొజ్తాబా వైపు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ మొజ్తాబాను కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నిక చేశారని సమాచారం. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పదవిలో లేని మొజ్తాబా ఒక్కసారిగా సుప్రీం లీడర్‌గా ఎన్నికవ్వటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
షాడో సుప్రీం లీడర్ టు సుప్రీం లీడర్
మొజ్తాబా హుస్సేన్ ఖమేనీ 1969లో పవిత్ర నగరం మషాద్‌లో జన్మించారు. దివంగత సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి ముజ్తాబా రెండవ కుమారుడు. స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత మతాధికారి అవ్వటం కోసం ఇస్లామిక్ థియాలజీ వైపు వచ్చారు. తండ్రి సుప్రీం లీడర్ కావటంతో మొజ్తాబాకు రెవల్యూషనరీ గార్డ్స్‌తో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఇరాన్, ఇరాక్ యుద్ధం జరిగినపుడు మొజ్తాబా ఆర్మీలో కూడా పని చేశారు.
ప్రభుత్వ పదవి లేకపోయినప్పటికి, సీనియర్ మతాధికారి కాకపోయినప్పటికి ప్రభుత్వ వ్యవస్థలను మాత్రం తీవ్రంగా ప్రభావితం చేసేవారన్న ప్రచారం ఉంది. ఇరాన్ బ్యాంకింగ్ వ్యవస్థ ఆయన గుప్పిట్లోనే ఉండేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ పదవి లేకపోయినప్పటికి తండ్రి తరఫున మొజ్తాబా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడన్న కారణంతో 2019లో యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఆయనపై ఆంక్షలు సైతం విధించింది. గత సంవత్సరం దివంగత సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తన వారసులు అయ్యే అవకాశం ఉన్న వారి పేర్ల లిస్ట్‌ను తయారు చేశారు. ఆ లిస్ట్‌లో మొజ్తాబా పేరు లేకపోవటం గమనార్హం. అయితే, ఖమేనీ హత్యతో ఊహించని విధంగా ఖమేనీ వారసుడిగా మొజ్తాబా పేరు తెరపైకి వచ్చింది. రెవల్యూషనరీ గార్డ్స్‌తో ఉన్న సంబంధాల కారణంగా మొజ్తాబానే సుప్రీం లీడర్‌గా ఎంపికైనట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
నువ్వు.. నీ వాళ్లు.. ఓ హెల్మెట్